మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి
ప్రాజెక్టులపై ప్రేమ చూపరా?
Published Sat, Aug 20 2016 12:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నాగర్‌కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వానికి మిషన్ భగీరథపై ఉన్న ప్రేమ ప్రాజెక్టులపై ఎందుకు లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ పీఆర్ అతిథి గహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అంతకుముందు జొన్నలబొగుడ వద్ద కేఎల్‌ఐ రెండో లిఫ్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండురోజుల్లో దీనికి నీరు వస్తుందని, పంపుద్వారా రోజుకు 0.06 టీఎంసీలను పంపింగ్ చేయవచ్చన్నారు. అంతేగాక కాల్వ, టన్నెల్ ద్వారా గుడిపల్లికీ వస్తాయన్నారు. ఈ నీటితో చుట్టుపక్కల చెరువులు, కుంటలను నింపాలన్నారు. కోయిల్‌సాగర్‌లో మోటారు కాలిపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పంటబీమాపై అధికారులు ప్రచారం చేయలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారిమళ్లిస్తోందని విమర్శించారు. సాగునీటి బడ్జెట్‌లో 50శాతం నిధులు ప్రాణహిత–చేవెళ్లకు కేటాయించినా ఎక్కడా పనులు పూర్తికాలేదని, దీనిపై నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలో ఎన్ని ప్యాకేజీలకు ల్యాండ్ అక్విజేషన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకట్‌రాములు, కౌన్సిలర్లు బాదం రమేష్, నరేందర్, బీజేపీ మండల నాయకులు కాశన్న, నసీర్, సత్యం, మన్నెపురెడ్డి పాల్గొన్నారు.
Advertisement