మంచాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత
మంచాల, న్యూస్‌లైన్ : మంచాల మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేయబోగా అతడు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులే తమ కుమారుడిని చంపేందుకు యత్నించారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. గత జూన్ నెలలో మంచాల మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ లెక్చరర్ ఓరిగంటి నాగరాజ్‌గౌడ్(29) అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో యువతి తల్లిదండ్రులు ఆయనపై కేసు పెట్టారు.
ఈక్రమంలో నాగరాజుగౌడ్‌ను శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి ఎస్సై రవికుమార్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో వెళ్లారు. ఆ సమయంలో నాగరాజుగౌడ్‌తో పా టు ఇంట్లో తల్లి భారతమ్మ, తండ్రి ఉన్నారు. నాగరాజ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసే యత్నంలో తీవ్ర పెనుగులాట జరిగింది. నాగరాజ్‌గౌడ్ గుర్తుతెలియని గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు పెద్దఎత్తున కేకలు వేశారు. స్థానికులు గుమిగూడి పోలీసులను అడ్డుకొని ఓ గదిలోకి తోసి నిర్బంధించారు. సమాచారం అందుకున్న మంచాల సీఐ తివారి ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను సముదాయించి పోలీసులను విడిపించారు.
నాగరాజ్‌గౌడ్‌ను చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలక డగా ఉంది. కాగా పోలీసులే తమ కుమారుడికి గుళికలు మింగించి చంపేందుకు యత్నించారని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా నాగరాజ్‌గౌడే అరెస్టును తప్పించుకునేందుకు గుళి కలు మింగాడని, దీనిలో తమ ప్రమేయం లేదని ఎస్ఐ రవికుమార్ చెప్పారు.