కొనసాగుతున్న ఉద్రిక్తతలు
బెల్గాం జిల్లా యళ్లూరులో భారీ బందోబస్తు
వ్యాపించిన ‘నామఫలకం’ రగడ
సాక్షి, బెంగళూరు : నామఫలకం ఏర్పాటు విషయంపై బెల్గాం జిల్లా యళ్లూరులో ఏర్పడిన ఘర్షణలు సోమవారం చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించాయి. దీంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యళ్లూరులో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) ఏర్పాటు చేసిన ‘ఇది మహారాష్ట్ర ప్రాంతం’ అనే అర్థం వచ్చే నామఫలకాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తొలగించడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెల్సిందే.
సోమవారం కూడా ఎంఈఎస్ కార్యకర్తలు కొంతమంది కర్ణాటక విరుద్ధంగా యళ్లూరుతో పాటు చుట్టుపక్కల ఉన్న దేసూరు, వడగాంవ, కిణై్మ, గుల్బగుంజి తదితర గ్రామాల్లో కరపత్రాలను పంచారు. ఈ కరపత్రాల్లో ‘బస్స్టేషన్లలో ఇది మహారాష్ట్ర అన్న నామఫలకాలను ఏర్పాటు చేద్దాం.. ఒకరికి మరొకరు ఎదురుపడ్డప్పుడు జై మహారాష్ట్ర అని పలకరించుకుందా.. వంటి నినాదాలు రాసి ఉన్న కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పోలీసులు అకారణంగా తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఈఎస్ కార్యకర్తలు ఇచ్చిన బంద్కు సరైన స్పందన లభించలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా చేతుల్లో కర్రలను పట్టుకుని వీధుల్లో తిరుగుతున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విధానసౌధ ముట్టడికి యత్నం
బెల్గాం జిల్లాలో కన్నడిగులు, పాత్రికేయులపై ఎంఈఎస్ కార్యకర్తలు జరపుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పలు కన్నడ సంరక్షణ సంఘాల కార్యకర్తలు విధానసౌధ ముట్టడికి సోమవారం ప్రయత్నించారు. ఈ సందర్భంగా కన్నడ చలువళి పార్టీ నాయకుడు వాటాళ్నాగరాజు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలపై అకారణంగా తరుచుగా దాడులు చేస్తూ శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతున్న ఎంఈఎస్ కార్యకర్తలపై గూండాయాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విధానసౌధ ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టారు.
పరిస్థితి అదుపులోకి :
యళ్లూరుతోపాటు చుట్టపక్కల ఉన్న గ్రామాల్లో సోమవారం సాయంత్రానికి అన్ని ప్రాంతాలు అదపులోకి వచ్చాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా ప్రకటనలో తెలిపారు.