‘నంది’త మోహిని..!
- నందివాహనంపై ఆది దంపతులు
- మహాగౌరిగా దర్శనమిచ్చిన భ్రామరి
- కనుల పండువగా గ్రామోత్సవం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఎనిమిదో రోజు ఆదిదంపతులైన భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లు నందివాహనంపై దర్శనమిచ్చారు. అమ్మవారు మహాగౌరి రూపంలో దీవెనలు అందించారు. దివ్య మంగళ స్వరూపంతో కనిపించిన స్వామి అమ్మవార్లను నందివాహనంపై వీక్షించిన భక్తులు నందీవాహనాధీశా నమోనమః అంటూ స్తుతించారు. ముగ్ధమనోహరంగా దరహాస వీచికతతో కనిపించిన శ్రీభ్రమరాంబాదేవికి సాష్టాంగ ప్రమాణాలను చేస్తూ పాహిమాం పాహిమాం అంటూ ప్రార్థించారు. అంతకు ముందుగా ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి విశేష వాహనసేవలను నిర్వహించారు. అనంతరం మహాగౌరి అలంకార రూపంలో ఉన్న అమ్మవారిని వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అలంకార పూజలను చేశారు. ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాల వద్దకు చేరిన ఉత్సవమూర్తులకు తిరిగి ప్రత్యేకార్చనలను చేసి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగి రాత్రి 9.30గంటలకు తిరిగి ఆలయప్రాంగణం చేరుకుంది. ఈఓ నారాయణ భరత్ గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, సాయికుమారి, మధుసూదన్‌రెడ్డి, అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
నేడు కల్యాణోత్సవం
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ భ్రమరాంబాదేవిని సిద్ధిదాయినీగా అలంకరించి ప్రత్యేకపూజలను చేస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై అధిష్టింపజేసి వాహన పూజలను నిర్వహిస్తారు. హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను పురవీధులలో ఊరేగిస్తారు. ఆ తరువాత కల్యాణోత్సవం, శయనోత్సవ సేవలు జరుగుతాయి.