nagara panchaithy
-
కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో కొత్తగా మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలు త్వరలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. నెలాఖరులోగా ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం మూడుగా ఉన్న నగర పంచాయతీల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీలుండేవి. ఆ తర్వాత ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను 2011లో నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా ఇటీవలే మచిలీపట్నం మున్సిపాలిటీని జూలై 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. తాజాగా 20వేల జనాభా కల్గిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఐదు మేజర్ పంచాయతీలు గ్రేడ్–3 మున్సిపాల్టీలు(నగర పంచాయతీలు) ఏర్పాటు కాబోతున్నాయి. దశాబ్దకాలంగా పెండింగ్.. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 మేలో అప్పటి ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కోరినా నగర పంచాయతీల ఏర్పాటు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం అదే దిశగా 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ప్రకటనలతో సరిపెట్టకుండా వెంటనే కార్యచరణలో పెట్టింది. ఐదు పంచాయతీలు ఇవే.. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. 2019 ప్రొజెక్టడ్ జనాభా లెక్కల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ జనాభా 27,298, కైకలూరులో 24,486, మైలవరంలో 25027, పామర్రులో 24,604, విస్సన్నపేటలో 20,530 మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయకుండానే ఈ ఐదు పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే వీలుంది. అయితే అవనిగడ్డ నగర పంచాయతీలోకి పులిగడ్డ, రామకోటిపురం పంచాయతీలతో పాటు వేకనూరు పంచాయతీ పరిధిలోని గుడివాకవారిపాలెంలను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది. అలాగే మైలవరం నగర పంచాయతీలోకి వేల్వాడు, పామర్రు నగర పంచాయతీలోకి కనువూరు, కురుమద్దాలి, విస్సన్నపేట నగర పంచాయతీలోకి చండ్రుపట్ల, పాతగుంట్ల పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాల విలీనం చేసినా చేయకున్నా ప్రతిపాదిత ఐదు మేజర్ పంచాయతీలకు పట్టణ హోదా పొందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపాదనలు రాగానే వాటిని కేబినెట్లో పెట్టి ఆమోద ముద్ర వేయడం.. నగర పంచాయతీల ప్రకటించడం లాంఛనమే కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు జూలై 31వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. – జి.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి -
గుంటూరు జిల్లాలో 3 కొత్త నగర పంచాయతీలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అభివృద్ధి పనులు, ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా త్వరితగతిన వెలువడుతోంది. ఏళ్ల తరబడి కదలని, వదలని సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతోంది. ఇదే కోవలో తాజాగా జిల్లాలో కొత్త నగర పంచాయతీలు ఏర్పాటుకు ముందడుగు పడింది. