భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భర్త
యాకుత్‌పురా: కుటుంబ కలహాలు దంపతులను బలిగొన్నాయి. భార్యను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడో తాగుబోతు. రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో గురువారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. ఇన్స్పెక్టర్ రమేష్ కథనం ప్రకారం... భవానీనగర్ ఠాణా పరిధిలోని జహంగీర్‌నగర్‌కు చెందిన సయ్యద్‌జాఫర్ (35), నజియా బేగం (32) భార్యాభర్తలు. 16 ఏళ్ల క్రితం వీరికి పెళ్లైంది. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. నెలన్నరగా సయ్యద్ కుటుంబం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్‌నగర్‌లో నివాసముంటోంది. పత్తర్‌గట్టీ పటేల్‌మార్కెట్‌లోని వస్త్రాల దుకాణంలో జాఫర్ పని చేస్తున్నాడు.
నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇంటి ఖర్చులకు భర్త డబ్బులు ఇవ్వకపోవడంతో నజియా కొన్ని రోజులుగా మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ కుటుం బాన్ని పోషిస్తోంది. కుటుంబకలహాల నేపథ్యంలో జాఫర్ గతేడాది సెప్టెంబర్ 24న నజియా గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు భవానీనగర్ పోలీసులు ఐపీసీ 306,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత భార్య కేసును ఉపసంహరించుకోవడంతో జైలు నుంచి బయటికి వచ్చాడు. కొన్ని రోజులు బాగానే ఉన్న జాఫర్ రెండు వారాలుగా తప్పతాగి వచ్చి భార్యతో ఘర్షణ పడుతున్నాడు.
ఇదే క్రమంలో గురువారం రాత్రి తాగివచ్చి గొడవపడ్డాడు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న నజియా తలపై రోకలిబండతో మోది చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంట్లోని పైకప్పు రాడ్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పిల్లలు లేచి చూసేసరికి తల్లిదండ్రులు మృతి చెంది ఉన్నారు. సమాచారం అందుకున్న రెయిన్‌బజార్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలి సోదరుడుమహ్మద్ హఖిల్ ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.