అక్కినేనికి మరణం లేదు
తెలుగు జాతి ఉన్నంత వరకు అభిమానుల గుండెల్లో జీవించే ఉంటారు:నాగసుశీల
ఎంవీవీఎస్ మూర్తికి అక్కినేని జీవిత సాఫల్య పురస్కార ప్రదానం
విశాఖపట్నం-కల్చరల్: కాలేజీకి వెళ్లకపోయినా ప్రపంచాన్ని చదివిన మహానటుడు అక్కినే ని నాగేశ్వరరావు తెలుగు జాతి ఉన్నంత వరకు అభిమానుల హృదయూల్లో జీవించే ఉంటారని అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె నాగసుశీల అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో అక్కినేని నాటక కళాసాగర పరిషత్ నిర్వహిస్తున్న అక్కినేని నాటకోత్సవాలు గురువారం రాత్రి ముగిశాయి.
ఈ సందర్భంగా ఆమె గీతం యూనివర్శిటీ అధినేత డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తికి అక్కినేని కళాసాగర పరిషత్ తరపున ‘అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం’ అందజేశారు. ఈ సందర్భంగా నాగసుశీల మాట్లాడుతూ అక్కినేని చిహ్నంగా భారత్‌తోపాటు అమెరికాలో కూడా ఒక స్టాంప్‌ను విడుదల చేయడం విశేషమన్నారు.
పురస్కార గ్రహీత డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ సమాజంలో విద్యను ప్రోత్సహించిన వ్యక్తుల్లో అక్కినేని ముందువరసలో ఉంటారన్నారు. 1960లో గుడివాడలో ఉన్న కాలేజీకి ఆయన లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి ఔన్నత్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంతో ఉన్న అన్ని యూనివర్శిటీలకు ఆయన విరాళాలు ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. 2011లో గీతం వర్సిటీకి ఆహ్వానించి ‘డీ లిట్’ ప్రదానం చేసినట్టు గుర్తు చేసుకున్నారు. 1955 నుంచి 1983 వరకు అక్కినేని సినిమాలు విడవకుండా చూసిన వ్యక్తుల్లో తానూ ఒక్కడినన్నారు.
అక్కినేని కళాసాగర పరిషత్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అర్జున్ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత ఎస్.విజయకుమార్, దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, డాక్టర్ రెహమాన్, కళాసాగర పరిషత్ అధ్యక్షుడు పొన్నాడ మోహనరావు, అక్కినేని నాటకోత్సవాల సంఘం అధ్యక్షుడు కనకరావులు ప్రసంగించారు.