rudravaram
-
భర్తతో దూరం.. వీఆర్వోతో మహిళకు పరిచయం.. ‘నేను మోసపోయానమ్మా’
సాక్షి, రుద్రవరం(కర్నూలు): అండగా ఉంటామని నమ్మించిన వారే మోసం చేయడంతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తన బిడ్డలను మంచిగా చదివించమని తల్లిదండ్రులకు లేఖ రాసింది. శుక్రవారం రుద్రవరంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు.. రుద్రవరానికి చెందిన లక్ష్మీ నరసమ్మ, తాటిరెడ్డి దంపతులు తమ కుమార్తె జయలక్ష్మీ దేవి(29)ని 12ఏళ్ల క్రితం ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన తువ్వపల్లె వెంకటాద్రికి ఇచ్చివివాహం చేశారు. తొమ్మిది ఏళ్ల పాటు వారి జీవనం అన్యోన్యంగా సాగింది. వారికి హర్షిత, నీరజ్ అనే ఇద్దరు సంతానం కలిగారు. కొన్నాళ్ల క్రితం ఆళ్లగడ్డలో వలంటీర్‌గా విధుల్లో చేరింది. ఈ తరుణంలో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తి వేరయ్యారు. వెంటనే జయలక్ష్మీదేవి తన కూమార్తెను ఆళ్లగడ్డ మండలంలోని ఓ వసతి గృహంలో చేర్పించి కుమారుడితో కలిసి పుట్టినిల్లు చేరుకుంది. అక్కడి నుంచే ఆళ్లగడ్డకు వెళ్లి వలంటీర్ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పట్టణంలోని ఓ గ్రామ సచివాలయంలో పని చేస్తున్న వీఆర్వోతో పరిచయం ఏర్పడింది. అతను పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. తర్వాత ఆ వీఆర్వోకు ఇదివరకే వివాహమైందని తెలియడంతో వెళ్లి నిలదీసింది. పెళ్లి చేసుకోనని అతడు చెప్పడంతో తీవ్రం మనస్థాపం చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలోలేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. వైద్య విద్యార్థిని అలా చేస్తూ.. బడికి వెళ్లిన కుమారుడు ఇంటికి వచ్చి చూడగా తల్లి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే విషయం అవ్వాతాతలకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి కూతురిని కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీనరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ నిరంజన్‌రెడ్డి వివరించారు. -
వేట.. పేలుతున్న తూటా
రుద్రవరం: అధికారుల కన్నుకప్పి కొందరు నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట సాగిస్తున్నారు. వన్యప్రాణుల మాంసానికి, చర్మానికి మంచి డిమాండు ఉండటంతో రహస్యంగా వేట కొనసాగిస్తున్నారు. కొందరు నాటు తుపాకులతో వేటాడుతుండగా, ఇంకొందరు ఉచ్చులు బిగించి వాటిలో చిక్కిన వన్యప్రాణులను హతమార్చి.. వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం, చెలిమ రేంజి పరిధిల్లో ఈ తతంగం సాగుతోంది. నేల రాలుతున్న జింకలు నంద్యాల డివిజన్లో రుద్రవరం, చెలిమ రేంజిలలో వేలాది హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఆయా గ్రామాల వారంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మరక్షణ నిమిత్తం కొందరు నాటు తుపాకులు, వేట కొడవళ్లు కలిగి ఉన్నారు. కాలక్రమేణా వాటిని జంతువులను వేటాడేందుకు వినియోగిస్తున్నారు. వీరు ఆయుధాలతో రహస్యంగా అడివిలోకి వెళ్లి వన్య ప్రాణులను ప్రధానంగా జింకలను హతమార్చుతున్నారు. మాంసాన్ని బయటకు తరలించి కిలో రూ.500 ప్రకారం విక్రయిస్తున్నా రని సమాచారం. నామమాత్రపు దాడులు వేటగాళ్ల చేతుల్లో జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే నామమాత్రపు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రుద్రవరం మండలం హరినగరం వద్ద బహిరంగంగా వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి నిందితులను వదిలిపెట్టి కేవలం మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఆపై అగ్నిలో కాల్చివేశారు. అదే గ్రామంలో ఓ నాటు తుపాకీ కూడా లభించింది. అయినప్పటికీ నిందితుడికి సరైన శిక్ష వేయించలేక పోయారు. అటవీ ప్రాంతంలో మరో నాటు తుపాకీ దొరికినట్లు చూపించారు. అలాగే ఇటీవలే గోస్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఇరువురు నిందితులు జింక మాంసంతో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు మెట్ట ఆల్ఫా కళాశాల సమీపంలో జింకను వేటాడినట్లు చెప్పారు. కొరవడిన సంరక్షణ వన్య ప్రాణులు అటవీ ప్రాంతంలో జీవించలేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆర్.నాగులవరం, చందలూరు, తువ్వపల్లె, టీ.లింగందిన్నె, పేరూరు, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె, ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె, నల్లగట్ల, కందుకూరు, చింతకొమ్మదిన్నె, మిట్టపల్లె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, బోదనం తదితర ప్రాంతాలలో జింకల సంచారం అధికంగా ఉంటోంది. అటువంటి ప్రదేశాల్లో అధికారుల నిఘా కొరవడటంతో వేట యథేచ్ఛగా సాగుతోంది. మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు వద్ద తెలుగు గంగ 28వ బ్లాక్ ఉప ప్రధాన కాల్వలో ఒకే ప్రదేశంలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందాయి. వాటి మృతికి కారణాలు ఇంత వరకు కనుగొన లేకపోయారు. మిట్టపల్లె, నల్లగట్ల ప్రాంతాల్లో జింకల కళేబరాలు లభించాయి. ఇలా విచ్చలవిడిగా వేట సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వన్య ప్రాణులు, అడవి జంతువుల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉండని సిబ్బంది నల్లమల అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన అటవీ అధికారులు అడవికి 20, 40 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డ, నంద్యాల వంటి పట్టణాల్లో నివాసాలు ఉంటున్నారు. పగటిపూట