ఎరువుకునోవాడ సుగర్స్
అరకొరగా ఎరువుల సరఫరా
చేతులెత్తేసిన నాగార్జున సంస్థ
చెరకు రైతుల ఆందోళన
కాటాల వద్ద ముష్టియుద్ధాలు
ఇన్నాళ్లు వర్షాలు కురవనందుకు కలవరపడ్డారు. ఇప్పుడు ఎరువులు దొరకనందుకు ఆందోళన చెందుతున్నారు. బోర్ల సాయంతో నాట్లు వేసినా ఎరువేస్తేనే చెరకు ఎదుగుతుంది. ఎరువుల పంపిణీలో గోవాడ చక్కెర కర్మాగారం విఫలమైంది. కాటాల వద్ద రైతుల మధ్య ముష్టియుద్ధాలకు దారితీస్తోంది. పది రోజులుగా వర్షం కురుస్తోంది. మొక్కదశ, జడ దశలో చెరకు పంటకు వేయాల్సిన యూరియా, డీఏపీ ఎరువుకు విపరీతమైన కొరత ఏర్పడింది.
చోడవరం: గోవాడ చక్కెర కర్మాగారం వడ్డీలేని రుణంపై ఏటా రైతులకు ఎరువులు అందిస్తుంది. కర్మాగారం పరిధిలో 21 చెరకు కాటాలున్నాయి. సుమారు 35 వేల ఎకరాల్లో చెరకు సాగవుతోంది. ఏటా 5 లక్షల టన్నులకు పైగా కర్మాగారం చెరకు గానుగాడుతుంది. ఈ క్రమంలో పంటకు కావలసిన ఎరువులు రైతులకు కర్మాగారమే సరఫరా చేస్తుంది. ఈ ఏడాది కూడా ఎరువు సరఫరా ప్రారంభించినప్పటికీ రైతులకు అవసరమైనంత ఎరువు సరఫరా కాలేదు.
ఈ సీజన్‌కు 7,500 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవరసమని అంచనా వేశారు. యూరియా-5500, డీఏపీ-500, ఎస్ఎస్పీ-1000, పొటాష్-500 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేయాలి. నాగార్జున ఎరువుల సంస్థ నుంచి యూరియా, గోదావరి నుంచి డీఏపీ తెచ్చేందుకు ఆయా సంస్థలతో కర్మాగారం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఎరువులు పూర్తిగా సకాలంలో సరఫరా కాలేదు. నాగార్జున ఎరువుల సంస్థ కేవలం 1170 టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసింది. ఎస్ఎస్పీ, డీఏపీ ఎరువులు కూడా ఇంకా రావలసి ఉంది. ఇరవై టన్నులు చెరకు సరఫరా చేసే ఒక్కొక్క రైతుకు సుమారు 3 యూరియా బస్తాలు విధిగా ఇవ్వాల్సి ఉంది. కానీ యూరియా సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులకు అందలేదు.
దశల వారీగా ఎరువులు సరఫరా అవుతుండటంతో అన్ని కాటాలకు అరకొరగా పంపుతున్నారు. యూరియా సరఫరా ఇక చేయలేమంటూ నాగార్జున సంస్థ చేతులెత్తేయడంతో గోవాడ కర్మాగారం మార్క్‌ఫెడ్‌ను ఆశ్రయించింది. దీంతో వారు 2300 టన్నుల యూరియాను ఇప్పటి వరకు సరఫరా చేశారు. ఇంకా మరో 1500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. దీనిపై కర్మాగారం అధికారులు యమయాతన పడుతున్నారు.
వర్షాలు పడుతున్నప్పుడే యూరియా ఇవ్వాల్సి ఉండటంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. అరకొరగా ఎరువులు కాటాలకు రావడంతో కాటాల వద్ద రైతులు తోపులాడుకుంటున్నారు. వాస్తవానికి జులై 15 నాటికే పూర్తిగా ఎరువులు రైతులకు అందాల్సి ఉన్నప్పటికీ యా జమాన్యం నిర్లక్ష్యం వల్ల సరఫరాలో జాప్యం ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎరువులు అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజుల్లో పూర్తిగా ఎరువుల పంపిణీ
ఎరువుల సంస్థల నుంచి సరఫరాలో జాప్యం ఏర్పడటం కొంత ఇబ్బంది వచ్చింది. ప్రస్తుతం యూరియా తప్పా అన్నీ ఎరువులున్నాయి. ఇటీవల బ్లోఔట్ వల్ల నాగార్జున ఎరువుల సంస్థ సరఫరా నిలిపివేయడంతో కలెక్టర్, మంత్రుల సహకారంతో మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా తెస్తున్నాం. ఇప్పటి వరకు 3450 టన్నుల యూరియా వచ్చింది. రైతులకు సరఫరా చేశాం. ఇంకా 1500 టన్నుల యూరియా మాత్రమే రావలసి ఉంది. అది కూడా త్వరలోనే వస్తుంది. వారం రోజుల్లో రైతులకు పూర్తిగా ఎరువులు పంపిణీ చేస్తాం. రైతులు అందోళన చెందనవసరం లేదు.
-వి.వి.రమణారావు, ఎమ్డీ, గోవాడ చక్కెర కర్మాగారం