సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అభివృద్ధి పనులు, ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా త్వరితగతిన వెలువడుతోంది. ఏళ్ల తరబడి కదలని, వదలని సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతోంది. ఇదే కోవలో తాజాగా జిల్లాలో కొత్త నగర పంచాయతీలు ఏర్పాటుకు ముందడుగు పడింది. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలను నగర పంచాయతీలుగా మార్చేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో మేలు చేకూరనుంది. ఇక తమ ప్రాంతంలో సమస్యలు తీరందాటి అభివృద్ధి పరుగులు తీస్తుందని నిజాంపట్నం వాసులు అంటున్నారు. మరో వైపు పలనాడు రాళ్లపై ఇక అభివృద్ధి రాతలు కనిపిస్తాయని గురజాల, దాచేపల్లి–నడికుడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మూడు కొత్త నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. మూడు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా నగర పంచాయతీలు ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీ ముందుకు ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి తీసుకెళ్లారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
2015లో అప్పటి ప్రభుత్వం మేజర్ పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ఇచ్చిన జీవో తెరమరుగైంది. ఆ జీవోకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జీవం పోసి ఈ నెల 31వ తేదీలోపు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 50 మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడేషన్ చేసేందుకు సంబంధిత వివరాలు పంపాలని కలెక్టర్‌లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కోరారు. ఈ జాబితాలో జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మేజర్ పంచాయతీల సమాచారం సేకరించే పనుల్లో జిల్లా పంచాయతీ(డీపీవో) సిబ్బంది, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అధికారులు నిమగ్నమయ్యారు.
12 అంశాల సేకరణ..
పురపాలక సంఘాలుగా అప్‌గ్రేడ్ చేయడం కోసం ఎంపిక చేసిన మేజర్ పంచాయతీల నుంచి 12 అంశాలపై వివరాలు డీపీవో అధికారులు సేకరించనున్నారు. పంచాయతీలో జనాభా, ఓటర్లు, పాఠశాలల సంఖ్య, వార్షిక ఆదాయం, అప్పులు, ఖర్చులు, విస్తీర్ణం సహా 12 అంశాలపై వారు వివరాలు తీసుకుంటున్నారు.
రెండు పంచాయతీలు విలీనం..
మండల కేంద్రానికి 2–3 కి.మీ పరిధిలో ఉన్న పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాంపట్నానికి మూడు కి.మీ పరిధిలో ఉన్న ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలను నిజాంపట్నంలోకి విలీనం చేసి నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. నిజాంపట్నం పంచాయతీలో 19 వేలు, ఆముదాలపల్లి పంచాయతీలో 4 వేలు, బావోపాజీపాలెం పంచాయతీలో 2 వేల జనాభా నివసిస్తున్నారు. అదే విధంగా గురజాల పంచాయతీలో 27 వేలు జనాభా ఉన్నారు. అయితే ఈ గురజాల మండల కేంద్రానికి 3 కి.మీ పరిధిలో ఉన్న జంగమహేశ్వరపురాన్ని కలిపి గురజాల నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దాచేపల్లి మేజర్ పంచాయతీలో 19 వేలు, నడికుడి పంచాయతీలో19 వేల మంది జనాభా నివసిస్తున్నారు.
వివరాలు సేకరిస్తున్నాం
జిల్లాలో దాచేపల్లి–నడికుడి, నిజాంపట్నం, గురజాల పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు పంపామని కోరారు. ఆయా పంచాయతీల్లో జనాభా, విస్తీర్ణం, ఆదాయం, ఖర్చులు, పాఠశాలల సంఖ్య సహా 12 అంశాలపై వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 31వ తేదీలోపు వివరాలు సేకరించి ప్రతిపాదనలు పంపుతాం.
– సూర్యప్రకాష్, ఇన్‌చార్జి డీపీఓ
మేజర్ పంచాయతీల పేర్లు | జనాభా | కుటుంబాలు |
దాచేపల్లి – నడికుడి | 38,462 | 9,800 |
నిజాంపట్నం (ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలు కలిపి) |
25,547 | 6,803 |
గురజాల (జంగమహేశ్వరపురం కలిపి) | 28,642 | 6,932 |
Comments
Please login to add a commentAdd a comment