కళాశాల తరలిపోవడంతో ఖాళీగా ఉన్న భవనం
మన్ననూర్ : ఇంటర్ చదివేందుకు కళాశాల లేక నల్లమల్ల లోతట్టు చెంచు విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మన్ననూర్‌లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. చెంచుల పిల్లలు పదో తరగతి వరకు చదివి ఉన్నత చదువులకు దూరమవుతున్నారని నాలుగేళ్ల క్రితం పీటీజీ పాఠశాలను అప్ గ్రేడ్ చేస్తూ ఎక్సలెన్స్ పేరుతో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎక్సలెన్స్ విధి విధానాలకు అనుకూలమైన వసతులు ప్రభుత్వం కల్పించకపోవడంతో గత నెలలో ఈ కళాశాలను హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం కళాశాల భవనం ఖాళీగా చూసే వాళ్లను ఎక్కిరిస్తున్నట్లు ఉంది.
ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులు
ఇదిలా ఉండగా పీటీజీ పాఠశాలలో ప్రత్యేకించి చెంచు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఉన్నత చదువుల కోసం చెంచు విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లడం కలగానే మిగులుతుందంటున్నారు. సంభందిత అధికారులు స్పందించి కనీసం ఇంటర్ విద్య వరకు చెంచు విద్యార్థులకు కళాశాల అందుబాటులో ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లలేం
పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థాయి సౌకర్యాలు లేవు. ఇక్కడే అందుబాటులో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. అధికారులు మా జీవన విధానాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలి.
– మల్లేష్, పీటీజీ విద్యార్థి, మన్ననూర్
పట్టణ ప్రాంతాలకు వెళ్లలేరు
నిర్బంధంగా పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న చెంచు విద్యార్థులు ఇంటర్ విద్యను ఒక్కసారిగా పట్టణ ప్రాంతాల్లో ఉండి చదువడం కొంచెం కష్టమే. ఇక్కడి పీటీజీ పాఠశాల అప్‌గ్రేడ్ చేసి ఇంటర్ విద్యను అందిస్తే వయస్సుతో పాటూ ఆలోచన విధానాల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
– రాజారాం, ప్రిన్సిపాల్, పీటీజీ పాఠశాల, మన్ననూర్
Comments
Please login to add a commentAdd a comment