నక్కపల్లి జాతీయ రహదారిపై దారుణం..
సాక్షి, విశాఖపట్నం : నక్కపల్లి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు తల నరికి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన విశాఖపట్నంలోని నక్కపల్లి జాతీయ రహదారిపై గల టోల్గేట్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మదురైకి చెందిన నీలమేఘ అమరన్ అనే వ్యక్తి నక్కపల్లి జాతీయ రహదారిపై గల టోల్గేట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా కారులో వచ్చిన ఏడుగురు వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా అతన్ని కొట్టి తల నరికి హత్య చేశారు.
అనంతరం దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధార్ కార్డు ఆదారంగా మృతుడిని తమిళనాడుకు చెందిన నీలమేఘ అమరన్గా పోలీసులు గుర్తించారు. అయితే హత్య జరిగిన కొద్దిగంటల్లోని పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం కారుతో సహా పరారీలో ఉన్న నలుగురిని ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వద్ద పట్టుకున్నారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.