nagarapancayati
-
విలీనం లేనట్లే !
మున్సిపాలిటీల్లో విలీనం చేద్దామనుకున్న గ్రామాలపై వెనక్కు తగ్గినట్లు సమాచారం. విలీనం చేస్తే ఉపాధిహామీ పథకం వర్తించకపోవడం, సర్పంచ్ ఎన్నికలు ఉండకపోవడం.. తదితర కారణాలతో ఈ గ్రామాలను యథాస్థితిలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నేతలు మున్సిపాలిటీల్లో కలపొద్దని స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : సమీపాన ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపే ప్రతిపాదనలు పంపాలని ఇటీవల ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు సూచించింది. అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. ప్రభుత్వ ఆదేశాలతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు సంబంధించి విలీనం చేయాలనుకునే గ్రామాల జాబితాను పంపారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీలుగా ఉండే వాటిలో 5 కిలోమీటర్లు, గ్రేడ్ 2 పరిధిలోకి 3 , గ్రేడ్ 3 పరిధి లోకి వచ్చే వాటికి కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రా మాలను విలీనం చేసే ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ గ్రేడ్ 1, నగర పంచాయతీగా ఉన్న దేవరకొండ గ్రేడ్ 3 కేటగిరిలో వస్తుంది. అయితే నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల జాబితా ప్రతిపాదనలు అధి కారులు పంపారు. నల్లగొండ మున్సిపాలిటీలోనే ఎక్కువ గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనలు వెళ్లాయి. ఏ మున్సిపాలిటీలోకి ఏ గ్రామాలు .. నల్లగొండ మున్సిపాలిటీలోకి 14 గ్రామాలను విలీనం చేయవచ్చని ప్రతిపాదించారు. వీటిలో బుద్ధారం, అన్నెపర్తి, కంచనపల్లి, గుండ్లపల్లి, కొత్తపల్లి, జీకె. అన్నారం, చందనపల్లి, దండెంపల్లి, అమ్మగూడెం, మేళ్లదుప్పలపల్లి, పిట్టంపల్లి, తేందార్పల్లి, అనిశెట్టిదుప్పలపల్లి, ఖాజీ రామారం గ్రామాలున్నాయి. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీలో యాద్గార్పల్లి, వెంకటాద్రిపాలెం, వాటర్‌ట్యాంక్ తండా, గూడూరు, బాధలపురం, చింతపల్లి, శెట్టిపాలెం గ్రామాలను విలీనం చేయవచ్చని పంపారు. ఇక దేవరకొండ నగర పంచాయతీ కేటగిరి ప్రకారం దీని పరిధిలోకి వచ్చే గ్రామాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. వీటిని విలీనం చేస్తే ఉపాధి హామీ పథకం వర్తించదని, సర్పంచ్ ఎన్నికలు ఉండవని.. తమ స్థానిక రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమేనా..? అని స్థానిక సర్పంచ్‌లు, నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గతంలో ఈ మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాల్లోనే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, మౌలిక వసతుల కల్పన సరిగ్గా లేకపోవడంతో.. ఇప్పుడు ఈ గ్రామాలను కలిపితే ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్యెల్యేల దృష్టికి తెచ్చారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత, ఉపాధిహామీ పథకం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి విలీన ప్రక్రియను దూరం పెట్టినట్లు సమాచారం. కొత్త పంచాయతీలు చేయొచ్చా.. విలీన గ్రామాల ప్రక్రియ వెనక్కు వెళ్లడంతో.. ఈ గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేయవచ్చా..? అనే విషయమై పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. మైదాన ప్రాంతంలో 500 జనాభా ఉన్న, దాటిన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగితే అధికారులు పంపారు. వీటిల్లో కూడా ఇలా ఈ జనాభా పరిధిలో ఉన్న గ్రామాల ప్రతిపాదనలు పంపే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇవి కొత్త పంచాయతీలు అయితే మరికొంత మంది రాజకీయ ఉపాధి దొరికినట్లే. నగర పంచాయతీలకు ప్రతిపాదనలు.. కొత్తగా నగర పంచాయతీల ప్రతిపాదనల జాబితాలో అనుముల, చిట్యాలను చేర్చనున్నుట్లు తెలిసింది. అలాగే నకిరేకల్‌ను కూడా మున్సిపాలిటీగా చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకొస్తుండడంతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. పనిలో పనిగా కొత్త నగర పంచాయతీల ప్రక్రియ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చిట్యాలకు వట్టిమర్తిని కలిపి, అనుములకు ఇబ్రహింపేటను కలిపి నగర పంచాయతీలుగా చేయవచ్చని.. వాటి జనాభాను అధికారులు ప్రభుత్వానికి పంపారు. -
నిరుద్యోగుల బలహీనతే... ఇంధనం
