సూట్‌కేసులతో వెళ్లినవారికే సీట్లు
బాబుపై చిరంజీవి ధ్వజం
విజయవాడ: రాత్రిపూట సూట్‌కేసులతో వెళ్లిన వారికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీట్లు కేటాయించారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్, కేంద్రమంత్రి చిరంజీవి విమర్శిం చారు. ఈమాట తాను చెప్పడం లేదని.. మల్కాజ్‌గిరి సీటును మల్లారెడ్డికి కేటాయించడంపై టీడీపీనేత రేవంత్‌రెడ్డే స్వయంగా ఆరోపించారని గుర్తుచేశారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు కోటీశ్వరులను భుజాన మోస్తున్నారని, కార్పొరేట్ ఏజెంట్ల ద్వారా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా సీట్లు కేటాయిస్తామని చెప్పిన బాబు ఒక్కరికైనా ఆ పద్ధతిలో సీటిచ్చారా అని నిలదీ శారు. చంద్రబాబు తాను నిర్వహించిన ‘గర్జన’ల్లో గర్జించిందేమీలేదని, మహిళాగర్జన, యువగర్జనల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.
ఆలీబాబా నలభై దొంగలని, తాను అధికారంలోకి వస్తే కటకటాల వెనక్కి పంపుతానని జేసీ దివాకర్‌రెడ్డి, శిల్పా మోహనరెడ్డి, తిరుపతి వెంకటరమణలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారని, ప్రస్తుతం వీరందరికీ పచ్చ కండువాలు కప్పారని విమర్శిం చారు. పచ్చకండువా కప్పగానే వారు పునీతులైపోతారా అని ప్రశ్నించారు. తనపై కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి తన నియోజకవర్గంలో కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్న కిరణ్‌కు తనను విమర్శించే అర్హత లేదన్నారు. కాగా, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిమిత్తం వచ్చిన చిరంజీవి కాన్వాయ్‌పై స్థానికులు కోడిగుడ్లు విసిరారు. రామలింగేశ్వరనగర్, స్క్రూబ్రిడ్జి వద్దకు కాన్వాయ్ చేరుకునేసరికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో కొందరు కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు. అయితే అవి చిరంజీవిపై పడలేదు.