రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతాం
=వైఎస్సార్ సీపీ రైతునేత నాగిరెడ్డి
=కంకిపాడులో ‘సమైక్య శంఖారావం’
కంకిపాడు, న్యూస్‌లైన్ : పాలక, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు.. కుమ్మక్కులు చేసినా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి చెప్పారు. ఆ పార్టీ మహిళావిభాగం జిల్లా కన్వీనర్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కంకిపాడు లాకు రోడ్డు సెంటర్లో సమైక్య శంఖారావం సభ జరిగింది. పార్టీ కంకిపాడు మండల కన్వీనర్ మాదు వసంతరావు అధ్యక్షతన జరిగిన సభలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. సోనియా రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు.
విభజనతో రాష్ట్రం అల్లకల్లోలమవుతుందన్నారు. తమ పార్టీ మాత్రం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి పథాన సాగాలని కోరుకుంటోందని తెలిపారు. రాష్ట్రం విడిపోతే సాగునీటి యుద్ధాలు జరిగి రైతు ఆత్మహత్యలు పునరావృతమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ముప్పును గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మల నేతృత్వంలో పార్టీ పోరాటాలను ఉధృతం చేసిందని పేర్కొన్నారు. నూజి వీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేయకపోవడం దారుణమన్నారు.
బీజేపీతో కలిస్తే అధికారం వస్తుందని, కేసుల బాధ ఉండదని చంద్రబాబు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోస్ మాట్లాడుతూ.. నాలుగు నెలల పదవి కోసం నేతలు నానా పాట్లు పడుతున్నారన్నారు. తాతి నేని పద్మావతి మాట్లాడుతూ.. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో తిప్పికొడతామని ప్రగల్భాలు పలికిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుల వైఖరి విడ్డూరంగా ఉందని, సభలో కనీసం కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు.
జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యమని స్పష్టంచేశారు. బీసీ విభాగం జిల్లా కన్వీనర్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు మాట్లాడుతూ.. తాము ఓట్లు, సీట్లకోసం పోరాటం చేయడం లేదని, రాష్ట్ర ప్రజల బంగారు భవిత కోసమే చేస్తున్నామని వివరించారు. వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ప్రజలను కోరారు. తొలుత ఆర్యవైశ్య ప్రార్థనామందిరంలో పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రదర్శనగా లాకు రోడ్డు సెంటర్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు సింహా ద్రి రమేష్‌బాబు (అవనిగడ్డ), బండ్రపల్లి వల్లభాయ్ (తిరువూరు), జిల్లా నేత టీకేఆర్, పెనమలూరు, ఉయ్యూరు మండలాల కన్వీనర్లు కాకర్ల వెంకటరత్నం, వంగవీటి శ్రీనివాసప్రసాద్, స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.రమేష్‌కుమార్, సూరపనేని రామారావు, కోటిరెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు సంగెపు శ్రీనివాసరావు, కలపాల వజ్రాలు, జి.రాజశేఖర్, వంగా శివార్జునరెడ్డి, మేదండ్రావు కుటుంబరావు, చలివేంద్రపాలెం, పెదఓగిరాల మాజీ సర్పంచులు కొండా రామిరెడ్డి, గుంటక నాగిరెడ్డి పాల్గొన్నారు.