తెలుగు వెనుకబడి పోతోంది!
అయ్యప్పన్ సిఫార్సులకు చెల్లు చీటీ !
ఖరీఫ్‌లో ప్రస్తావనే లేని గోరుచిక్కుడు, కినోవా పంటలు
అనంతపురం అగ్రికల్చర్ : కరువు జిల్లా అనంతను ఆదుకోవడానికి, రైతులకు కరువు బారి నుంచి శాశ్వత విముక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘ప్రాజెక్టు అనంత’ పథకం అటకెక్కింది. 2012 జనవరిలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలో ఉన్నత స్థాయి నిపుణుల బృందం(హైపవర్ టెక్నికల్ కమిటీ) జిల్లాలో రెండు దఫాలుగా పర్యటించింది.
2013 ఏప్రిల్ 18, 2014 ఏప్రిల్ 22న కూడా కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించాయి. జిల్లాను శాశ్వతంగా కరువు బారి నుంచి కాపాడాలంటే చీనీ, అరటి, ఆయిల్‌పాం లాంటి పంటల విస్తీర్ణం తగ్గించాలని, వ్యవసాయానుబంధ రంగాలైన పశు పోషణ, పాడి, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, పట్టుసాగు పెంపు చేపట్టాలని, కొర్ర, సజ్జ, రాగి, జొన్న లాంటి చిరుధాన్యపు పంటలు, పప్పుధాన్యపు పంటల విస్తీర్ణాన్నీ పెంచి, అన్నింటికీ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులు సిఫారసు చేశారు.
గోరుచిక్కుడు, కినోవా.. అంటూ హడావిడి...
వేరుశనగ విస్తీర్ణాన్ని 5 లక్షల హెక్టార్లకు తగ్గించి వాటి స్థానంలో గోరుచిక్కుడు పంటను సాగులోకి తీసుకు రావాలని 2012 ఖరీఫ్‌లో ప్రణాళిక రచించారు. అయ్యప్పన్ కమిటీ సిఫారసుల ఆధారంగా రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్టు అనంత’ రూపొందించారు. దీంతో గత రెండేళ్లుగా జిగురుకు ఉపయోగించే గోరుచిక్కుడు, బలవర్ధకమైన పోషకాలు కలిగిన కినోవా పంటల గురించి అధికారులు విశేష ప్రాచుర్యం కల్పించి హడావిడి చేశారు.
ఈ క్రమంలో 2012 ఏప్రిల్‌లో కొందరు అధికారులు, రైతులు రాజస్తాన్ రాష్ట్రంలో పర్యటించి గోరుచిక్కుడు గురించి తెలుసుకున్నారు. తిరిగొచ్చాక కొందరు రైతులు సుమారు 2 వేల ఎకరాలల్లో గోరుచిక్కుడు సాగు చేశారు. అయితే మార్కెటింగ్ విషయంలో తీవ్ర నిరుత్సాహం ఎదురైంది. దీంతో మరుసటి ఏడాది ఈ పంట కనిపించలేదు. 2013లో ప్రసన్నాయపల్లికి చెందిన శివశంకర్‌రెడ్డి ద్వారా ఆపార్డ్ సంస్థ కినోవా పంటను ప్రయోగాత్మకంగా సాగు చేయించింది.
దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో దీనిని కూడా ప్రాజెక్టు అనంతలో చేర్చారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 100 గ్రామాల్లో కినోవా పంట సాగు చేయించాలని భావించారు. అలాగే జిల్లాలో కినోవా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వసతి కల్పిస్తామని గొప్పగా చెప్పారు. ఇపుడు ఆ ఊసే ఎత్తడం లేదు. సరైన కారణాలు చెప్పకుండా జిల్లా అధికారులు దాటవేస్తున్నారు.