సామాన్య మానవుడే దిగంబర కవిత్వానికి కేంద్రం
అదే మా బృందం ధ్యేయం
అన్ని భావజాలాలూ అవసరమే
కవిత్వానికి సామాన్యుడు కేంద్ర బిందువు కావాలి
‘సాక్షి’తో ప్రముఖ కవి నగ్నముని
రాజమహేంద్రవరం కల్చరల్ :
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వ్యవస్థలో అవినీతి, వివక్ష పెరిగిపోయాయని ప్రముఖ కవి, దిగంబర కవిత్వానికి ఆద్యుడు నగ్నముని తెలిపారు. ఒకప్పుడు ఫలానా వ్యక్తి లంచం తీసుకుంటాడని చెప్పుకునేవాళ్లం.. ఈ రోజుల్లో ఎవరైనా లంచం తీసుకోకుంటే అతడి పేరు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రముఖ కవి స్మైల్ (ఇస్మాయిల్) జయంతి ఉత్సవంలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన దిగంబర కవిత్వం పుట్టు పూర్వోత్తరాలు, లక్ష్యాలు, సమకాలీన సాహిత్య ధోరణులపై ‘సాక్షి’తో శుక్రవారం ప్రత్యేకం మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
అవినీతి, వివక్షలను ఎత్తి చూపడానికే...
శ్రీశ్రీ అభ్యుదయ కవి. మహాప్రస్థానం స్వాతంత్య్రం రాకముందే ఆయన రచించారు. ముద్రణ మాత్రం తరువాత కాలంలో జరిగింది. స్వాతంత్య్రం వచ్చాక, వ్యవస్థలోని అవినీతి, వివక్షలను సమాజానికి ఎలుగెత్తి చెప్పడానికి తొలిసారి దిగంబర కవుల కవిత్వం సంపుటి– 1 ముద్రించాం. నాతోపాటు నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండ రాజు, భైరవయ్య తదితర కవుల రచనలు ఇందులో చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో 1965లో అర్ధరాత్రి 12 గంటలకు రిక్షా కార్మికునిచే ఈ పుస్తకావిష్కరణ చేశాం. రెండో సంపుటి ఆవిష్కరణ 1966లో విజయవాడ గవర్నరుపేట సెంటర్లో ఒక హోటల్ కార్మికుని చేతుల మీదుగా జరిగింది. మూడో సంపుటి ఆవిష్కరణ కూడా 1968లో అర్ధరాత్రి సమయంలో ఒక బిచ్చగత్తె చేతుల మీదుగా విశాఖలో జరిగింది. కవిత్వానికి సామాన్యుడు కేంద్రబిందువు కావాలన్నదే మా లక్ష్యం.
అన్ని సాహిత్యాలూ అవసరమే
అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, మహిళా సాహిత్యం, దళిత సాహిత్యం ఇలా ఎన్నో భావజాలాలు. ఒక్కో ప్రక్రియ ఒక్కో అంశంపై ఫోకస్ చేశాయి. సంప్రదాయ సాహిత్యాన్ని మేము తిరస్కరించడం లేదు. నన్నయకు నమస్కరించాక, నేటి వరకూ కొనసాగుతున్న సాహిత్య ధోరణులను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.
నా సాహితీసేద్యం
ఉన్నవ లక్షీ్మనారాయణ 1970లో రాసిన మాలపల్లి నవలను నాటకీకరించాను. రెండున్నర గంటల ప్రదర్శనకు అనుకూలంగా రాశాను. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో నేటి వరకూ సుమారు 110 ప్రదర్శనలు ఇచ్చాం. దివిసీమ ఉప్పెన నేపథ్యంలో రాసిన కొయ్యగుర్రం కావ్యం ఇంగ్లిష్తో సహా 9 భాషల్లోకి అనువదించారు. ఈ అంశంపై వెలువడిన తొలి రచన ఇది. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని దృష్టిలో పెట్టుకుని ‘విలోమ కథలు’ రాశాను. ఆకాశ దేవత, అౖద్వైతరాజ్యం నా ఇతర రచనలు.
‘స్వ’గతం
నగ్నముని నా కలం పేరు. నిజ నామధేయం మానేపల్లి హృషీకేశవరావు. 1940లో తెనాలిలో జన్మించాను. శాసనసభలో 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను. ఎమర్జెన్సీ సమయంలో నన్ను డిస్మిస్ చేశారు. 18 నెలలు ఉద్యోగానికి దూరమయ్యాను. జనతా ప్రభుత్వం వచ్చాక తిరిగి ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాను.