కొంప ముంచిన ఆటో
కల్వకుర్తి ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థులకు ఒకే గుర్తు ఒక్క కల్వకుర్తిలోనే ఎంపీ అభ్యర్థికి 30వేల ఓట్లు..!
హైదరాబాద్: ఆటో గుర్తు ఇద్దరు అభ్యర్థుల కొంప ముంచింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూలు లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి మందా జగన్నాథం విజయాలను దారుణంగా దెబ్బతీసింది.కల్వకుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎన్నికల్లో కేటాయించిన గుర్తు ఆటో.. అలాగే నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాసులు పోటీ చేస్తే ఆయనకు కూడా ఆటో గుర్తు కేటాయించారు. కల్వకుర్తిలో నారాయణరెడ్డి ఆటో గుర్తుకు ఓటు వేయాలంటూ విస్తృత ప్రచారం కాస్త స్వతంత్ర ఎంపీకి అభ్యర్థికి ఓట్లు తెచ్చిపెట్టింది. పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసులకు 54వేల ఓట్లు వస్తే.. కేవలం కల్వకుర్తిలోనే 30వేలకు పైగా ఓట్లు లభించాయి.
నారాయణరెడ్డికి పడాల్సిన ఓట్లు శ్రీనివాసులకు రావడంతో.. ఇక్కడ నారాయణరెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. వాస్తవంగా ఈ ఓట్లు నారాయణరెడ్డికి దక్కి ఉంటే.. ఆయన కనీసం ఆరు నుంచి తొమ్మిదివేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉండేదన్న పరిశీలకులు భావిస్తున్నారు. అదే తరహాలో ఎంపీ అభ్యర్థులు కేవలం ఆరుగురు పోటీ చేసినా.. టీఆర్ఎస్ అభ్యర్థి మందా జగన్నాథం గుర్తు కారు. ఆటో, కారు చిహ్నాలను సరిగా గుర్తించడంఓ ఓటర్లు కాస్త పొరపడడం వల్ల మందా జగన్నాథానికి రావాల్సిన ఓట్లు రాకుండా పోయాయన్న అభిప్రాయమూ ఉంది.