డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ పురస్కారం
తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన పలువురు ప్రముఖులకు తెలుగు, సంస్కృత అకాడమీ పురస్కారాలు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో కవిత్వం-విమర్శ కేటగిరి కింద ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి పురస్కారం అందించారు.
డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకునిగా, అనువాదకుడిగా, అధ్యాపకుడిగా, మీడియా గురుగా సుప్రసిద్ధులు. వివిధ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పని చేసిన ఆయన వాడుక భాష, తెలుగు వ్యాక్యం ప్రధాన అంశాలుగా పలు విశ్వవిద్యాలయాల్లో వందల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఉస్మానియా నుంచి ఎం.ఏ., హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్., తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ చేశారు. తెలంగాణ పోరాట కథలపై ఎం.ఫిల్లో పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. తెలుగు కవిత్వంలో ఆధునికత, ఆవిర్భావ వికాసాలపైన చేసిన మౌలిక సాధికార పరిశోధన సాహితీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది.
నిరంతర భాషా అధ్యయనం కారణంగా శాసన భాష నుంచి వర్తమాన సాహిత్యం వరకు అనేక అంశాలపై పలువేదికల నుంచి సమ్మెట ప్రసంగించారు. హైదరాబాద్‌లో తెలుగు సాహితీ సమితిని స్థాపించి నెల నెలా సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. రావిశాస్త్రి, డాక్టర్ కేశవరెడ్డి రచనలపై కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సదస్సులు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్‌లతో పాటు న్యూఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్, తిరువనంతపురం, సిమ్లాలలో తెలుగు సాహిత్యంపై ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీకి చెందిన గిరిజన, మౌఖిక సాహిత్య కేంద్రంలో క్రియాశీల సభ్యుడిగా తెలుగు ప్రాంతాల గిరిజన సాహిత్యంపై విజయవాడలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సిమ్లాలో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య ఉత్సవంలో గోండుల కథలపై ప్రసంగించారు.
కృష్ణా జిల్లా నెమ్మలూరుకు చెందిన డాక్టర్ సమ్మెట, నిడుమోలు, మచిలీపట్నం, హైదరాబాద్, రాజమండ్రిల్లో విద్యాభ్యాసం చేశారు. న్యూఢిల్లీలో ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్‌గా పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పని చేస్తున్నారు. పాతికేళ్ల పాటు కొన్ని వేల సార్లు ఆకాశవాణిలో ఉచ్చారణ దోషం లేకుండా వార్తలు చదవడం తన భాషా సేవలో భాగమని తెలిపారు. తెలుగు, సంస్కృత అకాడమీ అవార్డు తన బాధ్యత మరింత పెంచిందని డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు అన్నారు.