ఈ పాపానికి బాధ్యులెవరు!
దిమాపూర్: వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది భారత న్యాయవ్యవస్థ మూలసూత్రం. మరి నిర్దోషికే శిక్ష పడితే. అదీ చట్టం చేతుల్లో కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ప్రజల చేతుల్లో శిక్ష పడితే...ఆ పాపం ఎవరిది? నాగా యువతిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో మార్చి ఐదో తేదీన సయ్యద్ షరీఫ్ ఖాన్ అనే యువకుడిని దిమాపూర్ సెంట్రల్ జైల్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి రాళ్లతో కొట్టి చంపిన సంఘటనపై ఇప్పుడు అలాంటి సందేహాలే బలపడుతున్నాయి. సంఘటనకు ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే షరీఫ్ ఖాన్ నిర్దోషిత్వాన్నే సూచిస్తున్నాయి.
ఇదే రేప్ కేసులో అరెస్టైన షరీఫ్ ఖాన్ సహచరుడు అదే జైల్లో షరీఫ్ ఖాన్ గదిలోనే ఉన్నా ఎవరూ అతని జోలికి వెళ్లలేదు. అతను నాగా జాతీయుడవడమే కారణమా! ఖాన్ హత్యకు ముందు నాగా యువకులు సామాజిక వెబ్సైట్ల ద్వారా నాగా యువతులను తీవ్రంగా రెచ్చగొట్టారు. స్వరాష్ట్రంలో పరాయి బతుకీడిస్తున్నామని, ఉపాధి అవకాశాలన్నింటినీ అస్సాం, బీహార్, మణిపూర్, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు కొట్టేస్తున్నారనే ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న నాగా యువతులు వాటికి రెచ్చిపోవడం సహజమే. తోటి నాగా యువతిని బంగ్లా నుంచి వచ్చిన శరణార్థి రేప్ చేస్తే మీలో రక్తం కుతకుతా ఉడకడం లేదా? అంటూ సామాజిక వెబ్సైట్లలో నాగా యువతులను రెచ్చగొట్టారు. ఖాన్‌ను కొట్టి చంపేటప్పుడు ‘నాగా యువతులపై బంగ్లా వలసదారుల అత్యాచారాలకు ఇదే చరమగీతం’ అంటూ నినాదాలు ఇచ్చారని సంఘటన జరిగిన దిమాపూర్ కూడలిలోనే వ్యాపారం చేసుకుంటున్న ఫరీద్ ఖాన్ తెలిపారు. ఆయన నాగా యువతిని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారు. షరీఫ్ ఖాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారుడు కాదని నాగా ప్రభుత్వమే ధ్రువీకరించింది.
రేప్ కేసులో ఫిబ్రవరి 24వ తేదీన అరెస్టైన షరీఫ్ ఖాన్ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆ యువతితో తనకు గతంలో కూడా సంబంధం ఉందని, ఆమెకు డబ్బులిచ్చి పోయేవాడినని చెప్పాడు. ఆ రోజున కూడా ఐదువేల రూపాయలిచ్చి వెళ్లానని, అయితే మరిన్ని డబ్బులు కావాలంటే ఇవ్వకపోవడంతో రేప్ కేసు పెట్టిందని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే నాగాలాండ్ ముఖ్యమంత్రి జెలియాంగ్ బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకొని సంఘటన పూర్వపరాలను, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు. షరీఫ్ ఖాన్‌ను కొట్టి చంపిన కేసు గురించి మీడియా ప్రశ్నించగా, దర్యాప్తు కొనసాగుతోందని ముక్తిసరిగా సమాధానం ఇచ్చారు.
నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో బ్రిటీష్ హయాంలోనే రైల్వే వ్యవస్థ ఏర్పడింది. రైల్వే సదుపాయం కారణంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. అందుకనే ఉపాధికోసం బంగ్లాదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన అస్సాం, బీహార్, మణిపూర్‌ల నుంచి వలసలు పెరిగాయి. ఇప్పుడు అనేక జాతుల వారు ఇక్కడ నివసిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా వ్యవసాయంపై, వాటి ఉత్పత్తుల వ్యాపారంపై జీవించే నాగా జాతీయులు కొత్త ఉపాధి మార్గాలవైపు మొన్నటివరకు చూడలేదు. 1963లో కొత్త రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భవించినా వారి దుర్భర దారిద్ర్య జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. నాగా యువకులు ఇతర జాతుల పిల్లలను పెళ్లి చేసుకోవడం కూడా పెరిగిపోవడంతో నాగా మహిళల్లో అభద్రతా భావం ఇటీవల మరీ పెరిగిపోయింది. పొట్టకూటి కోసం వారిలో పడుపువృత్తి కూడా పెరిగిపోయింది.