2,002 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్క్
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2,001.8 ఎకరాల్లో బల్‌్కడ్రగ్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఈ బల్‌్కడ్రగ్ పార్కును ఈపీసీ విధానంలో నిర్మించడానికి ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రూ.1,234.75 కోట్లతో బల్‌్కడ్రగ్ పార్కును డిజైన్ చేసి అభివృద్ధి చేసే విధంగా ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 2001.8 ఎకరాల్లో.. 139.07 ఎకరాల్లో ఉన్న చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు.
అభివృద్ధి చేసిన పార్కులో 1,009.85 ఎకరాల్లో ఫార్మా పరిశ్రమలు, 595.4 ఎకరాల్లో ఏపీఐ–డీఐఎస్ సింథసిస్, 414.1 ఎకరాల్లో ఫెర్మిటేషన్స్, 150 ఎకరాలు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే విధంగా ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. మార్చి 18 నాటికి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తిచేసి పనులు అప్పగించనున్నారు.
చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్‌్కడ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే.. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ఈ పార్కును కైవసం చేసుకున్న విషయం విదితమే. తొలుత కాకినాడ వద్ద నిర్మించడానికి ప్రయత్నం చేయగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలన్న నిబంధన మేరకు నక్కపల్లి వద్ద పార్కును అభివృద్ధి చేస్తున్నారు.
ఫార్మాహబ్‌గా ఏపీ
ఈ బల్‌్కడ్రగ్ పార్కుతో రాష్ట్రం ఫార్మాహబ్‌గా ఎదగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 300కు పైగా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే 100కు పైగా ఫార్మా కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. వీటిద్వారా 27,360 మందికి ప్రత్యక్షంగా ఉపాధికి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం దేశీయ ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం 16 శాతం వాటాతో మూడోస్థానంలో ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ.41,500 కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు వస్తుండగా.. అందులో రూ.8,300 కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2,400 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఇప్పటికే మైలాన్, ఫైజర్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో వంటి 60కి పైగా దిగ్గజసంస్థలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ బల్‌్కడ్రగ్ పార్కు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.