nagan janardhan reddy
-
కాంగ్రెస్ అవినీతే అడ్డంకి..సారీ సారీ
హైదరాబాద్ : కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి అని వ్యాఖ్యానించి కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి నాలిక కరుచుకున్నారు. అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్ఎస్ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అని విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారన్న టీఆర్ఎస్ నేతల మాటలను ఖండిస్తున్నానని చెప్పారు. ఎవరు కట్టెలు పెడుతున్నారు.. ఎవరి కాళ్లలో పెడుతున్నారు.. హరీష్ రావు కాళ్లలో పెట్టినారా లేక కేసీఆర్ కాళ్లలో పెట్టినారా అని సూటిగా ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పెద్ద యూజ్‌లెస్‌ఫెల్లో అని తీవ్రపదజాలం వాడారు. కేసీఆర్, హరీష్‌ల అవినీతి బయటపెడతా అని వెల్లడించారు. కాళేశ్వరం పేరుతో బాంబే తమాషా చూపిస్తున్నారని, కాళేశ్వరం మోటార్లు కాంగ్రెస్ హయాంలో తెచ్చినవే కదా అని వ్యాఖ్యానించారు. ఆర్టీఐలో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడెకరాల భూ పంపిణీ ఏం అయిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు వంద సీట్లు ఎలా వస్తాయో చూసుకుందామని అని అన్నారు. నాకు సెక్యూరిటీ తొలగిస్తే భయపడనని, ప్రజలే తనకు సెక్యూరిటీ ఉంటారని చెప్పారు. తాను తప్పు చేస్తే తనను జైల్లో పెట్టండి..రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎందుకు పూర్తి చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం కోసమే రీడిజైన్, రీఎస్టిమేషన్‌లు వేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నాగం జనార్దన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రవేశ పెట్టిన 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు. -
బీజేపీ కొత్త కార్యవర్గంపై నాగం గుస్సా!
బీజేపీ కొత్త కార్యవర్గం కూర్పుపై ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి మండిపడుతున్నారు. కేవలం ఒక్క ఏడాది కోసం వేసిన కమిటీలో కూడా తనవాళ్లకు చోటు లభించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కూర్పు విషయంలో కూడా సరైన న్యాయం జరగలేదని, కేవలం అగ్రవర్ణాలకే కీలక పదవులు అప్పజెప్పారు తప్ప.. బీసీలు, ఎస్సీలను సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై నాగం జనార్దనరెడ్డి అనుచరులు కూడా గుర్రుగా ఉన్నారు. తమకు కచ్చితంగా రావాల్సిన పదవులు కూడా రాలేదని అంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో నాగం ఓడిపోవడంతో ఆయన్ను పక్కన పెట్టాలనే ఇలా చేస్తున్నారన్నారు. రాష్ట్ర కమిటీలో చోటు లభించకుండా వేరే ఏమిచ్చినా ఎందుకని వాళ్లు అడుగుతున్నారు. అయినా తాము పార్టీలోనే ఉంటామని, పార్టీ కోసం కష్టపడతామని చెబుతున్నారు. -
సిద్దిపేట నుంచే టీఆర్ఎస్లో ముసలం: నాగం
టీఆర్ఎస్లో ముసలం సిద్దిపేట నుంచే పుడుతుందని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరీష్ రావు నుంచి అసమ్మతి భయం ఉంది కాబట్టే సంఖ్య పెంచుకోడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం జరిగిన టీడీపీ, బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ నేత రమణ తదితరులు హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నోటీ మునిగిపోతే పట్టించుకోని మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణలో ఉందో లేదో హరీష్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు.