nagara vanam
-
‘వన’గూరిందేమీ లేదు
సాక్షి, అమరావతి : టీడీపీ నేతల బురిడీ మాటలకు శిలాఫలకాలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి పేరిట వారు చెప్పిన మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. ప్రచార ఆర్భాటం కోసం అనేక హామీలు గుప్పించి ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలను బుట్టలో వేసుకొన్నారు. అభివృద్ధి మంత్రం అని చెప్పి మాయ మాటలతో నమ్మించి వారు చేసిన అభివృద్ధి పనులు శిలాఫలకాల్లో మాత్రమే దర్శనమిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పేరేచర్లలో 531 ఎకరాల్లో విస్తరించి ఉన్న నగరవనంలో పర్యాటకుల కోసం అనేక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అడుగు ముందుకు పడలేదు. పర్యాటకులను ఆకర్షించటానికి మాత్రం ముఖ ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. లోపలకు వెళ్లితే మాత్రం కొండలు, రహదారులు, ఎండిపోయిన మొక్కలు పర్యాటకులను వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. కుటుంబాలతోపాటు వనాన్ని వీక్షించటానికి వచ్చిన వారు ఇక్కడ పరిస్థితిని చూసి నోరెళ్ల బెడుతున్నారు. అనవసరంగా వచ్చామని బాధ పడుతున్నారు. కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే నిధులు ప్రకటించారా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రకరకాల ఔషధ మొక్కలు పెంపకం అని చెప్పారేగానీ అక్కడ అలాంటివేమీ కనిపించకపోగా ఉన్న మొక్కలు కూడా నీరులేక ఎండిపోయాయి. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సైక్లింగ్ చేయటానికి అక్కడ సైకిళ్లు, ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌పూల్ లాంటివి ఏమీ లేవు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నగరవనం గుంటూరు కేంద్రానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ జంటల విడిది ఎక్కువగా కనిపిస్తుంది. వారు తప్పితే వనంలో ఎక్కడా పర్యాటకులు కనిపించకపోవటం గమనార్హం. చుట్టూ ఎత్తయిన కొండలు, పొదలు ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అనుకున్నంత ఏమీ లేదు నగరవనం అని అనేక మంది చెబితే వారాంతంలో సేద తీరటానికి బాగుంటుందని వెళ్లాను. కనీస వసతులు కూడా అక్కడ కనిపించలేదు. అభివృద్ధి చేస్తే పర్యాటకులు దూరం నుంచైనా వస్తారు కానీ ఇలా ఉంటే ఎవరూ రారు. ఇక్కడ కాలుష్యం మినహా ఏమీ లేదు. ప్రచార ఆర్భాటానికి నిధులు కేటాయించామని చెప్పడమేగానీ వాటితో ఏమి అభివృద్ధి చేశారో ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. – షేక్ఇమామ్వలి, మేడికొండూరు అభివృద్ధి ఆనవాళ్లేవీ ? నగరవనం అని ఇక్కడకు వచ్చాం. పిల్లలను కూడా తీసుకొచ్చాం. కానీ వనం లోపలకు వెళితే చెట్లు, కొండలు తప్పితే ఏమీ లేవు. కనీసం పిల్లలు ఆసక్తిగా తిలకించటానికి, వారు ఆడుకోవటానికి ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, ఇక్కడ వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. -
ప్రకృతిలో వికృత చేష్టలు!
పేరేచర్ల(గుంటూరు): పేరేచర్ల ప్రధాన రహదారి పక్కనే 531 ఎకరాల్లో ప్రకృతి రమణీయతను ఆకళింపు చేసుకుని ఉంది నగరవనం. ఇక్కడ ఎత్తైన కొండలు, చెట్లు, వన్యప్రాణులు, ఔషధ మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తాయి. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సేదదీరేందుకు ప్రభుత్వం నగరవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017 నవంబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరవనానికి శంకుస్థాపన చేశారు. ఔషధ మొక్కల పెంపకం, పిల్లల పార్కు, సైక్లింగ్, ట్రెక్కింగ్, జంతుప్రదర్శనశాల తదితరాల ఏర్పాటుకు రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించారు. నగరవనం అందుబాటులోకి వచ్చి ఆహ్లాదం చేరువవుతుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. కొరవడిన నిఘా.. నగరవనంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలోకి జారుకుంది. దీనికి తోడు వనంలో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో పర్యవేక్షణ కొరవడడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆకతాయితీలు ప్రకృతి రమణీయతలో వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాలతో నగరవన వీక్షణకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక అటవీశాఖకు చెందిన అధికారులు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా కనిపిస్తారు లేకపోతే అదీ కూడా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వనంలో కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బోర్డుకే పరిమితమైన పిల్లల పార్కు.. నగరవనంలోకి అడుగుపెట్టగానే కొద్ది దూరంలో పిల్లల పార్కు అని కనబడుతుంది తప్ప పార్కు కనిపించదు. పిల్లల కోసం ఇంత దూరం వస్తే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని పర్యాటకులు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వారు ఆసక్తిగా తిలకించేందుకు బొమ్మలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. నగరవనానికి సమీపంలోనే కొన్ని క్రషర్లు, కంపెనీలు ఉండడంతో వాటి నుంచి వచ్చే పొగ వనాన్ని కమ్మేస్తోంది. దీంతో పర్యాటకులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. నగరవనానికి చుట్టుపక్కల ఉన్న క్రషర్లు, కంపెనీలను వేరే చోటకి మారుస్తానని అప్పుడు అధికారులు, మంత్రులు చెప్పారు కానీ ఆచరణలో పాటించలేదు. పిల్లలను అతిగారాబం చేయకూడదు తల్లిదండ్రులు తమ పిల్లలను అతి గారాబం చేయకూడదు. కొంతవారి పట్ల కఠినంగానే వ్యవహరించాలి. పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా సంస్కృతీ, సంప్రదాయాలు పట్ల కాసేపు వారితో ప్రేమగా మాట్లాడాలి. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా తీసుకొనే కొన్ని నిర్ణయాల వలన జరిగే సంఘటనలు వారికి ఉదాహరణగా తెలియపరచాలి. అంతేకాకుండా నగరవనంలో ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి. – కాసు విజయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది ఇలాంటి వనాల్లో ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది. రూ.5 కోట్లు మంజూరు చేసి దానిని గుత్తేదార్లుకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుంది. దీని వలన అక్కడ సరైన వసతులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నగరవానికి కుటుంబ సభ్యులతో రాలేని దుస్థితి. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి. వనంలో నిఘానేత్రాలు ఏర్పాటు చేయాలి. – రమాదేవి, ఐద్వా నాయకురాలు -
ఆహ్లాదం..ఆనందం..ఆత్మీయం
- జిల్లా అధికారుల వనభోజనం – ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్, ఆయన సతీమణి కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు తుంగభద్ర నది... మరోవైపు నీటితో తొణికిసలాడుతున్న చెరువు.. మధ్యలో పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతవరణంలో జిల్లా అధికారుల కార్తీకవనమహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆటాపాటా, విందువినోదాలతో ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. శుక్రవారం కర్నూలు మండలంలోని గర్గేయపురం నగరవనంలో జిల్లా అధికారుల కార్తీకవన మహోత్సవం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగింది. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖఅ అధికారులు కార్తీకవనమహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులను నగరవనానికి తీరలించేందుకు ప్రత్యేకంగా రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేవారు. నగర వనం అందాలను చూసి అందనూ మురిసిపోయారు. వనం చుట్ట రింగ్ రోడ్డు తరహాలో రోడ్డు వేశారు. ఉసిరి చెట్టుకు పూజలు.. కలెక్టర్ సతీమణి సత్యరేఖ తొలుత ఉసిరి చెట్టుకు పూజచేసి కార్తీకవనమహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సహా పలువురు జిల్లా అధికారులు సతీమణులతో సహా పాల్గొన్నారు. దాండియా ఆట ఆడి సందడి చేశారు. జిల్లా అధికారుల కూతుళ్ల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్తీక వనభోజనం ముగిసిన తర్వాత నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలకు, జిల్లా అధికారులకు వేరువేరుగా తాడులాగడం, వాల్‌బాల్ పోటీలు నిర్వహించారు. మహిళలల్లో కలెక్టర్ సతీమణి ఒక జట్టుగా, డీఆర్ఓ సతీమణి మరో జట్టుగా పోటీలు జరిగాయి.వాలీబాల్ పోటీల్లో కలెక్టర్ సతీమణి జట్టు విజయం సాధించగా, తాడులాగే పోటీల్లో కలెక్టర్ జట్టు విజయం సాధించింది. జిల్లా అధికారుల పిల్లలకు ప్రత్యేకంగా ఆటలపోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి వంటి కార్యక్రమాలు ఆహ్లాదకరంగా జరిగాయి. ఎంత హాయిలే ఇలా.. గార్గేయపురం చెరువులో అధికారులు, వారి సతీమణులు బోటు షికారు చేశారు. ఇందుకోసం జిల్లా పర్యాటక సంస్థ అధికారులు ప్రత్యేకంగా సంగమేశ్వరం నుంచి బోట్లు తెప్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆహ్లాదకరమైన వాతవరణంలో కార్తీక వనమహోత్సవాన్ని నిర్వహించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. నగరవనాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు. కర్నూలు నగర ప్రజలు వారాంతంలో ఇక్కడకు వచ్చి సంతోషంగా గడిపే విధంగా అబివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు,జడ్సీ సీఇఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్, ఇరిగేషన్ ఎస్ఇ చంద్రశేఖర్‌రావు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ప్రత్యేకకలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డీఎస్ఓ తిప్పేనాయక్ , కర్నూలు ఆర్డీఓ రఘుబాబు దాదాపు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.