'లోకేష్ ఆస్తులు కాకి లెక్కలు'
- ధైర్యముంటే ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్‌కు ముందుకు రండి
- రెండున్నరేళ్లలో రూ.2 లక్షల కోట్లు తండ్రీ కొడుకులు దోపిడీ
- వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న
కొడవలూరు : సీఎం కుమారుడు లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలు కాకి లెక్కలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు కొడవలూరు మండలంలోని చాయప్ప నగర్లో గురువారం విలేకరుల సమావేశంలో ప్రసన్న మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఎంపీ మిథున్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించి ముందుకు రావాలన్నారు. వారి ఆస్తుల వివరాలు వాస్తవమే అయితే అంతకంటే 50 శాతం అదనంగా మిథున్‌రెడ్డి ఇస్తానంటే ఎందుకు తేలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారని ప్రశ్నించారు. బాబు పాలనలో రాష్ట్రం ప్రమాదపుటంచున ఉందన్నారు. అమరావతి ఒక ప్రపంచ స్థాయి కుంభకోణమని అభివర్ణించారు.
బాబును ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి చక్రవర్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కించవచ్చన్నారు. చంద్రబాబు ఈ రెండున్నరేళ్లలోని అక్రమార్జన, ఆయన గత 9 ఏళ్ల పాలనలోని అక్రమార్జనకు ఎన్నో రెట్లు మించి పోయిందన్నారు. లంచాలు, ముడుపులు, వాటాలు, కమీషన్లే పరమావధిగా బాబు పాలన సాగుతోందన్నారు. ఇసుక రీచ్‌ల నుంచి సోలార్ ప్లాంట్ల దాకా, ఇరిగేషన్ శాఖ నుంచి విద్యుత్ శాఖ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనకు ముడుపులు అందేలా చంద్రబాబు కుమారుడుతో దుకాణం పెట్టించాడని ఆరోపించారు. రెండున్నరేళ్లలో రూ.2 లక్షల కోట్ల అక్రమార్జనకు తండ్రీకొడుకులు పాల్పడ్డారని విమర్శించారు.
రాజధాని పేరుతో లక్ష కోట్లు, లిక్కర్ సిండికేట్ పేరుతో 6 వేల కోట్లు, పవర్ ప్రాజెక్ట్‌తో 5 వేల కోట్లు, ఇసుక అక్రమాల్లో 3 వేల కోట్లు, పారిశ్రామిక వేత్తలకు అదనపు రాయితీలు కల్పించి 3 వేల కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో 7 వేల కోట్లు, బైరటీస్ కుంభకోణంలో వేల కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారన్నారు. తండ్రీకొడుకులకు తగ్గట్టుగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకొంటున్నారని చెప్పారు. విభజనతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది పోయి అడ్డంగా దోచుకోవడమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, జిల్లా కార్యదర్శి పెనాక శ్రీనివాసులురెడ్డి, మాజీ జెడ్పీటీసీ నల్లావుల శ్రీనివాసులు, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు.