nandyal government hospital
-
గర్భిణి మృతదేహాన్ని చెట్టుకు కట్టి వదిలేశారు
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలోని బి.నాగిరెడ్డిపల్లెలో చోటుచేసుకున్న అనాగరిక చర్య మానవత్వాన్ని మంటగలిపింది. నిండుచూలాలు మృతిచెందగా.. ఆమె అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని చెప్పడంతో దిక్కుతోచని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసి వచ్చారు. స్థానికుల కథనం ప్రకారం.. బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తితో శిరివెళ్లకు చెందిన లావణ్య (20)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నిండు గర్భిణి అయిన లావణ్యను శుక్రవారం రాత్రి ప్రసవం నిమిత్తం శిరివెళ్ల నుంచి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డను ప్రసవించకుండానే మృతి చెందింది. మృతదేహాన్ని శనివారం బి.నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చారు. అంత్యక్రియల నిమిత్తం ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భంలో శిశువు ఉండగా అంత్యక్రియలు చేస్తే అరిష్టమంటూ అడ్డుపడ్డారు. చేసేది లేక కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ ఆ మృతదేహాన్ని ఓ వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పనపల్లె సమీపంలోని పులిబోను వాగు ప్రాంతంలో ఓ చెట్టు మొదలు వద్ద మృతదేహాన్ని కూర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి వచ్చారు. ఆదివారం రుద్రవరం, గోనంపల్లె, అప్పనపల్లె గ్రామాల ప్రజలు పొలాల్లో పనుల నిమిత్తం వెళుతూ దారి పొడవునా పూలు చల్లి ఉండటాన్ని గుర్తించారు. మరికొందరు సాహసించి కాస్త ముందుకు వెళ్లడంతో మృతదేహం కన్పించింది. భయభ్రాంతులకు గురైన వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. దుఖఃసాగరంలో బంధువులు: నిండు చూలాలు మృతి చెందడంతో ఇరు కుటుంబాల వారు శోకసంద్రంలో మునిగారు. అదే సమయంలో గ్రామస్తులు ఆచారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు అంటూ సూటిపోటి మాటలు వారిని మరింత కుంగదీశాయి. గ్రామంలో అంత్యక్రియలు చేయనివ్వకపోవడమే కాకుండా బయట కూడా చేయొద్దని.. మృతదేహాన్ని అలాగే వదిలేయాలని హుకుం జారీ చేయడంతో కుటుంబ సభ్యులు వారి బాటలోనే నడిచారు. ఈ విషయాన్ని ఎస్ఐ రామమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అంత్యక్రియలు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు
సాక్షి, కర్నూలు : అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు. ఈ ఘటన బుధవారం కోవెలకుంట్ల మండలం జోళదరాశి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన కథనం మేరకు.. గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన వడ్డే వెంకటసుబ్బయ్య ఒకరికొకరు అప్పు ఇచ్చి పుచ్చుకునేవారు. అందులోభాగంగా వెంకటసుబ్బయ్య వద్ద వెంకటేశ్వర్లు రూ.100 అప్పు తీసుకున్నాడు. తిరిగివ్వమని వెంకటేశ్వర్లును పదేపదే కోరుతున్నా ఇప్పుడిస్తా, అప్పుడిస్తానంటూ కాలయాపన చేసేవాడు. బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటసుబ్బయ్యకు వెంకటేశ్వర్లు ఎదురుపడ్డాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించవా అంటూ వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పంచె ఊడిపోవడంతో అదనుగా భావించిన వెంకటసుబ్బయ్య మర్మాంగాన్ని కొరికేశాడు. స్థానికులు విడిపించి, తీవ్ర రక్తస్రావమైన వెంకటేశ్వర్లును హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. బాధితుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎన్ని ఆరోపణలు వచ్చినా..నిర్లక్ష్యపు రోగం
సాక్షి, నంద్యాల : నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యాధునిక పరికరాలు ఉన్నా..చికిత్స అందనంత దూరంలో ఉంటోంది. సరైన సమయానికి వైద్యులు రాక గర్భిణులు క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్ష కేంద్రం వద్ద రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫిజియోథెరపీ వార్డును మూసివేసి తలుపులు తెరవడం లేదు. నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ప్రతి రోజు 1200 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఆసుపత్రిలో మొత్తం 300 పడకలు ఉన్నాయి. ఇన్ పేషంట్లు పెరగటంతో 350 పడకలపై చికిత్స అందిస్తున్నారు. అత్యవసర కేసులు వస్తే అత్యాధునిక పరికరాలు లేవంటూ ఎక్కువగా కర్నూలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.1.8 కోట్లతో నూతనంగా 20 పడకల ఐసీయూ ఏర్పాటు చేశారు. ఐసీయూ ఏర్పాటు చేసినా అత్యవసర కేసులు మాత్రం కర్నూలుకు తరలించటం ఆనవాయితీగా వస్తోంది. రూ.6 కోట్లతో ఎమ్మారై స్కానింగ్ ఉన్నా.. బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మేల్, ఫిమేల్ వార్డుల్లో 60 మందికి ఒకే స్టాఫ్ నర్సు ఉండటంతో రోగులకు సరైన సమయంలో చికిత్స అందడంలేదు. గాలిలో దీపంలా మాతా శిశు సంరక్షణ మాతా శిశు మరణాలు తగ్గించడం కోసం మాతా శిశువైద్యశాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతిరోజు 10 నుంచి 12 ప్రసవాలు జరుగుతుంటాయి. వైద్యుల నిర్లక్ష్యంతో కొంత కాలంగా గర్భిణులు, శిశువులు మృత్యువాత పడుతున్నారు. కాన్పుకోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణుల పట్ల ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవరిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. జూన్ నెలలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సిబ్బంది తీరులో ఎటువంటి మార్పులేదు. నీటి కోసం ఇక్కట్లు.. ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులకు మొత్తం కలిపి దాదాపు 2 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 70 వేల లీటర్లు మాత్రమే ఆసుపత్రి వర్గాలు అందిస్తున్నాయి. ఆసుపత్రికి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మాణం కోసం మున్సిపాలిటీకి రూ.1.53 లక్షలు చెల్లించినా ఫలితం లేకుండా పోయింది. డయాలసిస్ రోగులకు చికిత్స కోసం ప్రతిరోజు 6 వేల లీటర్ల మినరల్ వాటర్ అవసరం. నీటి కొరత ఉండటంతో బయటి నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తూ రూ.3 వేలు ప్రతి రోజూ ఖర్చు చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు క్యూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పీపీ యూనిట్ వైద్యుల తీరుతో గర్భవతులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వచ్చే బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి గురువారం పరీక్షల కోసం గర్భిణులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం మూడు నెలల నుంచి ప్రదక్షిణలు చేస్తున్నా వైద్యులు పట్టించుకోవటం లేదని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నెలకు 70 నుంచి 80 కు.ని. ఆపరేషన్లు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో 20 ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది ఉదయం 9 గంటల నుంచి ఆసుపత్రిలోనే ఉన్నా. వైద్యుల కోసం గంటకుపైగా ఎదురుచూస్తున్నా రాలేదు. ప్రతి నెలా ఇలాగే ఉంది. నాతో పాటు 20 మంది గర్భిణులు వైద్యులకోసమే వేచి చూస్తున్నారు. వారు ఎప్పుడొస్తారాని సిబ్బందిని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. – హసీనా, అయ్యలూరు -
శిశువు ప్రాణం తీశారు
సాక్షి ,బొమ్మలసత్రం(కర్నూలు): నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన శిశువు ప్రాణం తీసింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన చెన్నమ్మకు నెలలు నిండటంతో భర్త దేవదాసు కాన్పు కోసం సోమవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆమెకు పరీక్షలు నిర్వహించి బిడ్డ ఆరోగ్యం బాగుందని రాత్రిలోగా కాన్పు చేస్తామని చెప్పారు. రాత్రంతా చూసినా పురిటి నొప్పులు రాలేదు. ఉదయం కాల కృత్యాలు తీర్చుకునేందుకు చెన్నమ్మ బాత్రూంకు వెళ్లగా అందులో నీరులేదు. దీంతో ఆమె మెట్లు దిగి కింద అవుట్ పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్‌కు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడే కాన్పు కావడంతో సిబ్బంది తల్లీబిడ్డను కాన్పుల వార్డుకు తరలించారు. అయితే, డ్యూటీలో ఉండాల్సిన వైద్యురాలు ముందుగానే ఇంటికి వెళ్లిపోయింది. దీంతో చికిత్స అందించే వారు ఎవరూ లేక ఉమ్ము నీరు తాగిన పసిబిడ్డ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. వైద్యులే మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని చెన్నమ్మ, దేవదాసు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాన్పు సమయంలో విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మూడేళ్ల క్రితం చెన్నమ్మ మొదటి కాన్పు కోసం 108లో వస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవమైంది. ఆసుపత్రికి బిడ్డను తీసుకునే వచ్చేలోగా మృతిచెందినట్లు ఆ దంపతులు గుర్తుచేసుకుని బోరున విలపించారు. వైద్యురాలిపై విచారణకు ఆదేశించాం డ్యూటీలో వైద్యురాలు లేక పోవటంతో బిడ్డ మృతి చెందినట్లు అందిన ఫిర్యాదు నేపథ్యంలో డాక్టర్‌పై విచారణకు ఆదేశించాం. వైద్యురాలు నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –విజయ్‌కుమార్, సూపరింటెండెంట్ -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్ పరిస్థితి విషమం
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో నంద్యాల జాతీయ రహదారిపై ఓ దాబా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు శనివారం అర్ధరాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన విష్ణుప్రియ, సునీల్, శివ, సంతోష్‌నగర్‌కు చెందిన రోహిత, ఉమేశ్, శివ, ఎల్బీనగర్కు చెందిన నరసింహా, నిజామాబాద్‌కు చెందిన అమర్‌లు గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురయిన బస్సుల్లో ఒకటి పుత్తూరు నుంచి హైదరాబాద్ వైపు, మరొకటి మెదక్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్నాయి. పుత్తూరు బస్సు డ్రైవర్ రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఆళ్లగడ్డ)