సాక్షి, బెంగళూరు : పరిషత్‌లో సోమవారం ‘నామఫలకం’ రగడ తీవ్ర గందరగోళానికి దారితీసింది. బెల్గాం జిల్లా యళ్లూరులో మరాఠీలో రాసిన ఓ నామఫలకాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తొలగించారు. అప్పటి నుంచి స్థానికులు, మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై సోమవారం పరిషత్ నామఫలకం రగడ రగులుకుంది.
అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను నడపడం వీలుకాకపోవడంతో సభాపతి శంకరమూర్తి మూడు గంటలపాటు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన వెంటనే విపక్షనేత కే.ఎస్ ఈశ్వరప్ప యళ్లూరు ఘటనలో ప్రభుత్వ చర్యలు ఏమిటని నిలదీశారు. ఈ విషయలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో తరుచూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఫ్లోర్‌లీడర్ బసవరాజ్‌హొరట్టి మాట్లాడుతూ...బెల్గాం జిల్లాల్లో కన్నడిగులకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ విషయంపై చర్చిద్దామని శంకరమూర్తి విపక్షాలకు సర్దిచెప్పడానికి యత్నించినా వారు వినిపించుకోలేదు.
పరిషత్ నాయకుడు ఎస్.ఆర్ పాటిల్ జోక్యం చేసుకుని బెల్గాం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, రాద్ధాంతం చే యొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. విపక్షాల తీరు వల్ల సభా కార్యక్రమాలకు తరుచూ ఆటంకం కలుగుతోందని అనటంతో సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో ఎవరూ ఏమీ మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సభాపతి సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత కూడా బీజేపీ నాయకులు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టారు. విపక్షాల నిరసనల మధ్యనే ముసాయిదా బిల్లులకు మండలి ఆమోదం లభించింది.
పరిషత్‌లో నామఫలకం రగడ
Published Tue, Jul 29 2014 2:30 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement