రుద్రవరం, న్యూస్‌లైన్: అధికార దాహంతో టీడీపీ అధినేత నారాచంద్రబాబు ఉచిత హామీలు ఇస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె మండలంలోని కోటకొండ, ఎల్లావత్తుల, చిన్నకంబలూరు, చిత్తరేణిపల్లె, ఆలమూరు, నర్సాపురం గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ అభ్యర్థులతోపాటు జెడ్పీటీసీ అభ్యర్థిని జంగా నారాయణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్టీలను పెంచి ప్రజలను ఇబ్బందులు గురిచేసిన సమయంలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకించారన్నారు. అప్పుడే తమపార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దుతు ఇచ్చి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు టీడీపీలోకి విలీనం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 130 నుంచి 140 సీట్లు వస్తాయని ప్రతి సర్వే చెబుతోందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు.
చాలా గ్రామాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను వదిలి తమ పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోపాటు తమ పార్టీ అధినేత ప్రకటిస్తున్న హామీలను అమలు చేస్తామని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రచారంలో ఎమ్మెల్యే తనయుడు విఖ్యాత రెడ్డి, కుమార్తె మౌనిక పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, ఎల్ వి రంగనాయకులు, ఎర్రం ప్రతాపరెడ్డి, పత్తి సత్యనారాయణ, జంగా పెద్ద పుల్లారెడ్డి, లక్ష్మీకాంత్ యాదవ్, బండారు చిన్నదస్తగిరి, కుళ్లాయిరెడ్డి, వీరారెడ్డి, ఎర్రం వీర శేఖర్ రెడ్డి, హనుమంత రెడ్డి, నరసింహుడు, బండారు బాలరాజు, మజ్జిగ చంద్ర, చిన్నిక్రిష్ణ, బ్రహ్మానందరెడ్డి, జంగిటి సత్యంరాజు, సంజీవరాయుడు, శ్రీను, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఆల్‌ఫ్రీ బాబును నమ్మొద్దు: శోభా
Published Sun, Mar 30 2014 1:34 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement