ఇక ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’
పథకం పరిధిలోకి 1,038 జబ్బులు
సాక్షి, హైదరాబాద్: పేద రోగుల జీవితానికి భరోసానిచ్చిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం పేరు మారింది. దీన్ని ‘డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవ’గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇకపై డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆరోగ్యశ్రీ బోర్డును పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకూ 26 లక్షల మంది పేద రోగులకు పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు.ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న వైఎస్సార్ ప్రారంభించారు.
పథకంలో మరో 100 జబ్బులు
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 938 జబ్బులకు సేవలందుతున్నాయి. పథకం డాక్టర్ నందమూరి తారకరామావు ఆరోగ్యసేవగా మారిన నేపథ్యంలో మరో 100 జబ్బులకు కూడా వర్తిస్తుంది. ఇకపై 1038 జబ్బులకు ఉచిత ఆరోగ్యసేవలు అందుతారుు.
రూ.2.50 లక్షలకు పెంపు: ఆరోగ్యశ్రీ పథకంలో రూ.2 లక్షల వరకు చికిత్స కవరేజీ ఉంది. ఇకపై 1038 జబ్బులకు వర్తించేలా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.50 లక్షలువర్తింప చేస్తామని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు.