మహిళ దారుణ హత్య
గొంతుకోసి హతమార్చిన దుండగులు
భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నంబూరు(పెదకాకాని): గుర్తుతెలియని దుండగులు మహిళను దారుణంగా గొంతుకోసి పరారైన సంఘటన నంబూరులో చోటుచేసుకుంది. మండల పరిధిలోని నంబూరు విజయభాస్కర్నగర్కు చెందిన నంబూరు సురేష్తో గుంటూరు రూరల్ మండలం ఓబులునాయుడుపాలెం గ్రామానికి చెందిన జ్యోతికి వివాహం అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉంది. సురేష్ పొగాకు కంపెనీలో ముఠా కూలీగా పనిచేస్తుండగా జ్యోతి కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం ప్రార్ధనకు వెళ్లిన జ్యోతి అనంతరం సుమారు మూడు గంటల సమయంలో దుస్తులు ఉతికేందుకు సమీపంలోని గుంటూరు చానల్ వద్దకు వచ్చింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఆ సమయంలో దుస్తులు ఉతికేవారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాలువ దాటి వెళ్లిందని చెబుతున్నారు. కాలువ దాటి వెళ్లిన జ్యోతి(25) సోమవారం ఉదయం సమీపంలో ఉన్న ముళ్ళ పొదలలో కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెదకాకాని పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఎస్.సుబ్బరాయుడు, డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐ సీహెచ్ చంద్రమౌళి, ఎస్ఐ కృష్ణయ్య చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్కా ్వడ్, క్లూస్ టీమ్లను రప్పించి తనిఖీలు చేశారు.
భార్యాభర్తల మధ్య వివాదం
కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిని గుర్తుతెలియని దుండగులు పదునైన కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన జ్యోతి ముళ్లపొదలలోకి ఎందుకు వెళ్లింది. ఎవరైనా పథకం ప్రకారం అక్కడికి పిలిపించారా, జ్యోతిని హత్య చేయడం వెనుక భర్త పాత్ర ఏమైనా ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు.