నగ్న ఫొటోలు.. జస్ట్ ఫర్ ఫన్!
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల వద్ద పర్యాటకులు నగ్నంగా ఫొటోలు దిగి వాటిని ఆన్లైన్లో పోస్ట్‌చేసే క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. మలేసియా ప్రధాన పర్యాటక కేంద్రాలు, థాయ్‌లాండ్ బీచ్‌లే కాకుండా ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జి, పారిస్‌లోని ఈఫిల్ టవర్, చైనాలోని గ్రేట్‌వాల్, పెరూలోని మాచు పిచ్చు తదితర ప్రాంతాలు పర్యాటకుల నగ్న ఫొటోలకు ప్రధాన వేదికలవుతున్నాయి. బంగీజంపులకు ప్రసిద్ధి చెందిన హాంకాంగ్‌లోని చాంగ్మైలో నగ్నంగా జంప్ చేయడానికి మహిళా పర్యాటకులు పోటీ పడుతున్నారు. ఫొటోలు దిగి ఫేస్బుక్, ట్విట్టర్లో పోటీలు పడి పోస్ట్ చేశారు. అవి చాలనట్టు కొంత మంది పర్యాటకులు 'మై నేకెడ్ ట్రిప్' 'నేకెడ్ ఎట్ మాన్యుమెంట్స్' అనే పేర్లతో బ్లాగులు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు ప్రపంచంలో నగ్న ఫొటోలు దిగడానికి అనువైన ప్రదేశాలివేనంటూ ఆన్లైన్ ట్రావెల్ గైడ్లు కూడా వెలిశాయి.
జనవరిలో ప్రారంభమైన ఈ క్రేజ్ నేటికీ కొనసాగుతోంది. కొన్ని దేశాలు బట్టలిప్పిన పర్యాటకులను అరెస్టు చేసి ఆయా దేశాల చట్టాల ప్రకారం శిక్షలు విధించినా ఈ ఆన్లైన్ క్రేజీకి ఫుల్స్టాప్ పడట్లేదు.మొన్నటికి మొన్న మలేసియాలో గిరిజనులు పరమ పవిత్రంగా భావించే మౌంట్ కినబాలు వద్ద నగ్నంగా ఫొటోలు దిగుతూ పట్టుబడ్డ ముగ్గురు బ్రిటన్ మహిళా పర్యాటకులకు మూడు నెలల జైలు శిక్ష, రూ. 85 వేల జరిమానాను మలేషియా కోర్టు విధించింది. వెనక్కి వెళితే పర్యాటకుల నగ్న ఫొటోల క్రేజ్ 2009లోనే ప్రారంభమైంది. కొంతకాలం తర్వాత తెరపడి మళ్లీ ఈ ఏడాది జనవరిలో మొదలైంది.
మాస్ మానియాగా మారుతున్న ఈ క్రేజ్ వెనుకనున్న మనస్తత్వాన్ని విశ్లేషించేందుకు అంతర్జాతీయ మీడియా కొంత మంది క్రేజీ పర్యాటకులను ప్రశ్నించగా పలు రకాల సమాధానాలు వచ్చాయి. ఎక్కువ మంది 'జస్ట్ ఫర్ ఫన్' అని సమాధానం ఇవ్వగా, తాము నగ్న ఫొటోలను అసభ్యంగా ఏమీ దిగడం లేదని, తమ ఫొటోల ద్వారా ప్రపంచ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని మరి కొందరు సమాధానం చెప్పారు.