బాహుబలే కాదు.. మరో సినిమా సీన్స్ లీక్!
విజయవాడ: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పలు టాలీవుడ్ సినిమాలకు లీకుల బెడద వెంటాడుతూనే ఉంది. నిన్నటికి నిన్న రాజమౌళి 'బాహుబలి-2' సినిమా దృశ్యాలు లీకవ్వగా.. తాజాగా మరో ప్రతిష్టాత్మక సినిమా దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. విజయవాడ కుర్రకారు చేతిలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'బాహుబలి-2', నాగార్జున 'నమో వెంకటేశాయ' దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి.
'బాహుబలి-2' సినిమా దృశ్యాల లీకైన ఘటనపై చిత్రయూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన విజయవాడ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ విచారించారు. దీంతో హైదరాబాద్ ఆర్కా మీడియా ఉద్యోగి దయానంద్ వల్లే సినిమా విజువల్స్ లీకైనట్టు పోలీసులు నిర్ధారించారు. 'బాహబలి-2' దృశ్యాల లీక్‌పై దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురైంది. 'బాహబలి-2' సినిమానే కాదు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'నమో వెంకటేశాయ' దృశ్యాలు కూడా లీకైనట్టు వెల్లడైంది. చైతన్య అనే యువకుడి ల్యాప్‌ట్యాప్‌లో లీకైన నమోవెంకటేశాయ దృశ్యాలు కనిపించాయి. దీంతో నిందితులపై కాపీరైట్స్, ఐటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు లీకైన రెండు కొత్త సినిమాల దృశ్యాలు విజయవాడలోని యువకుల వాట్సాప్, సోషల మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.