మాత్రం కార్యాలయాలు, ఠాణాల వద్ద అటుఇటు కలియతిరిగి వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో అటవీ సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణులను వేటాడితే జైలే వేట కారణంగా నేలకొరుగుతున్న వన్య ప్రాణులపై రుద్రవరం రేంజి అధికారి శ్రీపతి నాయుడును వివరణ కోరగా వన్య ప్రాణులను వేటాడితే జైలుశిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలతో అటవీ శాఖ అప్రమత్త మయ్యిందన్నారు. ఇందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు. అలాగే వేట సాగే పలు ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అలాగే గ్రామాల్లో వన్య ప్రాణులను వేటాడితే కేసులు, పడే శిక్షలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫారెస్టు గదులు సక్రమంగా లేకçపోవడం వల్లే సమీప పట్టణాల్లో సిబ్బంది నివాసముంటున్నారని తెలిపారు. -శ్రీపతి నాయుడు, రుద్రవరం రేంజి అధికారి -
గర్భిణి మృతదేహాన్ని చెట్టుకు కట్టి వదిలేశారు
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలోని బి.నాగిరెడ్డిపల్లెలో చోటుచేసుకున్న అనాగరిక చర్య మానవత్వాన్ని మంటగలిపింది. నిండుచూలాలు మృతిచెందగా.. ఆమె అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని చెప్పడంతో దిక్కుతోచని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసి వచ్చారు. స్థానికుల కథనం ప్రకారం.. బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తితో శిరివెళ్లకు చెందిన లావణ్య (20)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నిండు గర్భిణి అయిన లావణ్యను శుక్రవారం రాత్రి ప్రసవం నిమిత్తం శిరివెళ్ల నుంచి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డను ప్రసవించకుండానే మృతి చెందింది. మృతదేహాన్ని శనివారం బి.నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చారు. అంత్యక్రియల నిమిత్తం ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భంలో శిశువు ఉండగా అంత్యక్రియలు చేస్తే అరిష్టమంటూ అడ్డుపడ్డారు. చేసేది లేక కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ ఆ మృతదేహాన్ని ఓ వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పనపల్లె సమీపంలోని పులిబోను వాగు ప్రాంతంలో ఓ చెట్టు మొదలు వద్ద మృతదేహాన్ని కూర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి వచ్చారు. ఆదివారం రుద్రవరం, గోనంపల్లె, అప్పనపల్లె గ్రామాల ప్రజలు పొలాల్లో పనుల నిమిత్తం వెళుతూ దారి పొడవునా పూలు చల్లి ఉండటాన్ని గుర్తించారు. మరికొందరు సాహసించి కాస్త ముందుకు వెళ్లడంతో మృతదేహం కన్పించింది. భయభ్రాంతులకు గురైన వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. దుఖఃసాగరంలో బంధువులు: నిండు చూలాలు మృతి చెందడంతో ఇరు కుటుంబాల వారు శోకసంద్రంలో మునిగారు. అదే సమయంలో గ్రామస్తులు ఆచారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు అంటూ సూటిపోటి మాటలు వారిని మరింత కుంగదీశాయి. గ్రామంలో అంత్యక్రియలు చేయనివ్వకపోవడమే కాకుండా బయట కూడా చేయొద్దని.. మృతదేహాన్ని అలాగే వదిలేయాలని హుకుం జారీ చేయడంతో కుటుంబ సభ్యులు వారి బాటలోనే నడిచారు. ఈ విషయాన్ని ఎస్ఐ రామమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అంత్యక్రియలు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
అర్ధరాత్రి అదృశ్యమైన రుద్రవరం ఎస్ఐ
సాక్షి, ఆళ్లగడ్డ : రుద్రవరం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ విష్ణునారాయణ శనివారం అర్ధరాత్రి అదృశ్యమయ్యారు. తిరిగి ఆదివారం సాయంత్రం ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు ఎదుట హాజరయ్యారు. దీంతో జిల్లా పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కేసు విషయంలో ఎస్ఐ విష్ణునారాయణను, శిరివెళ్ల సీఐ విక్రమసింహను మూడు రోజుల క్రితం.. జిల్లా ఎస్పీ కర్నూలుకు పిలిపించారు. రెండు రోజులు కార్యాలయంలో ఉండాలని ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన ఎస్ఐ.. శనివారం రాత్రి రుద్రవరం చేరుకుని పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో ‘ ఈ మెస్సేజ్ చదివే సమయానికి నేను బతకవచ్చు.. లేక చనిపోవచ్చు.. దయచేసి నన్ను చెడుగా అనుకోవద్దు’అని మెస్సేజ్ పెట్టారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆళ్లగడ్డ డీఎస్పీని అప్రమత్తం చేయడంతో ఆయన, ఆళ్లగడ్డ సీఐ రమణ, శిరివెళ్ల సీఐ విక్రసింహ, అందుబాటులో ఉన్న ఎస్ఐలు రుద్రవరానికి వెళ్లి..ఎస్ఐ విష్ణునారాయణకు నచ్చజెప్పారు. ఆయనకు ముఖ్యుడైన మరో ఎస్ఐని అక్కడే ఉంచి వచ్చారు. అయితే రాత్రి ఇంటికి వెళ్లిన విష్ణు నారాయణ తన సరీ్వస్ రివాల్వర్‌తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు వారించారు. తెల్లవారు జామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. సెల్‌ఫోన్‌కూడా స్విచ్ఛాప్ కావడంతో ఆందోళన చెందారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకు పోవడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయానికి ఆయన నడుపుతున్న కారు చాగలమర్రి టోల్‌గేట్‌లోనుంచి కడప వైపు వెళ్లిందని సమాచారం వచ్చింది. అయినప్పటికీ ఎక్కడకు వెళ్లాడు.. ఏం చేసుకున్నాడో అని ఆందోళన చెందుతున్న సమయంలో ఆదివారం సాయంత్రం సెల్‌ఆన్ కావడంతో ఫోన్ చేసి మాట్లాడారు. మనసు బాగాలేక బ్రహ్మంగారి మఠం వెళ్లానని చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్పీ కార్యాలయం చేరుకున్న ఎస్ఐ విష్ణు నారాయణ మాట్లాడుతూ.. కుటుంబ సమస్యలు, పని ఒత్తిడిని తట్టుకోలేక మానసిక ప్రశాంతత కోసం తమ స్వగ్రామమైన వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం సంతకొవ్వూరుకు వెళ్లానని చెప్పారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జరిగిన విషయంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
