Nagarkurnul
-
పంచాయతీల్లో కో ఆప్షన్ మెంబర్
సాక్షి, మూసాపేట: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీలో కో ఆప్షన్ సభ్యులకు చోటు కల్పించనున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో నూతనంగా కో ఆప్షన్ సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. గ్రామ పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా కో ఆప్షన్ సభ్యులను భాగస్వామ్యం చేయనున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 500 జనాభా కలిగి ఉన్న శివారు గ్రామాలు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాలన వికేంద్రీకరణలో భాగంగా మూసాపేటను నూతనంగా ఏర్పాటు చేయగా అందులో 12 గ్రామ పంచాయతీల నుంచి 15 గ్రామ పంచాయతీలుగా మూసాపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ 15 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీలో ముగ్గురి చొప్పున 45 మందిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వారికి వార్డు సభ్యులతో సమానంగా కో ఆప్షన్ సభ్యులకు కూడా హోదా వస్తుంది. మూడు విభాగాల్లో సభ్యుల ఎన్నిక.. గ్రామ పంచాయతీ పాలక వర్గంలో కో ఆప్షన్ సభ్యులను మూడు విభాగాల్లో ఎన్నుకుంటారు.ఆ గ్రామంలో రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ,గ్రామ పంచాయతీకి ఆర్థికంగా సాయం చేసిన దాతకు కో ఆప్షన్ సభ్యుల కోటాలో అవకాశం కల్పిస్తారు. గ్రామ అభివృద్ధిలో కో ఆప్షన్ సభ్యుల సలహాలు, సూచనలు చేయవచ్చు. గ్రామాల్లో పోటా పోటీ.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. రిజర్వేషన్, సామాజిక వర్గం కలిసి రాక కొందరు, ఖర్చు చేయలేక మరికొందరు పోటీకి దూరంగా ఉన్న వాళ్లు కో ఆప్షన్ పదవులను దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఇంటర్ లేక ఇబ్బందులు
మన్ననూర్ : ఇంటర్ చదివేందుకు కళాశాల లేక నల్లమల్ల లోతట్టు చెంచు విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మన్ననూర్‌లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. చెంచుల పిల్లలు పదో తరగతి వరకు చదివి ఉన్నత చదువులకు దూరమవుతున్నారని నాలుగేళ్ల క్రితం పీటీజీ పాఠశాలను అప్ గ్రేడ్ చేస్తూ ఎక్సలెన్స్ పేరుతో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎక్సలెన్స్ విధి విధానాలకు అనుకూలమైన వసతులు ప్రభుత్వం కల్పించకపోవడంతో గత నెలలో ఈ కళాశాలను హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం కళాశాల భవనం ఖాళీగా చూసే వాళ్లను ఎక్కిరిస్తున్నట్లు ఉంది. ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదిలా ఉండగా పీటీజీ పాఠశాలలో ప్రత్యేకించి చెంచు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఉన్నత చదువుల కోసం చెంచు విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లడం కలగానే మిగులుతుందంటున్నారు. సంభందిత అధికారులు స్పందించి కనీసం ఇంటర్ విద్య వరకు చెంచు విద్యార్థులకు కళాశాల అందుబాటులో ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లలేం పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థాయి సౌకర్యాలు లేవు. ఇక్కడే అందుబాటులో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. అధికారులు మా జీవన విధానాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలి. – మల్లేష్, పీటీజీ విద్యార్థి, మన్ననూర్ పట్టణ ప్రాంతాలకు వెళ్లలేరు నిర్బంధంగా పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న చెంచు విద్యార్థులు ఇంటర్ విద్యను ఒక్కసారిగా పట్టణ ప్రాంతాల్లో ఉండి చదువడం కొంచెం కష్టమే. ఇక్కడి పీటీజీ పాఠశాల అప్‌గ్రేడ్ చేసి ఇంటర్ విద్యను అందిస్తే వయస్సుతో పాటూ ఆలోచన విధానాల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. – రాజారాం, ప్రిన్సిపాల్, పీటీజీ పాఠశాల, మన్ననూర్ -
ప్రాజెక్టులపై ప్రేమ చూపరా?
నాగర్‌కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వానికి మిషన్ భగీరథపై ఉన్న ప్రేమ ప్రాజెక్టులపై ఎందుకు లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ పీఆర్ అతిథి గహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అంతకుముందు జొన్నలబొగుడ వద్ద కేఎల్ఐ రెండో లిఫ్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండురోజుల్లో దీనికి నీరు వస్తుందని, పంపుద్వారా రోజుకు 0.06 టీఎంసీలను పంపింగ్ చేయవచ్చన్నారు. అంతేగాక కాల్వ, టన్నెల్ ద్వారా గుడిపల్లికీ వస్తాయన్నారు. ఈ నీటితో చుట్టుపక్కల చెరువులు, కుంటలను నింపాలన్నారు. కోయిల్‌సాగర్‌లో మోటారు కాలిపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పంటబీమాపై అధికారులు ప్రచారం చేయలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారిమళ్లిస్తోందని విమర్శించారు. సాగునీటి బడ్జెట్లో 50శాతం నిధులు ప్రాణహిత–చేవెళ్లకు కేటాయించినా ఎక్కడా పనులు పూర్తికాలేదని, దీనిపై నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలో ఎన్ని ప్యాకేజీలకు ల్యాండ్ అక్విజేషన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు, కౌన్సిలర్లు బాదం రమేష్, నరేందర్, బీజేపీ మండల నాయకులు కాశన్న, నసీర్, సత్యం, మన్నెపురెడ్డి పాల్గొన్నారు.