అమ్మడు లెక్చరర్ , బాబు స్టూడెంట్
చెన్నై : రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలు భారీ విజయంతో జోరుమీదున్న భామ శ్రుతి హాసన్. దీంతో మరో తెలుగు సినిమా పాత్ర కోసం అపుడే కసరత్తు మొదలుపెట్టిందిట. శ్రీమంతుడు సినిమా తరువాత తెలుగులో చేస్తున్న ఈ మలయాళ రీమేక్ లో శ్రుతి... లెక్చరర్ పాత్ర పర్ఫెక్షన్ కోసం తెగ తాపత్రయపడుతోందిట.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకధాటిగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్‌కి సైన్ చేసింది. 'మంజు' అనే టైటిల్ దాదాపు ఖరారైన ఈ చిత్రంలో శ్రుతి లెక్చరర్ పాత్రను పోషించబోతోంది. 'సాయి పల్లవి' అనే క్యారెక్టర్‌కు స్పెషల్ మేకోవర్ ప్లాన్ చేస్తోందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీమంతుడు తరువాత తెలుగులో చేస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌కు జోడిగా అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నాగ చైతన్య స్టూడెంట్‌గా శ్రుతి లెక్చరర్‌గా కన్పించనున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అటు మలయాళ ' ప్రేమమ్'లో సెకండ్ హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా యాక్ట్ చేస్తోంది.