టీడీపీ నేతకు భంగపాటు
సాక్షి, మచిలీపట్నం: గ్రామ వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రకు ఆశాభంగం ఎదురైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో ఆయనకు శనివారం చుక్కెదురైంది. గ్రామ వాలంటీర్లు దసరా మామూలు అడిగారని పెన్షనర్లతో చెప్పించేందుకు ప్రయత్నంచి భంగపడ్డారు. తన అనుచరులతో కలిసి రుద్రవరంలో పర్యటించిన ఆయన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కారు. దసరా మామూళ్ల కోసం పెన్షనర్లను వేధిస్తున్నారని నోటికి వచ్చినట్టు ఆరోపించారు. అయితే తమను ఎవరూ దసరా మామూలు అడగలేదని ఆయన ముఖంపైనే పెన్షనర్లు తెగేసి చెప్పడంతో కొల్లు రవీంద్ర ఖిన్నులయ్యారు. తమ కుటిలప్రయత్నం ఫలించకపోవటంతో ‘పచ్చ’ నాయకులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. మంత్రి పదవిలో ఉండగా కొల్లు రవీంద్ర ఒక్కసారి కూడా తమ ఊరి వంక చూడలేదని, ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లమని, వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికే పెన్షన్లు తెచ్చిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. -
దంపతుల బలవన్మరణం
యువతీ.. యువకుడు.. జీవితంపై ఎవరికి వారే కలలుగన్నారు. వారిద్దరినీ తల్లిదండ్రులు దాంపత్య జీవితంతో ఒక్కటి చేశారు. ఏడాదిన్నర కూడా కాలేదు. అంతలోనే అనుకోని వ్యాధి. వారి కలల సౌధాన్ని కూల్చేసింది. భర్త నుంచి భార్యకు వచ్చిందో.. భార్య నుంచి భర్తకు సోకిందో తెలియదు. ఇద్దరినీ కొంతకాలంగా నయం కాని వ్యాధి వెంటాడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా నయంకాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరూ బలవన్మరణం చెందారు. వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చి వెళ్లారు. సాక్షి, రుద్రవరం (కర్నూలు): మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగలక్షమ్మ కుమారుడు శ్రీనివాసులు(26)కు కోవెలకుంట్లకు చెందిన కుమ్మరి నాగయ్య, సుబ్బలక్షమ్మ కుమార్తె నాగజ్యోతి(22)కి గత ఏడాది మే 1న వివాహమైంది. శ్రీనివాసులు హైదరాబాదులో విద్య పూర్తి చేసి, అక్కడే గ్యాస్ గోడౌన్లో ప్రైవేట్ ఉద్యోగం వెతుక్కోవడంతో పెళ్లి అనంతరం భార్యను అక్కడికే తీసుకెళ్లాడు. భార్య, భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏడాది కూడా పూర్తిగాక ముందే ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. డాక్టర్లకు చూపించగా నయం కాని వ్యాధి సోకిందని నిర్ధారించారు. దీంతో హైదరాబాద్ నుంచి ఐదు నెలల క్రితం కోవెలకుంట్లకు చేరుకున్నారు. నంద్యాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించుకునేవారు. అయినా తగ్గకపోవడంతో సోమవారం సాయంత్రం కోవెలకుంట్ల నుంచి నక్కలదిన్నెకు చేరుకున్నారు. రాత్రి భోజనం అనంతరం శ్రీనివాసులు తల్లిదండ్రులకు శీతలపానీయం ఇచ్చారు. ఆతర్వాత భార్య, భర్త పురుగుల మందు కలిపిన శీతల పానీయం తాగారు. కొంతసేపటికి నాగజ్యోతి వాంతులు చేసుకుంటూ, కేకలు వేస్తూ బయటకు పరుగెత్తి అత్తమామలను లేపి విషం తాగిన విషయం చెప్పింది. వెంటనే ఆటోలో ఇద్దరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు 108 వాహనంలో తరలించారు. అక్కడ కోలుకోలేక మృతిచెందారు. నాగజ్యోతి తల్లి సుబ్బలక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విష్ణునారాయణ తెలిపారు. -
ఆ ఊరిలో ఒక్కడే మిగిలాడు
కళ్లెదుటే ఓ ఊరు మాయమవుతోంది. మొన్నటి వరకు జనంతో కళకళలాడిన గ్రామం నేడు శ్మశానాన్ని తలపిస్తోంది. భవిష్యత్‌లో ఇక్కడో గ్రామం ఉండేదని చెప్పుకోవడానికి ఇళ్లు శిథిలమై.. మొండిగోడలు మిగిలాయి. ఉపాధి కోసం ఒక్కో కుటుంబం గ్రామం విడిచిపోవడంతో ఊరంతా ఖాళీగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామం పేరు కనిపిస్తున్నా ఈ ఊరిలో మాత్రం జనం లేరు. ఈ పల్లె గురించి చెప్పడానికి 15 ఏళ్లుగా ఓ వ్యక్తి మాత్రం అక్కడ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ గ్రామం తెలుసుకోవాలంటే రుద్రవరం మండలం లాలాయిపేట వెళ్లాల్సిందే. సాక్షి, కర్నూలు : పూర్వం జీవనోపాధి కోసం భూములను సాగు చేసుకుంటూ పొలాల పక్కనే నివాసాలు ఏర్పర్చుకోవడంతో గ్రామాలు ఏర్పడ్డాయి. ఇదే కోవలోనే లాలయ్య అనే ఓ ముస్లిం వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలసి కొన్నేళ్ల క్రితం పొలాల మధ్య ఓ చిన్న గుడిసె వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న పొలంలో కొంత భాగం వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించాడు. ఆయనను చూసి మరికొందరు వలస వచ్చి అక్కడ నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయం చేశారు. అలా 25 కుటుంబాల వరకు పెరగడంతో ఆ ఊరికి లాలాయిపేట అని పేరు పెట్టారు. ఈ గ్రామాన్ని పక్కనే ఉన్న చిలకలూరు పంచాయతీకి మజరాగా నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ గ్రామస్తులకు అవసరమైన వసతులను అధికారులు కల్పించే వారు. ఇందులో భాగంగానే ముందుగా రోడ్డు వేశారు. గ్రామస్తులకు తాగు నీటి సౌకర్యం కింద ముందుగా బోరు వేసి చేతి పంపు అమర్చారు. అనంతరం మినీ వాటర్ ట్యాంకు ఏర్పాటు చేశారు. ఓ కాలనీలో సీసీరోడ్డు వేశారు. గ్రామస్తులు వ్వవసాయంలో మంచి పంటలు పండించుకుంటు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. తమ పిల్లలను మంచిగా చదివించుకున్నారు. పిల్లలు పెద్దవారై మంచిగా చదివి వివిద ఉద్యోగాలు పొందారు. అప్పటి నుంచి గ్రామంలో వలసలు మొదలయ్యాయి. సరైన వసతులు లేని ఆ గ్రామంలో ఎలా ఉండేదంటు వారు తమ తల్లిందడ్రులను పిలుచుకొని ఒక్కొక్కరుగా పట్టణాలకు వలసలుగా వెళ్లి స్థిర పడ్డారు. అలా మొత్తం కుటుంబాలన్నీ ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, కోవెలకుంట్ల, ప్రకాశం జిల్లాలకు వెళ్లి పోయాయి. పొలాలను సమీప గ్రామస్తులకు కౌలుకు ఇచ్చారు. గ్రామస్తులు అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లడంతో ఉన్న మిద్దెలు ఒక్కొటిగా కూలి పోయాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో పడి పోయిన మిద్దెలు దర్శన మిస్తున్నాయి. మౌన సాక్షిగా ఆనవాళ్లు.. లాలాయి పేట గ్రామం కనుమరుగవుతున్నా అక్కడ ఆనవాళ్లుగా కొన్ని మిగిలి ఉన్నాయి. ప్రదానంగా వ్యవసాయానికి సంబంధించిన తీపి గుర్తులు మౌనంగా పలకరిస్తున్నాయి. పంట నూర్పిడికి ఉపయోగించే రాతి గుండ్లు, ఎద్దులకు నీళ్లు తాపే గచ్చులు, చెట్టు కింద కట్టుకున్న రచ్చబండ, పూజించే నాగులకట్ట.. ఇలా ఎన్నో ఇప్పటకీ పదిలంగా ఉన్నాయి. ఊరంటే ఎంతో ఇష్టం నా కుటుంబీకులందరూ నంద్యా లలో ఉన్నారు. నేను మాత్రం పుట్టి పెరిగిన ఊరిపై మమకారం వదులుకొని పట్టణానికి వెళ్ల లేకపోతున్నా. నాకున్న 4 ఎకరాల పొలంలో పంటలు వేసుకుంటూ ఒక్కడినే ఇక్కడే ఉంటున్నా. పగలంతా చుట్టు పక్కల గ్రామాల రైతులు వ్యవసాయ పనులకు వచ్చి కాసేపు ఇక్కడ కూర్చోని మాట్లాడి వెళ్తుంటారు. రాత్రి అయితే ఒంటరిగానే ఉంటున్నా. చేతి పంపు ఉండటంతో నీటికి ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు నంద్యాలకు వెళ్లి కుటుంబీకులను పలకరించి, వచ్చే టప్పుడు వంటకు అవసరమైన సరుకులు తెచ్చుకుంటున్నాను. ఒకప్పుడు గ్రామంలో సందడిగా ఉండేది. నేడు శ్మశానంలా మారిపోయింది. – తిప్పారెడ్డి, గ్రామస్తుడు -
రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం వాసులు తిరుమల స్వామివారి దర్శనానికి జైలో వాహనంలో బయల్దేరారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఈ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రేణిగుంట అర్భన్ పోలీసులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కీచకోపాధ్యాయులు
రుద్రవరం(ఆళ్లగడ్డ) : ఉపాధ్యాయులు..సమాజ నిర్దేశకులు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత కల్గిన వారు. అలాంటి వారి నడవడిక ఎంతో ఉన్నతంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ కొందరు దారి తప్పుతున్నారు. తమ ‘స్థాయి’ మరచి ప్రవర్తిస్తున్నారు. తద్వారా అపవాదును మూటగట్టుకుంటున్నారు. రుద్రవరం మండలం ఎల్లావత్తుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో ఎస్జీటీగా పనిచేస్తున్న రామకృష్ణ అకృత్యాలు వెలుగు చూశాయి. బడిలోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా చిన్నారులతో వెకిలిచేష్టలు చేస్తుండడంతో అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మండల విద్యాధికారి సాహెబ్ హుస్సేన్ గురువారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారులు కన్నీటి పర్యంతమవుతూ టీచర్ వెకిలిచేష్టల గురించి వివరించారు. ‘టీచర్ తరగతి గదిలోకి వచ్చిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇక్కడికొస్తుంది. ఆమెతో కొంతసేపు మాట్లాడతాడు. తరువాత మమ్మల్ని బయట కూర్చోమని పెద్దగా చదవమంటాడు. తర్వాత వారిద్దరే గదిలో ఉంటారు. అంతేకాకుండా ఐదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. అవసరం లేకపోయినా దగ్గరకు తీసుకుని ఒళ్లంతా నిమరడం..అసభ్యకరంగా మాట్లాడడం చేస్తుంటాడు. ఈ విషయాలను బయటకు చెప్పామన్న కోపంతో మమ్మల్ని చితకబాదుతున్నాడ’టూ ఎంఈఓ ఎదుట వాపోయారు. కాగా.. టీచర్ రామకృష్ణ ప్రవర్తనపై సదరు పాఠశాల హెచ్ఎం కూడా విసుగు చెందారు. తనను హెచ్ఎం బాధ్యతల నుంచి తప్పించాలని ఎంఈఓకు లేఖ రాయడం గమనార్హం. అనారోగ్య కారణాలు చూపుతున్నప్పటికీ సదరు టీచర్ కారణంగా ఏదైనా ఘటన జరిగితే హెచ్ఎంగా తనకు అపవాదు వస్తుందనే ఉద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయం రికార్డు చేసుకున్నానని, రామకృష్ణను తక్షణమే సెలవుపై వెళ్లాలని ఆదేశించానని ఎంఈఓ చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపి.. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాయామ టీచర్‌పై పునః విచారణ రుద్రవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గతంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన చంద్రమోహన్‌పై డిప్యూటీ డీఈఓలు బ్రహ్మం, అరవిందమ్మ, రాజకుమారిలు గురువారం పునః విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రమోహన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, కొందరిపై లైంగిక వేధింపులు.. ఇతర ఆరోపణలు రావడంతో ఇక్కడి నుంచి బదిలీపై పంపారన్నారు. గతంలో విచారణ జరిపినప్పటికీ సంతృప్తికరంగా లేకపోవడంతో డీఈఓ ఆదేశాల మేరకు మళ్లీ విచారణ చేస్తున్నామన్నారు. గతంలో పనిచేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి.. లిఖిత పూర్వకంగా రాయించుకున్నట్లు తెలిపారు. ఈ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. గతంలో చంద్రమోహన్ అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇతరులకు చూపడంతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థిని అత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. -
