ఉద్యమకారులపై ఉక్కుపాదం
సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమైక్యవాదులపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఉద్యమకారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. సమైక్య ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఎక్కడా లాఠీ ఎత్తవద్దని, సంయమనంతో వ్యవహరించమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా, అలిపిరిలో వీహెచ్‌ను అడ్డుకున్న ఘటనలో ఆందోళనకారులను పక్కనెట్టి, లాఠీచార్జీ చేసి హడావుడి చేశారు. తీరా దెబ్బలు తిన్నవారిపైనే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.
ఉద్యమం ఆరంభంలో కొందరు ఉద్యమకారులు పాత కారును తగులబెడితే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకపోయినా, గొడవలు చేయకపోయినా ఉద్యమాన్ని కఠినంగా అణచివేసే ధోరణిలో పోలీసులు సాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసుల పరిధిలో ఇప్పటి వరకు హింసాత్మక ఘటనలు జరగకపోయినా, పోలీసులు మాత్రం అవసరానికి మించి అత్యుత్సాహం చూపుతూ ఉద్యమకారులను అడ్డుకుంటున్నారని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు విమర్శిస్తున్నారు.
తిరుమలకు వచ్చి సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతినేవిధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావుపై న్యాయవాదులే స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. అదే అలిపిరిలో పుష్పగుచ్ఛం ఇచ్చి నిరసన తెలిపినవారిని ఎవరూ ఫిర్యాదు చేయకుండానే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. దీనిపై న్యాయవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు పైకి మాత్రం తాము ఉద్యమానికి సానుకూలం అని చెబుతున్నా లోలోపల తమకు అందిన ఉత్తర్వుల ప్రకారం ఉద్యమాన్ని కఠినంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే భారీ ఎత్తున సాయుధబలగాలను మోహరిస్తున్నారు. మరోవైపు ఉద్యమాలను అణచి వేసేందుకు కొత్త కొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నారు. ఇంతవరకు తిరుపతివాసులకు తెలియని ముళ్లకంచె పద్ధతిని తెరపైకి తెచ్చారు. తప్పుడు కేసుల్లో ఇరికించిన సమైక్యవాదులను విడుదల చేయాలని, వీహెచ్‌పై కేసు నమోదు చేయాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, కార్యకర్తలను నిలువరించేందుకు ముళ్లకంచెను అడ్డుగా వేశారు. ఇద్దరు డీఎస్పీల సారథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
సాక్ష్యాధారాల సేకరణ
తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు సమైక్య ఉద్యమాలను నిశితంగా పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఎక్కడైనా ఉద్యమకారులు ఆందోళనలకు, నిరసనలకు దిగే అవకాశం ఉందని సమాచారం అందితే, అక్కడ పోలీసు వీడియో కెమెరాలను, స్టిల్ ఫొటోగ్రాఫర్లను ఉంచి జరుగుతున్న ఘటనలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నారు. వీహెచ్ ఘటనలో కూడా ఇలా వీడియోల ఆధారంగానే, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, నిరసనకారులను అరెస్టు చేశారు. వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అలిపిరి ఘటన సంచలనం సృష్టించటంతో దీనిపై డీజీపీ దినేష్‌రెడ్డి నుంచి కూడా అర్బన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు అక్షింతలు పడినట్లు సమాచారం. ఈ క్రమంలో నిఘావర్గాలు నగరంలో జరిగే ఉద్యమాలకు సంబంధించి ప్రతి క్షణం సమాచారాన్ని ఎస్పీకి అందించే విధంగా స్పెషల్ బ్రాంచ్ వర్గాలు రంగంలోకి దిగాయి. అదే సమయంలో ఉద్యమ తీవ్రత, పాల్గొంటున్న సంఘాలు, సంస్థలు, నాయకుల వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నాయి.