అనుమానితులకు.. లై డిటెక్టర్ టెస్టులు
న్యూఢిల్లీ:
గత అక్టోబర్లో అదృశ్యమైన జేఎన్యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ విషయంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పందించింది. 9 మంది అనుమానితులకు లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 23కు వాయిదా వేసింది.
విద్యార్థి ఎన్నికలకు సంబంధించి అహ్మద్ ఉంటున్న గది వద్దకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలు అతడితో గొడవకు దిగారని, దాడి చేశారని అప్పటి నుంచి అహ్మద్ కనిపించకుండా పోయాడని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు పోలీసులు కనుక్కోలేకపోయారని అతడి తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.
అతడు కనిపించకుండాపోయి రెండు నెలలు గడిచిపోతుంది. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తాన్ని స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేయించాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ వినోద్ గోయల్ లతో కూడిన ధర్మాసనం ఇంతకు ముందే పోలీసులను ఆదేశించింది. వర్సిటీలో అనువణువు గాలించి ఏదో ఒక ఆధారాన్నయినా సంపాదించాలని సూచించింది. దీంతో నజీబ్ అహ్మద్ తల్లి దండ్రుల సమక్షంలో రెండు రోజులుగా 560 మంది అధికారులు యూనివర్సిటీ మొత్తాన్ని జల్లెడపడుతున్నా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.