ప్రాజెక్టుల పేరుతో దోపిడీ
సాక్షి, మహబూబ్‌నగర్ : పాలమూరు ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ దోపిడీకి ప్రయత్నిస్తోందని బీజేపీ సీనియర్ నేత నాగూరావు నామాజీ ఆరోపించారు. శుక్రవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఐదేళ్ల అనంతరం పాలమూరు పర్యటనకు వచ్చి.. తిరిగి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కోర్టుల్లో కేసులేస్తే ప్రాజెక్టును ఆపాలని స్టే ఏమీ ఇవ్వలేదని, కావాలని బురదజల్లి ఏదో వంకతో ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేస్తూ నిధులు కేటాయించకుండా నీరుగారుస్తున్నారని ఆరోపించారు. వరద జలాలపై నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల జీఓ.69ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు, పూర్తి కాలేదు, మరో ప్రాజెక్టును తెరపైకి తెచ్చి తద్వారా నిధుల దుర్వినియోగానికి పాల్పడేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొడతామన్నారు. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రజలకిచ్చిన మాట కేసీఆర్ మరిచిపోయారని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాల్‌రాజ్, వీరబ్రహ్మచారి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.