సోనియాను దేశం నుంచి తరిమేయాలి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు
చీపురుపల్లి/సాలూరు/కురుపాం, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలుగుజాతిపై కక్షగట్టారని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఎన్నికల ప్రచారం లో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, సాలూరు, కురుపాం, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, పాలకొండ, ఆమదాలవలస బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సోనియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కొడుకును ప్రధాని చేసేందుకే సోనియా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. ఆమెను దేశం నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.. క్విట్ సోనియా’’ అంటూ హెచ్చరించారు. రాష్ట్ర విభజన బిల్లును యుద్ధ విమానంలో ఆగమేఘాలపై పంపారని, సీమాంధ్రలో యుద్ధం చేయడానికే అలా పంపారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ కుంభకోణాలేనని, పేదలకు చేసేందేమి లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ జీవితంలో ఎన్నడూ ప్రధాని కాలేడని జోస్యం చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. బొత్స సత్యనారాయణ సోనియాకు పెంపుడు కుక్కలా తయారయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి తనతోనే ప్రారంభమైందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి తనకు గొప్పకాదని, ఢిల్లీ వెళితే మోడీ పక్కన పెద్ద పదవి తనకు వస్తుందన్నారు.
దిగ్విజయ్‌సింగ్‌కు సిగ్గులేకే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాడని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ తప్ప మిగతా ప్రజలు చాలా మంచి వారని, అందుకే ప్రాంతానికీ న్యాయం చేయాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మద్యం బెల్టు దుకాణాలు రద్దు చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.