సర్కారీ కొలువు సంపాదిస్తే ఆ సంతోషమే వేరబ్బా... ఇది నిరుద్యోగుల అంతరంగంలో గూడుకట్టుకున్న బలహీనత. ఇదే దళారులకు అయాచిత వరంగా మారింది. ప్రభుత్వం ఏదైనా కొలువుల నోటిఫికేషన్ విడుదల చేసిందే తడవుగా రంగంలోకి దిగి పోతున్నారు. దళారులను నమ్మవద్దని..ఉద్యోగాలు పారదర్శకంగానే భర్తీచేస్తామని ఓవైపు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ నిరుద్యోగులు మాత్రం గుడ్డిగా వారినే నమ్ముతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా వీఆర్ఓ,వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు దళారులకు సంక్రాంతికి ముందే పండగ సీజన్ వచ్చేసింది. నిరుద్యోగుల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లిమర్ల, న్యూస్‌లైన్:నెల్లిమర్ల నగరపంచాయతీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని స్థానికనేత ఒకరు సుమారు 20మంది నుంచి తలా రూ.50 వేల చొప్పున మొత్తం వసూలు చేశారు. డబ్బులు వసూలుచేసి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఆ ఉద్యోగాలకు అతీగతీ లేకపోవడంతో డబ్బులు ముట్టజెప్పిన నిరుద్యోగులు కక్కలేక.. మింగలేక అన్నట్లు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. అలాగే గత ఏడాది జూలైలో గుర్ల మండలం రౌతుపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిరుద్యోగులనుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ నేత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తలా రెండులక్షలు చొప్పున కాజేశాడు. ఇప్పటిదాకా ఉద్యోగాలు వేయించక పోవడంతో బాధితులు సదరు నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. అదే మండ లం పల్లిగండ్రేడు గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగినుంచి అధికారపార్టీ నేత ఒకరు వీఆర్ఓ ఉద్యోగం వేయిస్తానని చెప్పి సుమారు ఏడాది క్రితం లక్షరూపాయలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా అదే పరిస్థితి. స్థానిక నేతలను నమ్మి వీరే గాదు జిల్లాలోని వందలాదిమంది నిరుద్యోగులు ఇలాగే మోసపోతున్నారు. ఇప్పటిదాకా హోంగార్డులుగానూ, వీఆర్వోలుగానూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగానూ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలికి పలువురు చోటా రాజకీయ దళారులు వందలాదిమందిని మోసం చేశారు. నేతలను నమ్మి డబ్బులు అప్పజెప్పిన నిరుద్యోగులు మాత్రం తాము మోసపోయిన విషయాన్ని ఇప్పటికీ బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్తగా దళారులు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ అండదండలున్నవారే ఈ అవతారమెత్తుతున్నట్లు సమాచారం. నిన్నమొన్నటిదాకా పలు విభాగాల్లో ఉద్యోగాలు వేయిస్తామని డబ్బులు గుంజిన దళారులు ఇప్పుడు వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ దండుకునేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు సంబంధించి తాజాగా నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 137వీఆర్ఏ, 90 వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా అధికారుల సమాచారం మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 28న పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నేతలు నిరుద్యోగుల తల్లిదండ్రులకు నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అనుచరులే ఈ విధంగా నమ్మిస్తున్నట్లు సమాచారం. వీఆర్వో పోస్టు ఇప్పించేందుకు రూ ఐదు లక్షలదాకా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే వీఆర్ఏ పోస్టుకు రూ.రెండులక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరి కొంతమంది దళారులు ఓ అడుగు ముందుకేసి డబ్బులు ఇచ్చినా..టెస్ట్‌కు బాగా ప్రిపేర్ అవ్వాలని ఉచిత సలహాలు కూడా పారేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఒకవేళ అభ్యర్థి ప్రతిభతో ఉద్యోగం వచ్చినా తమకిచ్చిన డబ్బు నొక్కేయవచ్చుననే ఉద్దేశంతోనే ఇలా చెబుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం పదిమంది దగ్గర డబ్బులు వసూలుచేస్తే వారిలో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా రూ.ఐదులక్షలు సంపాదించుకోవచ్చని, మిగిలిన వారి సొమ్ములో ఖర్చుల నిమిత్తం కొంతమొత్తం ఉంచేసుకోవచ్చని ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఈ విషయాలేవీ తెలియని నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు మాత్రం అమాయకంగా నేతలను నమ్మి డబ్బు ముట్టజెబుతున్నారు. తమకు రావాల్సిన ఉద్యోగం ఎక్కడ చేజారిపోతుందోనని డబ్బు ముట్టజెప్పడంలో పోటీకూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు పట్టించుకుని నిరుద్యోగులను మరింత చైతన్యపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.