సభాకార్యకలాపాలను అడ్డుకున్న కాంగ్రెస్
నాగపూర్: రెండురోజులుగా ప్రతిపక్షం వ్యవహరిస్తున్న వైఖరి కారణంగా విదర్భ, మరాఠ్వాడా వంటి కీలక అంశాలు చర్చకు రాలేదని ఆరోపిస్తూ అధికారపక్ష సభ్యులు బుధవారం సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో మొత్తం నాలుగు పర్యాయాలు సభ వాయిదాపడింది. అధికార పక్ష సభ్యుల వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షం వెల్‌లోకి దూసుకుపోయింది. ఇరుపక్షాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినదించారు. నిరసనలు, ప్రతినిరసనలతో దాదాపు 40 నిమిషాల సమయం వృథా అయింది. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అసలు జరగనేలేదు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే అధికార పక్షానికి చెందిన విజయ్వడ్డెటివార్, వీరేంద్ర జగ్తాప్, బాబా సిద్ధిఖిలు విదర్భ అంశంపై నిరసనకు దిగారు. దీనిని ప్రతిపక్ష సభ్యులైన గిరీష్ మహాజన్, తారాసింగ్, యోగేష్ సాగర్, దేవేంద్ర ఫడణవిస్, నానాపటోల్, గిరీష్ బాపట్లు ఈ నిరసనను అడ్డుకున్నారు.
అనంతరం పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే జల్గావ్ పాల సహకార సొసైటీ కుంభకోణంపై మాట్లాడుతూ జల్గావ్ సొసైటీని జాతీయ పాల అభివృద్ధి సంస్థకు అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఏక్నాథ్ ఖడ్సే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. ఈ సందర్భంగా ఖడ్సే రాసిన లేఖను ఆయన సభకు చదివి వినిపించారు. అంతటితో ఆగకుండా ఓ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలంటూ బీజేపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతకాలు చేసిన ప్రతిని కూడా సభకు చూపించారు. అభియోగాలను పరిశీలించకుండానే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇలా పేర్లను ప్రస్తావించడం ఖడ్సేకి ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. అనంతరం స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తన కార్యాలయంలోకి రావాలంటూ ఆహ్వానించారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే పరిశ్రమల మంత్రి నారాాయణ్ రాణే మాట్లాడుతూ సొసైటీ బదలాయింపు ప్రక్రియలో ఖడ్సే స్వయంగా పాలుపంచుకున్నారని, అందువల్ల ఈ అంశాన్ని లేవనెత్తే హక్కు ఆయనకు లేదన్నారు.
దీంతో సభలో మరోసారి గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షానికి చెందిన కొందరు సభ్యులు పోడియంలోకి దూసుకుపోగా, మరికొందరు అక్కడే కింద బైఠాయించారు. దీంతో మరోసారి స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం ఉపసభాపతి వసంత్ ఫుర్కే స్పీకర్ స్థానంలో ఆశీసునులయ్యారు. సభా కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం కాగానే మంగళవారం సభలో బిల్లును సభలో ప్రవేశపెటి ్టన అనంతరం మాట్లాడేందుకు యత్నించినప్పటికీ అనుమతించకపోవడంపై ఫడణవిస్ అభ్యంతరం లేవనెత్తారు. ఇలా చేయడం సభ్యులను పక్కదారి పట్టించడమే అవుతుందన్నారు. ప్రిసైడింగ్ అధికారి తీరు సరిగా లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫడణవిస్ తప్పనిసరిగా స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. ఆ సమయంలో 15 నిమిషాలచొప్పున రెండుసార్లు సభ వాయిదా పడింది.