రాష్ట్రం కరవుతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు కుటుంబంతో కలసి విహార యాత్రలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మండిపడ్డారు.
నక్కపల్లి (విశాఖ) : రాష్ట్రం కరవుతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు కుటుంబంతో కలసి విహార యాత్రలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మండిపడ్డారు. శనివారం విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గోడిచర్లలో కరవు యాత్ర సందర్భంగా రఘువీరా సీఎం చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న నిధులను జన్మభూమి కమిటీల పేరుతో స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు.
ఉపాధి కూలీలకు మజ్జిగ పేరుతో హెరిటేజ్ మజ్జిగ సరఫరా చేసినట్టు దొంగ లెక్కలు చూపించి తండ్రీ కొడుకులు ఇద్దరూ రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని అన్నారు. మజ్జిగ కాదు కదా కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదన్నారు. రాష్ట్రంలో కరవు ఎక్కడుందని ప్రకటనలు చేస్తున్న సీఎం, మంత్రులకు దమ్ముంటే తమతో రావాలని, కరవును చూపిస్తామని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా రాకపోతే ఆ విషయంలో తొలి ముద్దాయి చంద్రబాబేనన్నారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే దాన్ని సాధిస్తామన్నారు.