చిన్నారి కన్నీరు
► కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న నాయుడుపేట సీఐపై
► చర్యలు తీసుకోవాలని దళితకుటుంబం వేడుకోలు
► కష్టం గుర్తుకొచ్చి కంటతడి పెట్టిన చిన్నారి
► న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు దళిత కుటుంబం వేడుకోలు
నెల్లూరు (బృందావనం) : తమ స్థలాన్ని కాజేసిన వడ్డీ వ్యాపారికి కొమ్ముకాస్తు తమకు అన్యాయం చేస్తున్న నాయుడుపేట సీఐ రత్తయ్యపై చర్యలు తీసుకోవాలని నాయుడుపేట పొగగొట్టం కాలనీకి చెందిన దళిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను కోరారు. కాలనీకి చెందిన పిగిలం లక్ష్మమ్మ, ఆమె కుమారుడు నాగార్జున, కోడలు ప్రతిమ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త తాగుడుకు బానిస కావడంతో అవకాశంగా తీసుకుని అతనికి స్థానిక వడ్డీ వ్యాపారి కొండూరు పొండురాజు తమకు తెలియకుండా రూ.15 వేల వరకు ఇచ్చారన్నారు. అప్పుకు తన భర్తతో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకుని తనకు 2008లో ప్రభుత్వం ఇచ్చిన విలువైన ఇంటి స్థలాన్ని కాజేసేందుకు పాండు రాజు యత్నిస్తున్నాడని తెలిపారు. 2009లో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారన్నారు.
ఈ విషయమై ఫిర్యాదు చేస్తే అప్పటి ఎస్ఐ తమకు న్యాయం చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా కమిషన్ ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ విచారణ జరిపి పాండురాజును తమ జోలికి వెళ్లదంటూ హెచ్చరించారన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22న కొందరు రౌడీలతో వచ్చి నా ఇంటి తాళం పగులగొట్టి సామాన్లు వీధిలో వేశారన్నారు. అడ్డుకున్న తనను, తన కోడలు ప్రతిమ, మనుమరాళ్లు సుప్రజ,సుప్రియలపై దాడి చేశారన్నారు.
ఈ విషయమై సీఐ రత్తయ్యకు ఫిర్యాదు చేస్తే ఆయన నిందితులకు కొమ్ముకాస్తూ కోర్టుకెళ్లమని చెబుతున్నాడని ఆరోపించారు. జరిగిన సంఘటనలు వివరిస్తుండగా చిన్నారి సుప్రజ కన్నీటి పర్యంతమైంది. కొంతసేపు స్తబ్ధత నెలకుని, వాతావరణం గంభీరంగా మారింది.