‘తోట’కు..ముళ్లబాట
ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. మూడేళ్లు మంత్రి పదవిని వెలగబెట్టినా జిల్లాలో చెప్పుకోడానికి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ చేపట్టలేదు. పైగా మంత్రిగా ఉన్న సమయంలో చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలు.. ఇలాంటి నేపథ్యమున్న తోట నరసింహానికి అధిష్టానం పిలిచి పీట వేసినా.. తాము మాత్రం సహకరించేది లేదంటూ తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు.
- మాజీ మంత్రిని వెంటాడుతున్న ఓటమి భయం
- ఆయనొస్తే పడే ఓట్లూ పడవేమోనని భయం
- ముఖం చాటేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు
- సహాయ నిరాకరణ చేస్తున్న టీడీపీ క్యాడర్
- మామ మెట్ల, కుటుంబ సభ్యులతోనే ప్రచారం
సాక్షి, కాకినాడ : కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని వెలగబెట్టి, ఎన్నికల ముందు తెలుగుదేశంలోకి ఫిరాయించి, కాకినాడ ఎంపీ టిక్కెట్‌ను దక్కించు కున్న తోట నరసింహానికి ‘దేశం’ శ్రేణులు ఏ మాత్రం కలిసి రావడం లేదు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబీ ్లసెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల నుంచే పూర్తిస్థాయి సహకారం లభించడం లేదు. అవకాశవాదంతో వలసవచ్చిన నేతకు సహకరించేది లేదంటూ తెగేసి చెబుతుండడంతో నరసింహం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఉద్యోగం చేసుకుంటున్న నరసింహం.. అన్న మరణంతో ఆయన వారసునిగా రాజకీయ రంగంలోకి వచ్చారు. వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావమూ చూపలేని ఆయన 2004, 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ అకాల మరణం తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ మంత్రి పదవి పొందిన తోట.. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి గానీ, మంత్రిగా జిల్లాకు గానీ ఒరగబెట్టిందేమీ లేదన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దీనికి తోడు మంత్రిగా అవినీతి ఆర్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలకూ కొరత లేదు. అప్పట్లో ‘చంద్రబాబు అవినీతి సమ్రాట్’ అంటూ నరసింహం నిప్పులు చెరిగితే నరసింహం అవినీతిపై టీడీపీ నేతలు దుమ్మెత్తి పోసేవారు. ఆరునూరైనా కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రగల్భాలు పలికిన నరసింహం ఇప్పుడు రాజకీయపబ్బం గడుపుకొనేందుకు మామగారైన డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు రాయబారంతో టీడీపీ పంచన చేరారు. కాకినాడ ఎంపీ టిక్కెట్టునూ దక్కించుకున్నారు. అయితే ఆయనకు కలసిరాని టీడీపీ శ్రేణులు చుక్కలు చూపిస్తున్నాయి.
తలకిందులైనా.. ఓటమి తథ్యం
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అభ్యర్థి కూడా నరసింహం కోసం పనిచేయడం లేదు. తమ పరిస్థితే అంతంతమాత్రంగా ఉండగా, నరసింహంను వెంటబెట్టుకొని వెళ్తే ఆ పడే నాలుగు ఓట్లు కూడా పడవేమోననే భయం వారిని వెన్నాడుతోంది. దాంతో వారు తోటకు దూరంగానే ప్రచారం సాగిస్తున్నారు. దీంతో తోటకు విధిలేక మామ మెట్లతో పాటు కుటుంబ సభ్యులతోనే ప్రచారం చేసుకుంటున్నారు. తోట ఓటమి తప్పదన్న సంకేతాలు ఇప్పటికే స్పష్టమైనా పిల్లనిచ్చిన మామగా మెట్ల తన సొంత నియోజకవర్గంలో పార్టీని గాలికొదిలేసి కుటుంబ సమేతంగా అల్లుడి ప్రచారం సాగిస్తూ చెమటోడుస్తున్నారు. పార్టీ శ్రేణులు కలిసి రాకున్నా.. రకరకాల ఎరలు, ప్రలోభాలతో ఓట్లు రాబట్టాలని తోట వ్యూహరచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా ప్రచారం ముగిశాక మొదలయ్యేప్రలోభాలకు ఆయన వారం రోజుల ముందే తెరతీసినట్టు సమాచారం. అయితే ఆయన ఎన్ని పాట్లు పడినా ఓటమి తప్పదని ఆ పార్టీ శ్రేణులే తేల్చి చెబుతున్నారు. తోట గెలుపుపై పందాలు కాసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.