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలను నగర పంచాయతీలుగా మార్చేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో మేలు చేకూరనుంది. ఇక తమ ప్రాంతంలో సమస్యలు తీరందాటి అభివృద్ధి పరుగులు తీస్తుందని నిజాంపట్నం వాసులు అంటున్నారు. మరో వైపు పలనాడు రాళ్లపై ఇక అభివృద్ధి రాతలు కనిపిస్తాయని గురజాల, దాచేపల్లి–నడికుడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూడు కొత్త నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. మూడు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా నగర పంచాయతీలు ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీ ముందుకు ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి తీసుకెళ్లారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2015లో అప్పటి ప్రభుత్వం మేజర్ పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ఇచ్చిన జీవో తెరమరుగైంది. ఆ జీవోకు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీవం పోసి ఈ నెల 31వ తేదీలోపు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 50 మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడేషన్ చేసేందుకు సంబంధిత వివరాలు పంపాలని కలెక్టర్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కోరారు. ఈ జాబితాలో జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మేజర్ పంచాయతీల సమాచారం సేకరించే పనుల్లో జిల్లా పంచాయతీ(డీపీవో) సిబ్బంది, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అధికారులు నిమగ్నమయ్యారు. 12 అంశాల సేకరణ.. పురపాలక సంఘాలుగా అప్‌గ్రేడ్ చేయడం కోసం ఎంపిక చేసిన మేజర్ పంచాయతీల నుంచి 12 అంశాలపై వివరాలు డీపీవో అధికారులు సేకరించనున్నారు. పంచాయతీలో జనాభా, ఓటర్లు, పాఠశాలల సంఖ్య, వార్షిక ఆదాయం, అప్పులు, ఖర్చులు, విస్తీర్ణం సహా 12 అంశాలపై వారు వివరాలు తీసుకుంటున్నారు. రెండు పంచాయతీలు విలీనం.. మండల కేంద్రానికి 2–3 కి.మీ పరిధిలో ఉన్న పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాంపట్నానికి మూడు కి.మీ పరిధిలో ఉన్న ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలను నిజాంపట్నంలోకి విలీనం చేసి నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. నిజాంపట్నం పంచాయతీలో 19 వేలు, ఆముదాలపల్లి పంచాయతీలో 4 వేలు, బావోపాజీపాలెం పంచాయతీలో 2 వేల జనాభా నివసిస్తున్నారు. అదే విధంగా గురజాల పంచాయతీలో 27 వేలు జనాభా ఉన్నారు. అయితే ఈ గురజాల మండల కేంద్రానికి 3 కి.మీ పరిధిలో ఉన్న జంగమహేశ్వరపురాన్ని కలిపి గురజాల నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దాచేపల్లి మేజర్ పంచాయతీలో 19 వేలు, నడికుడి పంచాయతీలో19 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో దాచేపల్లి–నడికుడి, నిజాంపట్నం, గురజాల పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు పంపామని కోరారు. ఆయా పంచాయతీల్లో జనాభా, విస్తీర్ణం, ఆదాయం, ఖర్చులు, పాఠశాలల సంఖ్య సహా 12 అంశాలపై వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 31వ తేదీలోపు వివరాలు సేకరించి ప్రతిపాదనలు పంపుతాం. – సూర్యప్రకాష్, ఇన్చార్జి డీపీఓ మేజర్ పంచాయతీల పేర్లు జనాభా కుటుంబాలు దాచేపల్లి – నడికుడి 38,462 9,800 నిజాంపట్నం (ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలు కలిపి) 25,547 6,803 గురజాల (జంగమహేశ్వరపురం కలిపి) 28,642 6,932 -
అడిగేదెవరని..!
వివాదాల సుడిలో హుజూరాబాద్ నగర పంచాయతీ హడావుడి నిర్ణయూలు..నిబంధనలకు నీళ్లు ఆర్భాటమెక్కువ... ఆచరణ తక్కువ నిధులు ఫుల్... ప్రణాళిక నిల్ ధనార్జనే ధ్వేయంగావ్యవహరిస్తున్న పాలకవర్గం సతుల పాలనలో పతుల పెత్తనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ నగర పంచాయతీ అక్రమాలకే కాదు... వివాదాలకూ కేరాఫ్‌గా నిలిచింది. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో నిబంధనలను ఉల్లంఘించడం ఇక్కడ షరా మామూలైంది. