లావణ్య మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలోని బి.నాగిరెడ్డిపల్లెలో చోటుచేసుకున్న అనాగరిక చర్య మానవత్వాన్ని మంటగలిపింది. నిండుచూలాలు మృతిచెందగా.. ఆమె అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని చెప్పడంతో దిక్కుతోచని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసి వచ్చారు. స్థానికుల కథనం ప్రకారం.. బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తితో శిరివెళ్లకు చెందిన లావణ్య (20)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నిండు గర్భిణి అయిన లావణ్యను శుక్రవారం రాత్రి ప్రసవం నిమిత్తం శిరివెళ్ల నుంచి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డను ప్రసవించకుండానే మృతి చెందింది.
మృతదేహాన్ని శనివారం బి.నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చారు. అంత్యక్రియల నిమిత్తం ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భంలో శిశువు ఉండగా అంత్యక్రియలు చేస్తే అరిష్టమంటూ అడ్డుపడ్డారు. చేసేది లేక కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ ఆ మృతదేహాన్ని ఓ వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పనపల్లె సమీపంలోని పులిబోను వాగు ప్రాంతంలో ఓ చెట్టు మొదలు వద్ద మృతదేహాన్ని కూర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి వచ్చారు. ఆదివారం రుద్రవరం, గోనంపల్లె, అప్పనపల్లె గ్రామాల ప్రజలు పొలాల్లో పనుల నిమిత్తం వెళుతూ దారి పొడవునా పూలు చల్లి ఉండటాన్ని గుర్తించారు. మరికొందరు సాహసించి కాస్త ముందుకు వెళ్లడంతో మృతదేహం కన్పించింది. భయభ్రాంతులకు గురైన వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.
దుఖఃసాగరంలో బంధువులు: నిండు చూలాలు మృతి చెందడంతో ఇరు కుటుంబాల వారు శోకసంద్రంలో మునిగారు. అదే సమయంలో గ్రామస్తులు ఆచారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు అంటూ సూటిపోటి మాటలు వారిని మరింత కుంగదీశాయి. గ్రామంలో అంత్యక్రియలు చేయనివ్వకపోవడమే కాకుండా బయట కూడా చేయొద్దని.. మృతదేహాన్ని అలాగే వదిలేయాలని హుకుం జారీ చేయడంతో కుటుంబ సభ్యులు వారి బాటలోనే నడిచారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ రామమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అంత్యక్రియలు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment