ఫుట్‌బాల్ పోటీల్లో నల్లగొండ ఓటమి
రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్‌బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న పోటీలను పెద్దపెల్లి ఎంపీ వివేకానంద, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలీ రఫత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్ఫాస్ట్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, పూల్-ఏలో నల్లగొండ-ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో 0-5 గోల్స్‌తో నల్లగొండ ఓడిపోయింది. అలాగే ఈస్ట్ గోదావరి-మెదక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎవరూ గోల్స్ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. పూల్-బీలో విశాఖపట్నం-నిజామాబాద్ జట్లు తలపడగా 7-0 గోల్స్ తేడాతో విశాఖపట్నం గెలుపొందింది.