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరు చేయిస్తుంటే... వాటిని ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాల్సిన పాలకవర్గ సభ్యులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం మంజూరైన రూ.3.24 కోట్ల నిధులను స్వాహా చేసేందుకు మెజారిటీ పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికారులు, పాలకవర్గ సభ్యుల తీరును ‘సాక్షి’ బయటపెట్టడంతో నియోజకవర్గ ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అందులో భాగంగా 2014 జూలైలో కొలువు దీరిన నగర పంచాయతీ పాలకవర్గం నాటి నుంచి నేటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఏవిధంగా వివాదాస్పదమయ్యాయనే వివరాలను పంపుతున్నారు. వారు పంపిన వాటిలో మచ్చుకు కొన్ని ఉదాహరణలను పాఠకుల ముందుంచుతున్నాం. హడావుడి నిర్ణయాలు, ఆపై వివాదాలు పట్టణంలోని అంబేద్కర్ కూడలివద్ద షాపులను, దు కాణాల ముందు రేకులను, మురికి కాలువలను, ఇం దిరమ్మ విగ్రహన్ని కూల్చి వేయడం వివాదాస్పదమైంది. ప్రజాప్రతినిధులు, బాధితులతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.కనీసం ప్రత్యామ్నయం చూపకుండానే హడావుడిగా పొక్లెయిన్లను పెట్టి ఏకపక్షంగా కూల్చివేయడంపై విమర్శలు వచ్చాయి. హనుమాన్ దేవాలయం వద్ద నాలుగు కాళ్ల మండపం నిర్మించాలని హడావుడిగా తీర్మానించిన పాలకవర్గం అందులో భాగంగా నివాస గృహలను తొలగించేందుకు మార్కింగ్ వేయించి కూల్చివేతకు సిద్ధమైంది. ఆందోళన చెందిన బాధితులంతా మంత్రి ఈటలను కలిసి తమ ఇళ్లు కూల్చితే రోడ్డున పడుతామని కన్నీటి పర్యంతమవుతూ గోడు వెళ్లబోసుకోవడం, మంత్రి జోక్యంతో కూల్చివేతల నిర్ణయం పెండింగ్‌లో పడింది. ఐబీ అతిథిగృహం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగి వివాదాలు తలెత్తాయి. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న జెడ్పీ పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నగరపంచాయతీ నుంచి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం సాకుగా చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు హుజూరాబాద్‌లో ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరపంచాయతీ కార్యాలయం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కూడా పంచాయతీ ఉవ్విళ్లూరుతోంది. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రూ. 50 లక్షలతో చమన్ నిర్మిస్తామని ఊహ చిత్రాలు గీయించి ఆర్భాటం చేసినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోగా భవిష్యత్‌లో చమన్ నిర్మాణం జరుగుతుందా? లేదా? అనే అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల నియామకాల్లోనూ కక్కుర్తి? నగరపంచాయితీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల చెల్లింపుల భారం ఎక్కువ అవుతుందని భావించిన పాలకవర్గం మొదట్లో అధికారుల పాలనలో నియమించిన కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ తీర్మానించింది. దీంతో ఆయా కార్మికులంతా కోర్టును ఆశ్రయించడంతో నిర్ణీత గడువు వరకు తొలగించరాదని స్టే ఇచ్చింది. దీంతో సదరు కార్మికులను కొనసాగించేందుకు కొందరు పాలకవర్గ సభ్యులు ఒక్కో కార్మికుడి వద్ద నుంచి రూ.1.50 లక్షలు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ కార్మికులనైతే తొలగించాలని పాలకవర్గం తీర్మానించిందో ఆ కార్మికులే నేడు విధుల్లో కొనసాగుతుండడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. మొక్కలను పెంచండి...