ఎన్నికల్లో ఓడి.. కాశీకెళ్లిన టీఆర్ఎస్ నేత
హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోయినందుకు మనస్తాపం, అప్పుల వాళ్ల వేధింపులతో అదృశ్యమైన తెలుగు సినీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత నక్క రాము ఆచూకీ లభ్యమైంది. ఫిలింనగర్ బద్దం బాల్‌రెడ్డి నగర్ బస్తీకి చెందిన రాము గత నెల 9న జరిగిన యూనియన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాడు. అంతకుముందే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. వైన్‌షాప్ భాగస్వాములు సైతం పార్ట్నర్ షిప్ నుంచి తొలగించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో చెప్పకుండా అదృశ్యం కావడంతో భార్య తన భర్త కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం తన దగ్గర పైసా లేదని ఇబ్బందికరంగా ఉందని డబ్బు పంపించాల్సిందిగా బండారు బాల్‌రెడ్డినగర్ బస్తీకి చెందిన మాగంటి రమణకు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని రాము భార్యకు చెప్పడంతో వెంటనే రాము భార్య, బావమరిది విజయవాడకు వెళ్లి గుర్తించారు. గత నెల 9న నేరుగా రైలు ఎక్కి కాశీకి వెళ్లానని దర్శనం అనంతరం విజయవాడకు వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. రాము ఆచూకీ లభించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.