'కిడ్నాపైన ఇంజినీర్లను రక్షించండి'
హైదరాబాద్: నాగాలాండ్‌లో కిడ్నాపైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్ల విడుదల కోసం ఆంధ్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఆ ఇంజినీర్లు విడుదలకు చర్యలు చేపట్టాలని నాగాలాండ్ ప్రభుత్వంతో చర్చించినట్లు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వెల్లడించారు. వారి విడుదలపై నాగాలాండ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుతున్నామని తెలిపారు.
నాగాలాండ్‌లోని పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో విజయవాడకు చెందిన ఇంజినీర్లు ప్రదీశ్ చంద్ర, రఘులు సూపర్ వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన వారు స్వస్థలం విజయవాడకు బయలుదేరేందుకు నాగాలాండ్‌లోని దిమాపూర్ చేరుకున్నారు. ఆ క్రమంలో ఆ ఇద్దరు ఇంజనీర్లతోపాటు మరో వ్యక్తిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అయితే ముగ్గురులో ఓ వ్యక్తి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని... కిడ్నాపైన ఇంజినీర్ల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
దాంతో వారు పృధ్వీ కన్స్ట్రక్షన్ యాజమాన్యంతో సంప్రదించారు. రఘు, ప్రతీశ్ చంద్రలు కిడ్నాప్ అయిన విషయం నిజమేనని.... వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు తమకు అందజేయాలని బోడో తీవ్రవాదులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దాంతో బోడో తీవ్రవాదుల చెరలో ఉన్న తమ వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని రఘు, ప్రతీశ్ చంద్ర కుటుంబసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.