ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వొద్దు
చెన్నూర్, న్యూస్‌లైన్ : చెన్నూర్, కోటపల్లి మండలాల్లో అధికారులు ఇసుక రవాణాకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇకపై అనుమతి ఇవ్వొద్దని రైతులు చెన్నూర్ తహశీల్దార్ వీరన్న, వీఆర్వో జామీరుద్దీన్ను ఘోరావ్ చేశారు. పట్టణంలోని గోదావరి నది సమీపంలో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే నల్లాలు ఓదేలు చేపట్టిన మహాధర్నా శిబి రాన్ని సందర్శించడానికి బుధవారం తహశీల్దార్ వచ్చా రు. ఈ సందర్భంగా ఆయనను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డి, సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. రోజూ వందలాది లారీలు ఈ ప్రాంతం నుంచి వెళ్లడం ద్వారా చేలపై దుమ్ముధూళి చేరి దెబ్బతిన్నాయని తెలిపారు. దిగుబడి రాక నష్టాల పాలయ్యూమని ఆవేదన వ్యక్తంచేశారు. దెబ్బతిన్న పంటలకు కాంట్రాక్టర్లు పరిహారం చెల్లించేలా చూడాలని, ఇసుక రవాణాకు అనుమతి రద్దు చేయూలని డిమాండ్ చేశారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తహశీల్దార్ పేర్కొన్నారు. ఆయన వెంట డెప్యూటీ తహశీల్దార్ శేఖర్ ఉన్నారు.
రెండో రోజుకు మహాధర్నా..
ఇసుక లారీల రాకపోకలతో రోడ్డు పక్కనున్న పంటలు దెబ్బతింటున్నాయని, ఆయూ రైతులకు పరిహారం అందించాలని ఎమ్మెల్యే నల్లాల ఓదేలు చేపట్టిన మహాధర్నా బుధవారం రెండో రోజుకు చేరింది. కాంట్రాక్టర్లు రైతులకు పరిహారం చెల్లించే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఐదు వందల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, అధికారులు ఇసుక తరలింపునకు అనుమతి రద్దు చేయూలని కోరారు. దీక్షలో సర్పంచ్ ఎస్.కృష్ణ, టీఆర్ఎస్ చెన్నూర్, కోటపల్లి, మందమర్రి, జైపూర్ మండలాల నాయకులు దామోదర్‌రెడ్డి, రాజిరెడ్డి, బాపురెడ్డి, జాడి తిరుపతి, చేకూర్తి సత్యనారాయణరెడ్డి, గద్దల హన్మంతు, ప్రభాకర్‌రెడ్డి, వెన్నపురెడ్డి బాపురెడ్డి, ఆయూబ్, కొండపర్తి వెంకటరాజం, మల్లికార్జున్ యాదవ్, వార్డు సభ్యులు సాలక్క, మల్లయ్య, రాజబాపు, టీఆర్ఎస్వీ నాయకులు ప్రభాకర్, సంతోష్ పాల్గొన్నారు.
కొల్లూరు వద్ద రిలే దీక్షలు
కోటపలి : కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలోని గోదావరి నది నుంచి ఇసుక తరలింపునకు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ త్రివేణి సంగమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం కొల్లూరు, బోరంపల్లి గ్రామస్తులు కొల్లూరు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గోదావరి నది నుంచి ఇసుక తరలింపు పేరిట కాంట్రాక్టర్లు జీవన విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇసుక తరలింపుతో కొల్లూరు, దేవులవాడ, రావులపల్లి, బోరంపల్లి తదితర నదీ తీర ప్రాంతాలకు భవిష్యత్తులో తాగు, సాగునీరు లభించని పరిస్థితి ఏర్పడనుందని ఆందోళన వ్యక్తంచేశారు. బోరంపల్లి గోదావరి వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం వృథాగా మారనుందని పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్షలో గ్రామస్తులు సోదారి మొగిలి, దుర్గం కృష్ణదాస్, జుమిడి పోచం, పోచం, కామెర రాజలింగు తదితరులు పాల్గొన్నారు.