ఓ స్కూల్ కోసం జయలలిత డ్యాన్స్ షో..
ఆనాటి సాయాన్ని గుర్తుచేసుకుంటున్న గ్రామస్తులు
మైసూర్: కర్ణాటకలోని నాగువినహళ్లి గ్రామస్తులు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా గమనించారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారోత్సవాన్ని అయితే వాళ్లు కళ్లార్పకుండా టీవీల ముందు కూచొని చూశారు. మామూలుగా అయితే కర్ణాటక-తమిళనాడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కావేరి జలాల విషయంలో కర్ణాటక ప్రజలు తమిళ నాయకులు అంతగా ఇష్టపడరు. నాగువినహళ్లి గ్రామం ఉన్న మాండ్య జిల్లా కావేరి జలాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది.
మరీ, నాగునవిళ్లి గ్రామస్తులకు జయలలితపై ఎందుకంత ప్రేమ అంటే.. వారు 50 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాల్లోకి జారుకుంటారు. అప్పట్లో జయలలిత తమిళ హీరోయిన్గా కొనసాగుతున్నారు. తమ గ్రామంలో ఓ పాఠశాలను నిర్మించేందుకు సహకరించాల్సిందిగా 19 ఏళ్ల ఆమెను గ్రామస్తులు కోరారు. ఆమె వెంటనే అంగీకరించారు. అలా 1967 మార్చి 19న మైసూర్ యూనివర్సిటీలోని క్రాఫర్డ్ హాల్లో జయలలిత నృత్య ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ షోకు రూ. 10, 25, 50 టికెట్ ధరలుగా నిర్ణయించారు. ఈ షోలో జయలలిత అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఈ షో భారీ విజయం సాధించడంతో నాగువినహళ్లి గ్రామంలో పాఠశాలను కట్టడానికి తగిన డబ్బు సమకూరింది. 50 ఏళ్ల కిందట పెద్ద మనస్సుతో తమ గ్రామానికి సాయం చేసిన జయలలితను నాగువినహళ్లి లోని వృద్ధులు ఇప్పటికీ కృతజ్ఞతాభావంతో గుర్తుచేసుకుంటున్నారు.
'ఆ కార్యక్రమాన్ని నేను ఎలా మరిచిపోతాను? అద్భుతంగా సాగిన ఆమె డ్యాన్స్ షో ఇప్పటికీ నాకు గుర్తే. మా గ్రామంలో ఒక బడి ఉందంటే అది జయలలిత చలువే. పాఠశాలను చూసినప్పుడల్లా మాకు జయలలిత పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుంది. ఆమెకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం' అని అప్పట్లో యువకుడైన 80 ఏళ్ల రామచంద్రయ్య ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ చెప్పారు.
జయలలిత కన్నడిగానే..
జయలలిత పుట్టుకతో కర్ణాటక వాసి. ఆమె 1948లో మైసూర్‌లోని చెలువంబా ఆస్పత్రిలో జన్మించారు. ఆమె నాలుగేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. ఆ తర్వాత బెంగళూరులో మారిన ఆమె అక్కడ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1960లో ఆమె ఆంటీ అంబుజా జయలలితను మద్రాస్ తీసుకొచ్చారు. అలా ఆమె తమిళ సినీ ప్రస్థానం మొదలైంది.