చెట్లను నరకండి! హుజూరాబాద్ నగర పంచాయతీ తీరు మొక్కలను పెంచండి-చెట్టను నరుకండి’ చందంగా మారింది. నియోజకవర్గంలో విరివిగా మొక్కలను పెంచాలని నిర్ణయించిన పాలకవర్గ సభ్యులు కొందరు మోడల్ చెరువు, రోడ్డు పక్కనున్న వేప, తుమ్మ చెట్లను నరికివేయడం గమనార్హం. వాస్తవానికి చెట్లు నరకాలంటే తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తహశీల్దార్ ద్వారా డిఎఫ్వో ఆమోదం పొందిన తర్వాత కొన్ని నిబంధనలు పాటించి చెట్లు నరకాలి. ఒక చెట్టు నరికిన తర్వాత మూడు నెలల్లోపు రెండు మొక్కలు నాటాలనే ఒప్పందంతోపాటు ఆ పరిధిని బట్టి నగదు కూడా చెల్లించాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించకుండానే కరెంట్ స్తంభాలకు, డ్రైనేజీకి అడ్డంకిగా మారాయనే సాకుతో రోడ్డు పక్కనున్న వేప చెట్లను నరికివేయించారు. ఎలాంటి టెండర్లు పిలువకుండా నే మోడల్ చెరువులోని లక్షల విలువైన తుమ్మ చెట్లను నరికి వేయించి అమ్ముకున్నారే ఆరోపణలున్నాయి. చెట్ల నరికివేత డబ్బులు పంచాయతీ ఖాతాలో జమ అయ్యాయా? లేదా? అని స్థానికులు కొందరు అధికారులను లిఖితపూర్వకంగా అడిగినప్పటికి వారి నుండి సమాధానం రాకపోవడం గమనార్హం. ప్లానింగ్ వద్దు... ఖర్చు చేయడమే ముద్దు విరివిగా వస్తున్న నిధులను ఎడాపెడా ఖర్చు చేయడమే తప్ప ప్రణాళికాబద్ధంగా పనులు జరగడం లేదనడానికి బండ అంకూస్ వీధిలో నిర్మించిన డ్రైనేజీయే నిదర్శనం. 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ.8లక్షలు విడుదల కాగా, వాటితో ఆగమేఘాల మీద ఈ డ్రైనేజీ నిర్మించి మధ్యలోనే వదిలేశారు. సూపర్‌బజార్, వివేకానందనగర్, బండ అంకూస్ వీధికి సంబంధించిన మురికినీళ్లను ఈ కాలువ ద్వారా శివారులోని గంగన్న కుంటకు తరలించాలి. ఇంతకుముందు చిన్నగా ఉన్న కాలువను తొలగించి ఈ పెద్ద డ్రైనేజీని నిర్మించినా ఫలితం లేకపోయింది. దీంతో మురికినీరంతా డ్రైనేజీలోనే వారంరోజులగా నిల్వ ఉంటోంది. ఈ క్రమంలో దోమలు, ఈగలతో దుర్వాసన వెదజల్లుతూ కాలనీవాసులంతా రోగాలపాలవుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రూ.3.24 కోట్లు విడుదల కావడంతో మధ్యలో వదిలేసిన డ్రైనేజీ పనులను పూర్తి చేస్తారని అంతా భావించారు. అయితే టెండర్లు పిలిచిన 56 పనుల్లో దీని ప్రస్తావన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇష్టారాజ్యంగా నిధుల కేటాయింపు నగర పంచాయతీ పరిధిలో ఏయే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా మురికికాలువలు, సిమెంటు రహదారులు, కల్వర్టులు లేని వార్డులు, వెనుకబడిన కాలనీలకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సినప్పటికీ... అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అభివృద్ధి నిధులను వార్డుల వారీగా పంపిణీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో 20 వార్డులు ఉండగా అభివృద్ధి పనులతో సంబంధం లేకుండా ప్రతీ వార్డుకు రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు కేటాయించారు. అందులోనూ పట్టణంలో అత్యవసరమైన పనులను పక్కనబెట్టి సులభంగా పూర్తిచేసే పనులను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. పనుల ఎంపికలో కూడా పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా రహదారులు లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడేవాళ్లకు ఈ పనుల్లో అన్యాయం జరిగిందనే విమర్శలున్నారుు. సతుల పాలనలో పతుల పెత్తనం మహిళా రిజర్వేషన్ పుణ్యమా అని పది మంది మహిళలు ఇక్కడ కౌన్సిలర్లుగా గెలిచినప్పటికీ వీరి స్థానంలో భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కార్యాలయంలో మహిళా కౌన్స్లర్ల భర్తల పెత్తనంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇన్ని వివాదాలు, కార్యాలయంలో సిబ్బంది పనుల్లో నిర్లక్ష్యం, పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ హుజూరాబాద్ నగరపంచాయతీని ఇటీవల ఉత్త‘మ’ పంచాయితీగా అధికారులు ఎంపిక చేయడం గమనార్హం.