నక్సలిజం కట్టడిలో విఫలం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ మండిపాటు
రాజ్‌నందగావ్/కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో నక్సలిజాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పీసీసీ చీఫ్ నంద కుమార్ పటేల్ ముఖ్యమంత్రి కాకుండా ఉండేందుకే మావోయిస్టులు ఆయనను హతమార్చారని, మే 25న మావోయిస్టులు బస్తర్‌లో జరిపిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సొంత నియోజకవర్గమైన రాజ్నందగావ్తోపాటు కాంకేర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మావోల దాడిలో మృతి చెందిన ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ భార్య అల్కా ముద్లియార్.. రాజ్‌నంద్‌గావ్‌లో రమణ్‌సింగ్‌పై పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు.
కోడ్ ఉల్లంఘించలేదు... రాహుల్: యూపీలోని ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితుల్లో కొందరిని పాకిస్థాన్ ఐఎస్ఐ సంప్రదించిందన్న తన వివాదాస్పద వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ సమర్థించుకున్నారు. తన ప్రసంగంలో ఎక్కడా ఎన్నికల నియమావళికిగానీ, చట్టానికిగానీ విరుద్ధంగా ప్రవర్తించలేదని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి శుక్రవారం పంపిన 8 పేజీల లేఖలో వివరణ ఇచ్చారు. బీజేపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గడువు (శుక్రవారం ఉదయం 11.30 గంటలు) ముగియడానికి కాస్త ముందుగా రాహుల్ వివరణ పత్రం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ)కు అందింది.