రుద్రవరం రేంజ్లో పెద్దపులులు
–నంద్యాల డివిజన్లో 12 పులుల గుర్తింపు –పులుల గుర్తింపుకు రుద్రవరం, చెలిమ రేంజిల్లో సిసి కెమెరాలు ఏర్పాటు రుద్రవరంం: రుద్రవరం అటవీ సబ్‌డివిజన్ పరిధిలో పెద్దపులులు సంచరిస్తున్నాయి. ఇప్పటి వరకు బడిఆత్మకూరు, నంద్యాల, గుండ్ల బ్రమ్మేశ్వరం రేంజ్‌ల పరిధిలోని బైరేని, బండి ఆత్మకూరు, గుండ్ల బ్రమ్మేశ్వరం, గడి గుండం, పున్నాగి కుంట, ఓంకారం, రామన్న పెంట ప్రాంతాల్లోనే అవి ఉండేవి. దీంతో ఆయా ప్రాంతాల పరిధిలోని అడవిలోనికి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసకుంటునా్నరు. అయితే, ఈ మధ్యకాలంలో రుద్రవరం, చెలిమ రేంజ్‌లలో పెద్ద పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. దీంతో ఆ రేంజ్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఊహించనట్టుగానే చెలిమ బీటులో పెద్ద పులి కెమెరా కంటపడింది. రుద్రవరం రేంజ్ పరిధిలోని ఊట్ల, గారెల్ల ప్రాంతంలో పెద్ద పులుల అడుగులు గుర్తించినట్లు రేంజర్ రామ్ సింగ్ వెల్లడించారు. మొత్తం ఇక్కడ ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించేందుకు మరిన్ని సీసీ కెమెరాలు కావాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పెద్ద పులుల సంచారంతో వెదురు సేకరణ నిలిపివేత చెలిమ, రుద్రవరం రేంజ్‌ల పరిధిలో పెద్దపులి సంచారంతో నాలుగు కూపుల్లో వెదురు సేకరణను అటవీ అధికారులు నిలిపి వేశారు. చెలిమ రేంజ్లో దొంగ బావి, బసువాపురం కూపులను నిలిపి వేయగా రుద్రవరం రేంజ్ పరిధిలోని ఊట్ల, గారెల్ల ప్రాంతాల్లో పెద్ద పులుల అడుగులు పడటంతో అక్కడ కూడా వెదురు సేకరణను నిలిపి వేశారు. ఈ విషయాన్ని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు గమనించి వాటి మనుగడకు భంగం కలగకుండా సహకరించాలని డీఎఫ్ఓ శివప్రసాదు కోరారు.నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 12 పెద్దపులులను గుర్తించినట్లు తెలిపారు. -
రూ. 20 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరంలో పోలీసులు, అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. మండలంలోని పెద్దకంబలూరు, శ్రీరంగాపురం, నర్సాపురం గ్రామాలకు చెందిన 13 మంది సమీపంలోని అడవి నుంచి ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం వెయ్యి టన్నుల బరువున్న45 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుండగుల ప్రధాన సూత్రధారిగా శ్రీరంగాపురం గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అని పోలీసులు చెప్పారు. పట్టుబడిన దుంగల విలవు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. -
20 బ్లాక్ చానల్‌కు గండి
–నీట మునిగిన పంటలు రుద్రవరం : మండల కేంద్రం సమీపంలోని తెలుగుగంగ 20 బ్లాక్ చానల్ కట్ట మంగళవారం తెల్లవారుజామున కోతకు గురై గండిపడింది. కాల్వ నీటికి తోడు వర్షంతో నిండిన రంగారెడ్డి చెరువు అలుగు నీరు తోడు కావడంతో గ్రామ సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. 20 ఎకరాలకు పైగా వరినాట్లు నీటిలో మునిగి పోయాయి. ఎకరానికి రూ.10 వేలు పెట్టబడి పెట్టామని, మరో రెండు రోజులు నీరు నిల్వ ఉంటే నాట్లు కుల్లిపోతాయని రైతులు ప్రహ్లాదుడు, నరసింహ, ఉస్సేనీ, జాకీర్లతోపాటు పలువురు వాపోయారు. -
విషజ్వరంతో మహిళ మృతి
రుద్రవరం(రెడ్డిగూడెం) : గ్రామానికి చెందిన వెలగలేని రుక్మిణీతాయారు(60) విష జ్వరం బారిన పడి మృతి చెందింది. ఆమె మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గ్రామంలో మరికొంతమంది జ్వరంతో బాధపడుతున్నారు. రుక్మిణీ మృతితో గ్రామాల్లోని జ్వర పీడితులు భయాందోళనకు గురవుతున్నారు. -
ఎర్రచందనం డంప్ స్వాధీనం
రుద్రవరం: రుద్రవరం అటవీ ప్రాంతంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వ పైభాగాన అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 63 ఎర్రచందనం దుంగలు.. తొమ్మిది సైకిళ్లను గురువారం రాత్రి రుద్రవరం ఎస్ఐ హనుమంతయ్య స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోటికి పైమాటేనని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్ఐతో పాటు సిబ్బంది గురువారం అడవిలో విస్తత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రచందనం డంప్‌తో పాటు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగల సరఫరా వెనుక బలమైన ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో స్మగ్లర్లు ఆహారం తయారీకి వినియోగించిన వంట పాత్రలు, కూరగాయాలు, బియ్యం పప్పుదిసుసులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు దుంగల తూకానికి వినియోగించే వేయింగ్ మిషన్ కూడా ఉన్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో వర్షాల కారణంగా వాహనాలు దుంగలను నిల్వ చేసిన ప్రదేశానికి వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా 10 నుంచి 15 రోజులుగా డంప్‌ను అక్కడే ఉంచినట్లుగా భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను సైకిళ్ల సహాయంతో దిగుమతి చేసుకొని రుద్రవరం అటవీ ప్రాంతంలోని ఉల్లెడ మల్లేశ్వర స్వామి ఆలయం మీదుగా ఎంపిక చేసిన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ భూపాల్ రెడ్డి, పోలీసులు శాంతిరెడ్డి, మస్తాన్, రమేష్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఎస్ఐ హనుమంతయ్య విలేకరులతో మాట్లాడుతూ దుంగలను స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని.. అయితే ఇవి ఎర్రచందనమా కాదా అనే విషయం ఫారెస్టు అధికారుల తనిఖీ అనంతరం వెల్లడిస్తామన్నారు. -
బైక్‌ను ఢీకొన్న బస్సు : భర్త మృతి, భార్యకు గాయాలు
కర్నూలు : కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం వద్ద గురువారం బైక్‌పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా... అతడి భార్య తీవ్రంగా గాయపడ్డింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణావర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.7.17 కోట్లు
ఆరు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి తొలుత అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కృష్ణా వర్సిటీ వీసీ పున్నం వెంకయ్య వెల్లడి మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీకి సొంత భవనాల నిర్మాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య వున్నం వెంకయ్య తెలిపారు. యూనివర్సిటీలోని వీసీ చాంబరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇం దుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బందరు మండలం రుద్రవరం పంచాయతీ పరిధిలోని కోన రోడ్డు వెంబడి 102.86 ఎకరాలను గతంలో ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందని చెప్పారు. ఈ భూమిలో రూ.72 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. భవనాల నిర్మాణ పనులను సీపీడబ్ల్యూడీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్, ఈఈ నాగేశ్వరరావులకు మొదటి విడతగా రూ.7.17 కోట్ల చెక్కును ఈ సందర్భంగా వీసీ అందజేశారు. 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ భవనం అకడమిక్ భవనాన్ని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అంచనాలు రూపొందించామని వీసీ తెలిపారు. మొదటి విడతలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని మొదటి విడతలో 85 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు వివరించారు. జీ+2 పద్ధతిలో ఈ భవనాలు నిర్మించాలని నమూనాలు తయారు చేశారని, అయితే మొదటి విడతలో మాత్రం జీ+1 పద్ధతిలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. నిధుల వెసులుబాటును బట్టి మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండంతో రోడ్డుకు మూడున్నర అడుగుల ఎత్తులో మెరక చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ భూముల్లో పటిష్టమైన నిర్మాణాల కోసం 70 అడుగుల లోతుకు వెళ్లి భూ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు భూమిపై శ్లాబు వేసి, దానిపై భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను హైదరాబాదుకు చెందిన జేఎన్టీయూ సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. రూ.72 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం చేపడతామని, రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కాన్పూర్ యూనివర్సిటీ తరహాలో ఇక్కడ భవనాల నిర్మాణం జరుగుతుందని, 100 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవన నిర్మాణం కోసం మొదటి విడతగా సీపీడబ్ల్యూడీపీకి 10శాతం నిధులను సమకూర్చాల్సి ఉన్న నేపథ్యంలో మొదటి విడతగా రూ. 7.17 కోట్లను ఇంజినీరింగ్ అధికారులకు అందజేసినట్లు వీసీ వివరించారు. నగదు అందజేసిన అనంతరం టెండర్ల ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుందని, డిసెంబరు లేదా జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సీపీడబ్ల్యూడీ ఎస్ఈ ఈఎం గామిట్ మాట్లాడుతూ పనులు ప్రారంభించిన 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను డీడీ రూపంలో అందజేసేందుకు జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, సిబ్బంది తమకు సహకరించారని తెలిపారు. పబ్లిక్ లెక్చర్ సిరీస్ కృష్ణా యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ లెక్చర్ సిరీస్‌ను నవంబరులో నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. నవంబరులో నిర్వహించే 3వ పబ్లిక్ లెక్చర్ కార్యక్రమానికి కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఫర్ ఆసియా డెరైక్టర్ డాక్టర్ సంజయ్‌మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేస్తారని వీసీ తెలిపారు. నాలుగో లెక్చర్‌కు నాక్ మాజీ చైర్మన్ రామ్తక్వాలే ముఖ్య అతిథిగా హాజరై దేశంలోని ఉన్నత విద్య విధానంపై ఉపన్యసిస్తారని చెప్పారు. కృష్ణా యూనివర్సిటీ నవంబరు మొదటి వారంలో స్మారక ఉపన్యాసం జరుగుతుందని రఘుపతి వెంకటరత్నం నాయుడు పేరున ఈ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా తరంగ్-2014 యువజనోత్సవాలను నవంబరులోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఆన్లైన్ పరీక్షా విధానం అమలు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామని వీసీ చెప్పారు. పరీక్షా కేంద్రానికి 40 నిమిషాల ముందు ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్లో పంపుతామని, ఈ ప్రశ్నాపత్రాన్ని తెలుసుకునేందుకు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎం.టెక్ కోర్సు ప్రారంభం కృష్ణా వర్సిటీలో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును ప్రారంభించినట్లు వీసీ చెప్పారు. పీజీ ఇంజినీరింగ్ కామెన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు పాల్గొన్నారు. -
అధికారులపై తెలుగు తమ్ముళ్ల పెత్తనం
రుద్రవరం: తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. చట్టబద్ద కార్యకలాపాలకు అడ్డుతగులుతూ..తాము చెప్పిందే వేదమంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధికారం ఉందనే అండతో ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయించడంతో మనస్తాపానికి గురైన రుద్రవరం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తాళలేక మండల పరిషత్ అభివృద్ధిఅధికారిణి విజయలక్ష్మి, ఈఓపీఆర్డీ దస్తగిరి, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అనీఫ్తో పాటు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బది ముక్కుమ్మడిగా సెలవు పెట్టి స్థానిక కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మండలంలో విధులు నిర్వహిస్తుండగా అధికార పార్టీ నాయకుడు భాస్కర్‌రెడ్డితోపాటు అయన అనుచరులు తమపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధులకు అడ్డం తగులుతూ మాటవినకపోతే బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు పోలీసులను కోరారు.విషయం తెలుసుకున్న ఎస్ఐ హరినాధరెడ్డి, సిబ్బందితో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీఓ విజయలక్ష్మితో చర్చించారు. ఉద్యోగుల ఆందోళనపై ఎస్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. అధికార పార్టీ నేతల వ్యవహారంపై శనివారం కలెక్టర్ విజయ మోహన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం.. కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు కూడా ఉద్యోగులకు బాసటగా నిలిచారు. -
కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
రుద్రవరం: ఆరోగ్యశ్రీ కార్డులేని వారికి కూడా ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని మారుమూల ప్రాంతా ల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 938 రకాల జబ్బులకు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తో పాటు గౌరి గోపాల్, శాంతిరామ్, క్యూర్, మెడికేర్ ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొని పరీక్షలు నిర్వహించారన్నారు. గతంలో ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించే వారని ప్రసుత్తం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీకి అర్హులన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలు కూడా సంబంధిత తహశీల్దార్‌తో ధ్రువపత్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో రోగి వివరాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి సీఎంసీఓసెంటర్‌కు అందంజేస్తే వారికీ ఆరోగ్య శ్రీ పథకం వర్థిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 8333814116, 8333814117 నంబర్లకు పోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. వైద్యశిబిరం విజయవంతం మండలంలోని ఎల్లావత్తుల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరం విజయవంతం అయింది. డాక్టర్లు రామశర్మ, స్వాతి(శాంతిరామ్ ఆసుపత్రి), వరకుమార్ రెడ్డి(మెడికేర్), త్రినాథ్(గౌరిగోపాల్), మైత్రీ(కర్నూలు ప్రభుత్వాస్పత్రి), డేవిడ్ రాజు(క్యూర్ ఆస్పత్రి)తోపాటు ఆయా ఆసుపత్రిలకు చెందిన వైద్య సిబ్బంది 844 మంది రోగులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. 20 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. శిబిరంలో రుద్రవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి శ్రీమంత్, సిబ్బంది, ఆరోగ్య మిత్ర సభ్యులు విజయ్, మోష పాల్గొన్నారు. -
బియాస్ నదిలో గల్లంతైన ప్రహ్లాదుడు మృతి
రుద్రవరం: ఒక్కగానొక్క కుమారుడు నదిలో గల్లంతయ్యాడని తెలిసి ఆ వృద్ధ తల్లిదండ్రుల గుండె పగిలింది. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడం రోజురోజుకూ కుంగదీసింది. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడనే ఆశ.. ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకంతో ఎదురుచూస్తున్న వారికి చేదు వార్త అందనే అందింది. ఏదైతే జరగకూడదని అనుకున్నారో ఆ ఘోరం చెవినపడింది. చేతికందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి మండల పరిధిలోని ఆలమూరుకు చెందిన ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొర్రె పెద్దనాగిశెట్టి, లక్ష్మీనర్సమ్మలకు ఇరువురు కుమార్తెలు, కుమారుడు ప్రహ్లాదుడు(24) సంతానం. ఇతను గత నెల 5న హిమాచల్‌ప్రదేశ్‌లోని దండి జిల్లాలో ఉన్న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రకు వరుసకు మామ అయిన మురళి టూర్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. అక్కడ ఓ చిరుద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరగా ఉండాలని వెళ్లిన ప్రహ్లాదుడుని ఆయన తన వెంటతీసుకెళ్లాడు. నది వద్ద విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా సమీపంలోని లార్జి డ్యాం నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో వారిని అప్రమత్తం చేయబోయి ప్రహ్లాదుడు కూడా కొట్టుకుపోయాడు. గాలింపు చర్యల్లో భాగంగా బియాస్ నదిలో అతని మృతదేహం లభించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని రుద్రవరం తహశీల్దార్ వెంకటేశ్వర్లు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రహ్లాదుడు చిరుద్యోగం చూసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లి మృత్యువాత పడిన ఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదం నింపింది. ఇప్పటికే అనారోగ్యంతో మంచంపట్టిన మృతుని తల్లిదండ్రులు ఈ విషాద వార్తతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం బుధవారం ఉదయం గ్రామానికి చెరనుండటంతో కడసారి చూపునకు వారు గుండెలు చిక్కబట్టుకుని ఎదురుచూస్తున్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా
రుద్రవరం: ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా ఉంచామని, ఇప్పటికే నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 35 మందిని గుర్తించినట్లు జిల్లా స్క్వాడ్, నంద్యాల డివిజన్ ఇన్చార్జ్ ఫారెస్టు అధికారి చంద్రశేఖర్ తెలిపారు. గుర్తించిన వారిలో 10 మందిపై పీడీయాక్ట్ నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. బుధవారం ఆయన అహోబిలం అటవీ సెక్షన్‌లోని బోరింగ్ రస్తా, ఊట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేష్ క్యాంపులతో పాటు అహోబిలం పారెస్టు కార్యాలయం, నర్సాపురం చెక్ పోస్టును తనిఖీచేశారు. తర్వాత రుద్రవరం అటవీ కార్యాలయం అవరణలోని నర్సరీని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల డి. వనిపెంట సెక్షన్‌లోని ముత్యాల పాడు గ్రామానికి చెందిన స్మగ్లర్ మస్తాన్ వలిని పీడీయాక్ట్ కింద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. జిల్లాలో పారెస్టుకు సంబంధించి 1500 కేసులు నమోదు కాగా వాటిలో ఎర్రచందనం కేసులు 500 ఉన్నాయన్నారు. ఈ కేసుల్లో నిందితులైన 453 మందిని ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. అటవీ సంపదను కాపాడుకునేందుకు నంద్యాల డివిజన్ పరిధిలోని బండిఆత్మకూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం, నంద్యాల, చెలిమ, రుద్రవరం ఫారెస్ట్ రేంజ్‌లలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. నల్లమల అటవీలో 12 పులులను గుర్తించామని చెప్పారు. బేష్ క్యాంపుల్లో సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించక పోతే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట రేంజ్ అధికారి రామ్సింగ్తో పాటు అటవీ అధికారులు ఉన్నారు. -
ఆల్‌ఫ్రీ బాబును నమ్మొద్దు: శోభా
రుద్రవరం, న్యూస్‌లైన్: అధికార దాహంతో టీడీపీ అధినేత నారాచంద్రబాబు ఉచిత హామీలు ఇస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె మండలంలోని కోటకొండ, ఎల్లావత్తుల, చిన్నకంబలూరు, చిత్తరేణిపల్లె, ఆలమూరు, నర్సాపురం గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ అభ్యర్థులతోపాటు జెడ్పీటీసీ అభ్యర్థిని జంగా నారాయణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్టీలను పెంచి ప్రజలను ఇబ్బందులు గురిచేసిన సమయంలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకించారన్నారు. అప్పుడే తమపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దుతు ఇచ్చి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు టీడీపీలోకి విలీనం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 130 నుంచి 140 సీట్లు వస్తాయని ప్రతి సర్వే చెబుతోందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. చాలా గ్రామాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను వదిలి తమ పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోపాటు తమ పార్టీ అధినేత ప్రకటిస్తున్న హామీలను అమలు చేస్తామని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రచారంలో ఎమ్మెల్యే తనయుడు విఖ్యాత రెడ్డి, కుమార్తె మౌనిక పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, ఎల్ వి రంగనాయకులు, ఎర్రం ప్రతాపరెడ్డి, పత్తి సత్యనారాయణ, జంగా పెద్ద పుల్లారెడ్డి, లక్ష్మీకాంత్ యాదవ్, బండారు చిన్నదస్తగిరి, కుళ్లాయిరెడ్డి, వీరారెడ్డి, ఎర్రం వీర శేఖర్ రెడ్డి, హనుమంత రెడ్డి, నరసింహుడు, బండారు బాలరాజు, మజ్జిగ చంద్ర, చిన్నిక్రిష్ణ, బ్రహ్మానందరెడ్డి, జంగిటి సత్యంరాజు, సంజీవరాయుడు, శ్రీను, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
కుక్కలొచ్చాయి జాగ్రత్త!
రుద్రవరం, న్యూస్‌లైన్: నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. దీంతో స్మగ్లర్లలో వణుకు పుడుతోంది. రుద్రవరం రేంజ్ పరిధిలోని ఆర్. నాగులవరం, రుద్రవరం తదితర గ్రామాల్లో ఎర్రచందనం స్మగర్లు దుంగలను నిల్వ ఉంచి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం అటవీ అధికారి రాంసింగ్, పోలీసు అధికారి శ్రీకాంతరెడ్డి డాగ్ స్క్వాడ్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాంసింగ్ మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని చాలా గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టగలిగామన్నారు. ఆర్ నాగులవరం, టి లింగందిన్నె, తిప్పారెడ్డి పల్లె గ్రామాల్లో స్మగర్లు ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని అక్రమ రవాణాను అడ్డు కోవడానికి పోలీసుల సహకారం కోసం జిల్లా ఎస్పీ రఘురామి రెడ్డిని కోరామన్నారు. స్పందించిన ఆయన జిల్లా పోలీసు అధికారి పోలీసు బలగాలతోపాటు డాగ్ స్క్వాడ్‌ను పంపించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరొందిన ఆర్. నాగులవరం గ్రామాన్ని మొదట ఎన్నుకుని దాడులు నిర్వహించామన్నారు. అలాగే రుద్రవరం గ్రామంలోని బెస్తకాలనీలో సోదాలు నిర్వహించామన్నారు. ఇప్పటి నుంచి డాగ్ స్క్వాడ్ సిబ్బంది రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయంలో ఉంటుందని రాత్రి సమయంలో దాడులు చేస్తామన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారి జాకీర్ ఉశేన్, బీటు అధికారి రామకృష్ణలతోపాటు డాగ్ స్క్వాడ్, పోలీసు, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.