‘టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రా ఏజెంట్లు’
నాగర్‌కర్నూల్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రా ఏజెంట్లుగా, చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని ఆయన ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర వహించాల్సిన తెలంగాణ టీడీపీ నేతలు ఆంధ్రా నాయకుల తాబేదార్లుగా పనిచేస్తున్నారని, ప్రజలు చెప్పులతో కొట్టి తెలంగాణ నుంచి తరిమివేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే మాకు అవకాశం వస్తుందని కొన్ని పార్టీలు గుంటకాడి నక్కల్లా కాచుక్కూర్చున్నారని, ఆ కల నెరవేరబోదన్నారు. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు, చెరువులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి వారికీ అందిస్తామని, అర్హులై ఉండి రాని వారు తనను సంప్రదిస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.