అడిగేదెవరని..! | huzurabad nagara panchaithy in Disputes conflicts | Sakshi
Sakshi News home page

అడిగేదెవరని..!

Published Sun, Jun 28 2015 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

huzurabad nagara panchaithy in Disputes conflicts

    వివాదాల సుడిలో హుజూరాబాద్ నగర పంచాయతీ
     హడావుడి నిర్ణయూలు..నిబంధనలకు నీళ్లు
     ఆర్భాటమెక్కువ... ఆచరణ తక్కువ
     నిధులు ఫుల్... ప్రణాళిక నిల్
     ధనార్జనే ధ్వేయంగావ్యవహరిస్తున్న పాలకవర్గం
     సతుల పాలనలో పతుల పెత్తనం

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
 హుజూరాబాద్ నగర పంచాయతీ అక్రమాలకే కాదు... వివాదాలకూ కేరాఫ్‌గా నిలిచింది. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో నిబంధనలను ఉల్లంఘించడం ఇక్కడ షరా మామూలైంది. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్  సొంత నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరు చేయిస్తుంటే... వాటిని ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాల్సిన పాలకవర్గ సభ్యులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం మంజూరైన రూ.3.24 కోట్ల నిధులను స్వాహా చేసేందుకు మెజారిటీ పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికారులు, పాలకవర్గ సభ్యుల తీరును ‘సాక్షి’ బయటపెట్టడంతో నియోజకవర్గ ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అందులో భాగంగా 2014 జూలైలో కొలువు దీరిన నగర పంచాయతీ పాలకవర్గం నాటి నుంచి నేటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఏవిధంగా వివాదాస్పదమయ్యాయనే వివరాలను పంపుతున్నారు. వారు పంపిన వాటిలో మచ్చుకు కొన్ని ఉదాహరణలను పాఠకుల ముందుంచుతున్నాం.
 హడావుడి నిర్ణయాలు, ఆపై వివాదాలు
 పట్టణంలోని అంబేద్కర్ కూడలివద్ద షాపులను, దు కాణాల ముందు రేకులను, మురికి కాలువలను, ఇం దిరమ్మ విగ్రహన్ని కూల్చి వేయడం వివాదాస్పదమైంది. ప్రజాప్రతినిధులు, బాధితులతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.కనీసం ప్రత్యామ్నయం చూపకుండానే హడావుడిగా పొక్లెయిన్‌లను పెట్టి ఏకపక్షంగా కూల్చివేయడంపై విమర్శలు వచ్చాయి.
 హనుమాన్ దేవాలయం వద్ద నాలుగు కాళ్ల మండపం నిర్మించాలని హడావుడిగా తీర్మానించిన పాలకవర్గం అందులో భాగంగా నివాస గృహలను తొలగించేందుకు మార్కింగ్ వేయించి కూల్చివేతకు సిద్ధమైంది. ఆందోళన చెందిన బాధితులంతా మంత్రి ఈటలను కలిసి తమ ఇళ్లు కూల్చితే రోడ్డున పడుతామని కన్నీటి పర్యంతమవుతూ గోడు వెళ్లబోసుకోవడం, మంత్రి జోక్యంతో కూల్చివేతల నిర్ణయం పెండింగ్‌లో పడింది.
 ఐబీ అతిథిగృహం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగి వివాదాలు తలెత్తాయి. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న జెడ్పీ పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నగరపంచాయతీ నుంచి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం సాకుగా చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు హుజూరాబాద్‌లో ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 నగరపంచాయతీ కార్యాలయం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కూడా పంచాయతీ ఉవ్విళ్లూరుతోంది. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రూ. 50 లక్షలతో చమన్ నిర్మిస్తామని ఊహ చిత్రాలు గీయించి ఆర్భాటం చేసినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోగా భవిష్యత్‌లో చమన్ నిర్మాణం జరుగుతుందా? లేదా? అనే అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
 కార్మికుల నియామకాల్లోనూ కక్కుర్తి?
 నగరపంచాయితీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల చెల్లింపుల భారం ఎక్కువ అవుతుందని భావించిన పాలకవర్గం మొదట్లో అధికారుల పాలనలో నియమించిన కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ తీర్మానించింది. దీంతో ఆయా కార్మికులంతా కోర్టును ఆశ్రయించడంతో నిర్ణీత గడువు వరకు తొలగించరాదని స్టే ఇచ్చింది. దీంతో సదరు కార్మికులను కొనసాగించేందుకు కొందరు పాలకవర్గ సభ్యులు ఒక్కో కార్మికుడి వద్ద నుంచి రూ.1.50 లక్షలు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ కార్మికులనైతే తొలగించాలని పాలకవర్గం తీర్మానించిందో ఆ కార్మికులే నేడు విధుల్లో కొనసాగుతుండడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.
 మొక్కలను పెంచండి...చెట్లను నరకండి!
 హుజూరాబాద్ నగర పంచాయతీ తీరు మొక్కలను పెంచండి-చెట్టను నరుకండి’ చందంగా మారింది. నియోజకవర్గంలో విరివిగా మొక్కలను పెంచాలని నిర్ణయించిన పాలకవర్గ సభ్యులు కొందరు మోడల్ చెరువు, రోడ్డు పక్కనున్న వేప, తుమ్మ చెట్లను నరికివేయడం గమనార్హం. వాస్తవానికి చెట్లు నరకాలంటే తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తహశీల్దార్ ద్వారా డిఎఫ్‌వో ఆమోదం పొందిన తర్వాత కొన్ని నిబంధనలు పాటించి చెట్లు నరకాలి. ఒక చెట్టు నరికిన తర్వాత మూడు నెలల్లోపు రెండు మొక్కలు నాటాలనే ఒప్పందంతోపాటు ఆ పరిధిని బట్టి నగదు కూడా చెల్లించాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించకుండానే కరెంట్ స్తంభాలకు, డ్రైనేజీకి అడ్డంకిగా మారాయనే సాకుతో రోడ్డు పక్కనున్న వేప చెట్లను నరికివేయించారు. ఎలాంటి టెండర్లు పిలువకుండా నే మోడల్ చెరువులోని లక్షల విలువైన తుమ్మ చెట్లను నరికి వేయించి అమ్ముకున్నారే ఆరోపణలున్నాయి. చెట్ల నరికివేత డబ్బులు పంచాయతీ ఖాతాలో జమ అయ్యాయా? లేదా? అని స్థానికులు కొందరు అధికారులను లిఖితపూర్వకంగా అడిగినప్పటికి వారి నుండి సమాధానం రాకపోవడం గమనార్హం.
 ప్లానింగ్ వద్దు... ఖర్చు చేయడమే ముద్దు
 విరివిగా వస్తున్న నిధులను ఎడాపెడా ఖర్చు చేయడమే తప్ప ప్రణాళికాబద్ధంగా పనులు జరగడం లేదనడానికి బండ అంకూస్ వీధిలో నిర్మించిన డ్రైనేజీయే నిదర్శనం. 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ.8లక్షలు విడుదల కాగా, వాటితో ఆగమేఘాల మీద ఈ డ్రైనేజీ నిర్మించి మధ్యలోనే వదిలేశారు.  సూపర్‌బజార్, వివేకానందనగర్, బండ అంకూస్ వీధికి సంబంధించిన మురికినీళ్లను ఈ కాలువ ద్వారా శివారులోని గంగన్న కుంటకు తరలించాలి. ఇంతకుముందు చిన్నగా ఉన్న కాలువను తొలగించి ఈ పెద్ద డ్రైనేజీని నిర్మించినా ఫలితం లేకపోయింది. దీంతో మురికినీరంతా డ్రైనేజీలోనే వారంరోజులగా నిల్వ ఉంటోంది. ఈ క్రమంలో దోమలు, ఈగలతో దుర్వాసన వెదజల్లుతూ కాలనీవాసులంతా రోగాలపాలవుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రూ.3.24 కోట్లు విడుదల కావడంతో మధ్యలో వదిలేసిన డ్రైనేజీ పనులను పూర్తి చేస్తారని అంతా భావించారు. అయితే టెండర్లు పిలిచిన 56 పనుల్లో దీని ప్రస్తావన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
 ఇష్టారాజ్యంగా నిధుల కేటాయింపు
 నగర పంచాయతీ పరిధిలో ఏయే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా మురికికాలువలు, సిమెంటు రహదారులు, కల్వర్టులు లేని వార్డులు, వెనుకబడిన కాలనీలకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సినప్పటికీ... అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అభివృద్ధి నిధులను వార్డుల వారీగా పంపిణీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో 20 వార్డులు ఉండగా అభివృద్ధి పనులతో సంబంధం లేకుండా ప్రతీ వార్డుకు రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు కేటాయించారు. అందులోనూ పట్టణంలో అత్యవసరమైన పనులను పక్కనబెట్టి సులభంగా పూర్తిచేసే పనులను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. పనుల ఎంపికలో కూడా పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా రహదారులు లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడేవాళ్లకు ఈ పనుల్లో అన్యాయం జరిగిందనే విమర్శలున్నారుు.
 సతుల పాలనలో పతుల పెత్తనం
 మహిళా రిజర్వేషన్ పుణ్యమా అని పది మంది మహిళలు ఇక్కడ కౌన్సిలర్లుగా గెలిచినప్పటికీ వీరి స్థానంలో భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కార్యాలయంలో మహిళా కౌన్స్‌లర్ల భర్తల పెత్తనంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇన్ని వివాదాలు, కార్యాలయంలో సిబ్బంది పనుల్లో నిర్లక్ష్యం, పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ హుజూరాబాద్ నగరపంచాయతీని ఇటీవల ఉత్త‘మ’ పంచాయితీగా అధికారులు ఎంపిక చేయడం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement